కాకతీయ కట్టడాలకు యునెస్కో గుర్తింపు!
వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బరిలో రామప్ప ఆలయం,
వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్
యునెస్కోకు సమర్పించేందుకు సిద్ధమైన తుది నివేదిక
హన్మకొండ: కాకతీయుల కళా వైభవానికి ప్రతీకలైన రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్ కీర్తితోరణాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ చారిత్రక కట్టడాల విశిష్టతను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంతృప్తి వ్యక్తం చేసింది. 2016 జనవరి 31లోగా యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈ నివేదికను అందచే యనున్నారు. కాకతీయులు నిర్మించిన వేయి స్తంభాలగుడి, ఖిలావరంగల్, రామప్ప ఆలయాలకు 2014లో యునెస్కో హెరిటేజ్ సైట్స్ టెంటిటేటివ్ లిస్టులో చోటు దక్కింది.
తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ కట్టడాల నిర్మాణ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతలను వివరిస్తూ రూ. 20 లక్షల వ్యయంతో నివేదికను రూపొందించారు. ఈ నివేదికపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) డెరైక్టర్ జనరల్ రాకేశ్ తివారీ సంతృప్తి వ్యక్తం చేశారు. 2016 జనవరి 31లోపు పారిస్‌లో ఉన్న యూనిసెఫ్ ప్రధాన కార్యాలయానికి నివేదిక ఏఎస్‌ఐ సమర్పిస్తుందని తెలిపారు. నివేదికను పరిశీలించిన యునెస్కో ప్రతినిధులు వరంగల్‌లో పర్యటించనున్నారు. వీటిపై యునెస్కో సంతృప్తి చెందితే ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు లభిస్తుంది.