కాకతీయుల నాటి ఆలయ ఆనవాళ్లు గుర్తింపు!
♦ ఎలుకుర్తి హవేలి సమీపంలో బయల్పడ్డ శిల్పసంపద
♦ ‘గణేశ్వర’ఆలయంగా గుర్తించిన పరిశోధకులు
♦ రామప్ప ఆలయానికి ముందే ఇక్కడ ఆలయ నిర్మాణం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులో బోగంమాటు వద్ద కాకతీయ కాలం నాటి ఆలయ అవశేషాలు వెలుగుచూశాయి. ఆలయానికి సంబంధించిన మూల స్థంభాలు, పునాది, పైకప్పునకు ఉపయోగించిన బండరాళ్లు, శిలా శాసనాలపై చెక్కే సూర్య, చంద్రుల గుర్తులు బయల్పడ్డాయి. ఇవన్నీ క్రీ.శ. 12,13 శతాబ్ధం కాలం నాటివిగా భావిస్తున్నారు. ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన చరిత్ర పరిశోధకుడు కంచి శ్రీనివాస్ వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన ముదిగొండ శ్రీనివాస్ సహకారం అందించారు. లభ్యమైన స్తంభాలు, బండరాళ్ళు, సూర్యచంద్రుల గుర్తులను పరిశీలించిన తర్వాత శిధిలమైన అలనాటి ఆలయం గణపతి లేదా గణేశ్వర ఆలయంగా వారు భావిస్తున్నారు.
కాకతీయ మహాదేవ చక్రవర్తి యాదవరాజైన జైతుగి చేతుల్లో యుద్ధంలో మరణించిన సమయంలో అతడి కుమారుడు గణపతిదేవ చక్రవర్తిని బందీగా చేసుకున్నాడని, ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అంతర్గత తిరుగుబాట్ల నుంచి సర్వసైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రసేనాని కాపాడి, గణపతిదేవుడిని బంధ విముక్తి చేసి చక్రవర్తిగా రాజ్యాన్ని అప్పగించాడని వివరించారు. రుద్రసేనాని స్వామి భక్తికి మెచ్చిన గణపతిదేవుడు మండలంలోని ఎలుకుర్తి రాజ్యాన్ని అతడికి బహుమానంగా ఇచ్చాడన్నారు.
ఎలుకుర్తిలో తనపేరుతోపాటు కుమారుల పేరుతో నాలుగు దేవాలయాలను నిర్మించాడన్నారు.తన పేరుతో రుద్రేశ్వర ఆలయాన్ని, కుమారుల పేరిట లోకేశ్వర, అన్వేశ్వర ఆలయాలను నిర్మించాడని వివరించారు. మరో కుమారుడు గణపతిరెడ్డి పేరు తో నిర్మించిన గణేశ్వరఆలయ అవశేషాలే బయల్పడ్డాయన్నారు. రామప్ప దేవాలయం కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించారన్నారు.