వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రాక రామప్ప ఆలయ అభివృద్ధిని అధికారులు మరిచారు. నిత్యం వందలాది మంది భక్తులు సందర్శించే ఈ ఆలయానికి మేడారం జాతర నేపథ్యంలో వేలాదిగా తరలివస్తున్నారు. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివస్తారు. దూర ప్రాంతాల నుంచి మేడారంను సందర్శించే భక్తులు తిరుగు ప్రయాణంలో వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. మేడారంలో దుమ్ము,దూళితో అలిసిపోయిన భక్తులు రామప్ప ఆలయ ప్రాంగణంలో ఒకరోజు విడిది చేస్తారు. ఈ సందర్భంగా రామప్ప సరస్సులో పుణ్యస్నానాలాచరించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో భోజనాలు వండుకొని తిని విశ్రాంతి తీసుకుంటారు.
మేడారం భక్తులకు సమస్యల స్వాగతం..
మేడారం జాతర మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికే ప్రతిరోజు రామప్పను 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు సందర్శిస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా ఐదు లక్షలకుపైగా భక్తులు రామప్పను సందర్శించే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటి వరకు రామప్పలో కనీస వసతులు అ«ధికారులు కల్పించకపోవడంతో వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, పార్కింగ్ స్థలం, లైటింగ్ వసతి ఇలా ప్రతీ సమస్య భక్తులకు ఎదురు కానుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి రామప్పలో సౌకర్యాలు కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
కానరాని మరుగుదొడ్లు..
గత జాతర సందర్భంగా సరస్సు కట్ట సమీపంలో పది శాశ్వత స్నానఘట్టాలు, పది శాశ్వత మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటి వద్ద నీటివసతి కల్పించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఆ సమయంలో రామప్ప పరిసర ప్రాంతాల్లో 30 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ ఈ సారి తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రామప్పగుడి వద్ద తాత్కాలిక స్నానఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
బస్ సౌకర్యం కల్పించరూ..
నిత్యం రామప్పకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నా ఇక్కడికి బస్‌సౌకర్యం లేదంటే ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతున్నా రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పరకాల, హన్మకొండ, భూపాలపల్లి నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులు నడిపించడం తోపాటు ముఖ్యమైన కూడళ్లతో పాటు ఆలయం వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
రాత్రి 8 గంటల వరకు ఆలయంలోకి అనుమతించాలి
రామప్ప ఆలయంలోకి వెళ్లేందుకు రాత్రి 8 గంటల వరకు భక్తులకు అవకాశం కల్పించాలని మేడారం భక్తులు, పర్యాటకులు పురావస్తుశాఖ అధికారులను కోరుతున్నారు. సాయంత్రం ఆరు దాటితే ఆలయ ప్రధాన గేట్లను మూసి వేస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం మహబూబ్‌నగర్, జగిత్యాలకు చెందిన భక్తులు ఇదే విషయమై పురావస్తుశాఖ సిబ్బందితో గొడవపడి గేటుకు వేసిన చైన్‌ను ధ్వంసం చేసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
కంపు కొడుతున్న పరిసర ప్రాంతాలు
రోజురోజుకు రామప్ప ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతున్నా గ్రామపంచాయతీ అధికారులుగానీ, ఆలయ సిబ్బందిగానీ ఎలాంటి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో రామప్ప పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. రామప్ప ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు వారి వెంట తెచ్చుకున్న భోజన పదార్థాలను ఆరగించి ప్లేట్లను, భోజన పదార్థాలను రోడ్డుపైనే వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది.
అధికారులు విఫలం
రామప్పను సందర్శించే భక్తులకు వసతులు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ శివారులోని ఒగరు కాల్వ వద్ద సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలి. రామప్పలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో రోడ్లకు ఇరువైపులా ప్లేట్లు, మిగిలిపోయిన భోజన పదార్థాలను భక్తులు పడేస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. భక్తుల కోసం రామప్ప పరిసర ప్రాంతాల్లో తాగునీటి వసతి, స్నానఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
వంగ మల్లేష్, పాలంపేట గ్రామస్తుడు
కానరాని నీటి వసతి
రామప్పకు చేరుకోనే మేడారం భక్తులకు ఆలయ సమీపంలో స్నానాలు చేయడానికి ఎలాంటి నీటివసతి లేకపోవడంతో ప్రతిసారి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ ఆవరణలో ఒక చేతిపంపుతోపాటు ఆలయం ముందు చిన్నవాటర్ ట్యాంకు ఉంది. భక్తులు తాగునీటికి వీటిపైనే ఆధారపడుతుండడంతో స్నానాలు చేసేందుకు సరస్సును ఆశ్రయించక తప్పడం లేదు. అంతేగాక ఆలయం ముందు ఇరుకైన కల్వర్టు ఉండడంతో గత ఆరేళ్ల క్రితం మేడారం భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండు లక్షలతో తాత్కాలిక వంతెనతో మరో రహదారి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ వంతెన కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆలయం ఎదుట ఉన్న ఇరుకైన వంతెన(బ్రిడ్జి) కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదకరంగా మారిన వంతెనలకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment