రామప్పపై యునెస్కో సందేహాల వెల్లువ | UNESCO Raises Doubts Over Ramappa Temple Development | Sakshi
Sakshi News home page

రామప్పపై యునెస్కో సందేహాల వెల్లువ

Published Sun, Jan 19 2020 8:27 AM | Last Updated on Sun, Jan 19 2020 8:27 AM

UNESCO Raises Doubts Over Ramappa Temple Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉన్న కల్యాణ మండపం పునర్నిర్మాణంలో నెలకొన్న దుస్థితి రామప్పకు ఎదురవుతుందా? రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్న యునెస్కోకు ఈ తరహా సందేహం వచ్చినట్లుంది. రామప్ప పరిరక్షణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, కట్టడంపై దుష్ప్రభావం చూపే పరిస్థితులను సకాలంలో నిరోధించటం, ఆక్రమణల్లేకుండా చూడటం, పర్యాటకుల సంఖ్య పెంచేందుకు చేపట్టే చర్యలు, పర్యాటకుల వల్ల కట్టడంపై ప్రభావం.. తదితర అంశాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి అత్యున్నత స్థాయి హోదా అధికారి ఆధ్వర్యంలో అథారిటీ ఏర్పాటు చేస్తారా అంటూ తాజాగా యునెస్కో ప్రశ్నల వర్షం కురిపించింది.

వచ్చే జూన్‌/జూలైలో చైనాలో జరిగే సమావేశంలో రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని యునెస్కో తేల్చనుంది. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేముందు ఇలాంటి సందేహాను యునెస్కో లేవనెత్తడం సహజమేనని అధికారులు పేర్కొంటున్నా.. రామప్పపై వేయి స్తంభాల దేవాలయ కల్యాణమండపం పునర్నిర్మాణంలో కనిపించిన నిర్లక్ష్యం ప్రభావం ఉంటుందన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. 
అప్పుడే ప్రశ్నించిన యునెస్కో ప్రతినిధి 

గత నవంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోష్యానంద రామప్పను సందర్శించారు. డోజియర్‌లో పేర్కొన్న ప్రత్యేకతలు రామప్ప కట్టడానికి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తన రెండ్రోజుల పర్యటనలో వేయి స్తంభాల దేవాలయాన్ని కూడా చూశారు. ఆలయం పక్కనే అసంపూర్తిగా ఉన్న కల్యాణమండపాన్ని చూసి విస్తుపోయారు. దానికి కారణాలపై వాకబు చేశారు. శిథిలావస్థకు రావటంతో కట్టడాన్ని పునర్నిర్మిస్తున్నామని అధికారులు వివరించారు. కానీ తిరిగి నిర్మించేందుకు ఇన్నేళ్ల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్న లేవనెత్తారు. దీంతో కొన్ని అంతర్గత సమస్యలు అని అధికారులు చెప్పారు. అద్భుత నిర్మాణం దుస్థితిని కళ్లారా చూశాక ఆయనకు రామప్ప విషయంలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా అన్న అనుమానం వచ్చినట్లుంది. అందుకే తాజాగా మన అధికార యంత్రాంగం నుంచి స్పష్టత కోరుతూ యునెస్కో పలు ప్రశ్నలు అడిగింది. 

రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే 
వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉండే కల్యాణమండపాన్ని పునర్నిర్మించేందుకు దశాబ్దన్నర కిందటే విడదీసి ఆ రాళ్లపై సీరియల్‌ నంబర్లు వేసి పక్కన పెట్టారు. చివరకు మూడేళ్ల కింద పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లో రూ.7.5 కోట్ల అంచనాతో మొదలుపెట్టినా.. పైకప్పు వరకు రాకుండానే ఆ నిధులు ఖర్చయిపోయాయి. ఇప్పుడు దాదాపు రూ.కోటి వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి ఉన్నాయి. తదుపరి నిధులు వస్తే కానీ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. దాదాపు రెండేళ్లుగా అవి నిలిచిపోయే ఉన్నాయి. ఈ పనుల్లో పాలుపంచుకునే స్థపతులతో పాటు ఇతర సిబ్బందికి చెల్లించే మొత్తం తాలూకు రేట్లను సవరించాలన్న విజ్ఞప్తి ఉంది. ఆ రేట్లు ఎంతుంటాయో నిర్ధారించేందుకే ఏడాదికిపైగా సమయం పట్టింది. ఇటీవలే ఆ ధరలను పేర్కొంటూ ఏఎస్‌ఐకి ప్రతిపాదన పంపారు.

ముందు చూపు లేకపోవడంతోనే.. 
గతంలో పనులు చేపట్టినప్పుడు క్రేన్లను వినియోగించారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే వాటిని వాడారు. ఇప్పుడు ఆ బిల్లులను క్లియర్‌ చేయటం కష్టంగా మారింది. పునాదులకు అయ్యే వ్యయం రెట్టింపు అయింది. దీనికి కారణాలను ఢిల్లీ అధికారులకు వివరించాల్సి ఉంది. ఇలాంటి చిక్కుముడులతో పనులు పెండింగులో పడి పైకప్పు లేకుండానే మొండి శిలలు వెక్కిరిస్తున్నాయి. 

అలాంటి సమస్య రాదు.. 
‘వేయిస్తంభాల దేవాలయ మండపం పునర్నిర్మాణంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. త్వరలో మళ్లీ పనులు మొదలై ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కే విషయంలో దీని ప్రభావం ఉంటుందనుకోను. కొన్ని అనుమానాలను నివృత్తి చేయాలంటే యునెస్కో కోరిన మాట నిజమే. వాటికి సమాధానాలు పంపాం. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే సమయంలో ఇలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవటం యునెస్కోకు సహజమే’ 
– మల్లేశం, ఏఎస్‌ఐ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement