
రామప్పలో సిద్ధం చేసిన హెలిప్యాడ్ ప్రాంతం
వెంకటాపురం (ఎం): ఈనెల 28న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రమే హాజరవుతారని భావిస్తున్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కూడా ఖరారయినట్లు సమాచారం. రామప్ప ఆలయానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇప్పటివరకు రాలేదు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ రానుండటంతో పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు రామప్పలో మూడు ప్రత్యేక హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు.
రామప్పలో గంటన్నరపాటు రాష్ట్రపతి...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన గంటన్నరపాటు కొనసాగనుంది. భద్రాచలం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 2:20 గంటలకు ఆమె రామప్పకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:40 సమయంలో ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 3:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. రాష్ట్రపతి విలేకరులతో మాట్లాడతారా లేదా అనేది అధికారికంగా ఖరారు కాలేదు.