జగతిలోని ప్రతి అణువులోనూ శివతత్వం ఇమిడి ఉన్నదన్న పరమతత్వాన్ని ప్రబోధించే దివ్యక్షేత్రం కడలి కపోతేశ్వర క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధికెక్కిన శైవ క్షేత్రాల్లో ఒకటిగా, కుజ, రాహుకేతు దోషాలను రూపుమాపే మహిమాన్విత క్షేత్రంగా గుర్తింపు పొందింది ఈ క్షేత్రం. భక్తుల పాలిట కరుణాసముద్రుడిగా పూజలందుకుంటున్న కపోతేశ్వర స్వామివారికి ఎంతో గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది.
పూర్వం అటవీ ప్రాంతంగా ఉన్న కడలి అనే ప్రాంతంలో ఒక పావురాల జంట నివాసం ఉండేది. తన వృద్ధ తల్లిదండ్రుల ఆకలి బాధను తీర్చేందుకు ఒక వేటగాడు అడవికి వేట కోసం బయలుదేరుతాడు. ఆ సమయంలో అధికంగా వర్షం కురవడంతో వేటగాడికి ఎటువంటి ఆహారం లభ్యం కాదు. వర్షానికి తడిసి ముద్దయిన వేటగాడు పావురాలు కాపురం ఉంటున్న చెట్టుకింద తలదాచుకుంటాడు. చలికి వణుకుతూ తన తల్లిదండ్రులకు ఆహారం సంపాదించి పెట్టలేని జీవితం ఎందుకని బాధతో తల్లడిల్లిపోతాడు. చెట్టుపైన ఉన్న పావురాలు వేటగాడి బాధను గ్రహించి తమ గూటిలోని ఎండుపుల్లలను చెట్టు కింద ఉంచి పక్కనే ఉన్న శ్మశానంలోని రగులుతున్న నిప్పుపుల్లను తెచ్చి మంట రాజేసి వేటగాడిని చలిబాధ నుంచి విముక్తి చేస్తాయి. చలి నుంచి తేరుకున్న వేటగాడిని తమ అతిథిగా భావించి పావురాల జంట ఆ మంటలో దూకి ప్రాణత్యాగం చేసి వేటగాడికి ఆహారమవుతాయి. పావురాల త్యాగానికి చలించిపోయిన వేటగాడు, వాటి ఔదార్యం ముందు తానెంత అనే భావనతో విరక్తి చెంది అదే మంటలో దూకి ఆత్మత్యాగం చేసుకుంటాడు.
పావురాల అతిథి ధర్మానికి, కారుణ్యానికి పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమై పావురాల జంటను తనలో ఐక్యం చేసుకుంటాడు. పావురాలు మహాశివుడిని ప్రార్థించి వేటగాడిని బతికించాలని వేడుకుంటాయి. అలాగే తాము ప్రాణత్యాగం చేసుకున్న ప్రాంతంలో భక్తులను అనుగ్రహించేందుకు ఆ ప్రాంతంలో ఆవిర్భవించవలసిందిగా కోరడంతో పరమశివుడు శ్రీ కపోతేశ్వర స్వామిగా కొలువుదీరారు. కపోత జంటను తనలో లీనం చేసుకున్న గుర్తుగా శివలింగంపై రెండు వైపులా పావురాల తల, రెక్కలు, తోక గుర్తులు ఉంటాయి. వీటిని స్వామి వారికి అభిషేకాలు చేసే సమయంలో నిజరూప దర్శనంలో భక్తులు వీక్షించవచ్చు. గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా ఆవిర్భవించిన స్వామికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తన పడగలతో నీడపట్టాడు. అందుకే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుని రూపంలో ఇలవేల్పుగా వెలియడంతో శివలింగంతో పాటు నాగేంద్రుడు కూడా ఒకే పీఠంపై నిత్య పూజలు అందుకుంటున్నారు. నిత్యం శ్రీ కపోతేశ్వరస్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రతి మాస శివరాత్రికి లక్షబిల్వార్చన పూజలు జరుగుతాయి. మార్గశిర మాసంలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వరునికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవాలు జరిపిస్తారు.
గంగాజలం అంతర్వాహినిగా...
ఆలయానికి అనుకుని ఉన్న కొలను కపోతగుండం (చెరువు)గా ప్రసిద్ధి చెందింది. కాశీలోని గంగాజలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీ నుంచి గంగాజలం అంతర్వాహినిగా వచ్చి కపోతగండంలో కలవటంతో ఆ రోజు మారేడు పత్రాలు ఆ గుండంలో వేస్తే మునిగిపోతాయని, ఆ రోజున కపోత గుండంలో స్నానమాచరించి కపోతేశ్వరుని దర్శిస్తే మోక్షం కలుగుతుందని అర్చకులు వివరిస్తున్నారు.
శ్రీ చక్ర సహిత త్రిపుర సుందరీ దేవి
జగద్గురువులు ఆది శంకరాచార్యులు భారత దేశ పాదయాత్ర చేస్తూ అష్టోత్తర శ్రీ చక్ర సహిత అమ్మవార్ల ఆలయాలను 108 చోట్ల ప్రతిష్ట చేశారు. దీనిలో భాగంగా ఈ క్షేత్రంలో శ్రీ కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి ఎడమవైపు శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారికి నిత్య కుంకుమపూజలు నిర్వహిస్తారు.
క్షేత్ర పాలకుడు జనార్దనుడు
కపోతేశ్వరస్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడుగా జనార్దన స్వామి ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, భద్రకాళీసమేత వీరభద్రస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, కుమార స్వామి, కనకదుర్గాదేవి, నవగ్రహాలు, కాలభైరవస్వామి, శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర సుందరీదేవి, చండీశ్వరుడు, లింగాకారంలో సూర్యనారాయణమూర్తి, పార్వతీదేవి, శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణస్వామి, సువర్చల సహిత ఆంజనేయస్వామి వారి ఉపాలయాల్లో కొలువుతీరారు. సంతాన ం లేని దంపతులు స్వామిని దర్శించుకుని పూజ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.
చారిత్రక నేపథ్యం
క్రీ.శ. 15, 16 శకాలలో పల్లవ రాజులు కపోతేశ్వరస్వామికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ ఆవరణలో దేవనాగర లిపిలో శాసనం ఉంది. రెండు కపోతాలు, ఒక వేటగాడు చేసిన ప్రాణత్యాగానికి ప్రతీకగా శివుడు ఈ ప్రాంతంలో వెలసినట్టు పురాణగాథతోపాటు బోయవాడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా శిలారూపం ఉంది.
ఈ క్షేత్రాన్ని ఇలా చేరుకోవచ్చు...
కడలి శ్రీ కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపాక సెంటరు చేరుకోవాలి. అక్కడ నుంచి ఆటోలు లేదా ట్యాక్సీల ద్వారా క్షేత్రానికి వెళ్లవచ్చు. రాజమండ్రి నుంచి 71 కి.మీ., రాజోలు నుంచి 8 కి.మీ., అమలాపురం నుంచి 22 కి.మీ., దూరం.
సమీపంలోని దర్శనీయ క్షేత్రాలు
శ్రీ కడలి కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి సమీపంలో పలు దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి 10 కి.మీ., దూరంలో ఆదుర్రు గ్రామంలో బౌద్ధస్తూపం, 15 కి.మీ., దూరంలో అప్పనపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ ఆలయం, 30 కి.మీ., దూరంలో రాజోలు మీదుగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, 35 కి.మీ. దూరంలో అమలాపురం మీదుగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ఆలయాలు ఉన్నాయి.
కుజదోష నివారణ క్షేత్రం
స్వయంభువుగా కొలువుతీరిన స్వామి వారి ఆలయంలో శైవాగమ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు 11 మంగళవారాలు క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుంటారు. వివాహం కాని వారు, సంతానం లేని దంపతులు, కుజ దోష నివారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విచ్చేస్తారు.
కాకాని వెంకట సత్య కృష్ణకుమార్, ప్రధాన అర్చకులు
- వి. వీర నాగేశ్వరరావు సాక్షి, రాజోలు
Comments
Please login to add a commentAdd a comment