కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం రామప్ప ఆలయం. ఈ ఆలయానికి యునెస్కో జాబితాలో చోటు లభిస్తే ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతి దక్కనుంది. యునెస్కో అంటే ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన(శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ. అంతర్జాతీయంగా విద్య, విజ్ఞానంతో పాటు సాంస్కృతిక పరిరక్షణ కోసం ఈ సంస్థ పాటుపడుతోంది. ఇప్పటివరకు చారిత్రక ప్రాంతాలకే గుర్తింపు నిస్తుండగా.. కాకతీయులు నిర్మించిన కట్టడం ఈ జాబితాలో స్థానం కోసం పోటీ పడడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
సాక్షి, వెంకటాపురం: దేశంలో 3,867 చారిత్రక కట్టడాలు ఉండగా ఇప్పటివరకు 38 చారిత్రక ప్రాంతాలకు మాత్రమే యునెస్కో జాబితాలో చోటు దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 137 చారిత్రాక కట్టడాలు ఉన్నా ఇప్పటి వరకు ఒక కట్టడానికి కూడా వారసత్వ సంపదగా గుర్తింపు లభించలేదు. ఏటా యునెస్కో గుర్తింపు కోసం దేశం నుండి రెండు, మూడు దరఖాస్తులను కేంద్రం పంపిస్తుండగా 2017లో రామప్ప ఆలయం పేరు కూడా పంపించారు. కానీ ఆలయ ప్రత్యేకతల వివరాలు సరిగా లేవంటూ దరఖాస్తును తిరస్కరించారు. ఈ మేరకు యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ అయిన చూడామణి నందగోపాల్‌తో ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు అందజేశారు. దీంతో 2019 సంవత్సరానికి గాను భారతదేశం నుండి రామప్ప ఆలయం ఒక్కటే యునెస్కో పరిశీలనకు నామినేట్ అయింది. ఈ మేరకు దరఖాస్తుతో జత చేసిన ప్రత్యేకతలు రామప్పలో ఉన్నాయో, లేదో పరిశీలించేందుకు ఈనెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు యునెస్కో(ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ సైట్స్) బృందం రామప్పలో పర్యటించనుంది.
ఫ్లోటింగ్ బ్రిక్స్ (నీటిలో తేలియాడే ఇటుకలు)
కాకతీయుల కాలంలోనే ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని చెప్పొచ్చు. ఆలయ నిర్మాణానికి రాతిని ఉపయోగించి ఆలయంపై ఎలాంటి బరువు ఉండొద్దనే ఉద్దేశంతో గర్భగుడిపై గోపురానికి కేవలం నీటిలో వేస్తే తేలాడే ఇటుకలను వాడారు. సాధారణంగా ఇటుకల సాంద్రత(డెన్సిటీ) 2.2 ఉంటుంది. ఈ ఇటుకలు నీటిలో మునిగిపోతాయి. దీంతో శిల్పి ఆలయ గోపుర నిర్మాణం కోసం 0.8 – 0.9 సాంద్రత(డెన్సిటీ) ఉన్న ఇటుకలను వాడారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే సుమారు మూడురెట్లు తక్కువ బరువు ఉండగా.. ఇలాంటి ఇటుకలతో కట్టిన ఆలయం దేశంలోనే రామప్ప ఒకటే.
కలర్ వేరియేషన్స్(ఆలయానికి మూడు రకాల రాయి)
రామప్ప ఆలయాన్ని సుమారు 300మంది శిల్పులు 40ఏళ్లపాటు కష్టపడి నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం శాండ్‌స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్‌కు చెందిన మూడు రకాల రాళ్లను వాడినట్లు యునెస్కోకు నివేదించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ఫిల్లర్లు, పైకప్పుకు శాండ్‌స్టోన్, ఆలయ భీములకు డోలరైట్, ఆలయంలోని శిల్పాలకు, నల్లరాతి స్తంభాలు గల మండపానికి, గర్భగుడి ముఖద్వారం ఇరుప్రక్కల ఉన్న పేరిణి నృత్య భంగిమలకు బ్లాక్ గ్రానైట్‌ను వాడారు. శాండ్‌స్టోన్ రాయిపై చెక్కిన నృత్య భంగిమల శిల్పాలు అద్దం అంత నునువుగా ఉంటూ నేటికి చెక్కు చెదరలేదు. అంతేకాకుండా శాండ్‌స్టోన్‌తో చేసిన ఒక శిల్పంలో రెండు రంగులు కలిగి ఉండడం మరో ప్రత్యేకత.
శాండ్ బాక్స్ టెక్నాలజీ (ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం)
1213 సంవత్సరంలో కేవలం ఇసుకను పునాదిగా చేసి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడం కోసం 3 మీటర్ల మట్టిని తీసి అందులో ఇసుక నింపారు. ఇసుకను పునాదిగా మార్చి ఒక్కో శిల్పాన్ని పేరుస్తూ వెళ్లారు. పునాది బలంగా ఉండేందుకు, కృంగినా కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా 10–12 అంగుళాల బీమ్‌లు వాడారు. ఆలయ నిర్మాణం కోసం శాండ్‌స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్ రాళ్లు ఉపయోగించారు. 17వ శతాబ్దంలో భూకంపం వచ్చి రామప్ప ఆలయంలోని కళ్యాణ మండపానికి సంబంధించిన 4 భీములు మధ్యలోకి విరిగిపోయినా శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడడం వల్లే ఆలయం చెక్కు చెదరలేదని పురావస్తుశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రతిపాదించిన ప్రత్యేకతలివే..
యునెస్కో కన్సల్టెంట్ చూడామణి నందగోపాల్ ఆలయంపై అధ్యయనం చేసి ఆలయంలోని మూడు ప్రత్యేకతలను తెలియజేస్తూ నివేదించించారు. ఇందులో శాండ్ బాక్స్ టెక్నాలజీ(ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం), ఫ్లోటింగ్ బ్రిక్స్ (నీటిలో తేలాడే ఇటుకలతో గోపురం నిర్మించడం), కలర్ వేరియేషన్స్(ఆలయ నిర్మాణానికి మూడు రకాల రాతిని వాడడం)ను వివరిస్తూ డోషియర్(దరఖాస్తు ప్రతిపాదన)ను తయారు చేసి యునెస్కోకు సమర్పించారు. ఈ అంశాలను పరీశీలించేందుకు యునెస్కో బృం దం వస్తోంది. ఈ బృందం సభ్యులు ఈనెల 24న హైదరాబాద్‌కు చేరుకుని.. 25వ తేదీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుం టుంది. ఆ రోజే కూడా 26వ తేదీన కూడా రామప్ప ఆలయంలోని ప్రతీ ఆంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి రికార్డు చేస్తారు.
ఎన్నో ప్రత్యేకతలు
806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయరాజైన గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయంతో పాటు కాటేశ్వరాలయం, నందిమండపం, శిలశాసనంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ఎలాంటి విద్యుత్‌కాంతులు లేకుండా విరాజిల్లే రుద్రేశ్వరుడు, శివుడికి ఇష్టమైన త్రయోదశికి సూచనగా సూదిమొన పట్టే 13 రంధ్రాలతో చెక్కిన శిల్పం, సరిగమలు పలికే పొన్నచెట్టు, ముగ్గురికి నాలుగు కాళ్లే ఉండే శిల్పాలు రామప్పలో చూపరులను కట్టిపడేస్తాయి. అంతేకాకుండా నాట్యమండపంపై పురాణ ఇతిహాసాలు ప్రతిబం బించే శిల్పాలు, గజాసుర సంహరణ, క్షీరసాగరమథనం దృశ్యాలను వివరించే శిల్పాలు కనువిందు చేస్తాయి. మరో విశేషమేమిటంటే సాధారణంగా ఏ ఆలయాన్నైనా అందులో ఉండే మూలవిరాట్ పేరుతో లేదా నిర్మించిన వారి పేరుతో పిలుస్తాం. కానీ రామప్ప అనే శిల్పి కళానైపుణ్యానికి నిదర్శనంగా ఆలయానికి ఆయన పేరే పెట్టడం మరో విశేషం.
యునెస్కో గుర్తింపు వస్తే..
రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే ఆలయ అభివృద్ధి్దకి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుంది. రామప్పకు మెరుగైన రవాణా మార్గం ఏర్పాటు చేయడమే కాకుండా పరిసరప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చి పరిరక్షణ చర్యలు చేపడుతారు. తద్వారా దేశ, విదేశీ పర్యాటకులు పెరగనుండడంతో అంతర్జాతీయ పర్యాటకుల కోసం కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు
రూ.8 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు
రామప్ప ఆలయాన్ని ఈనెల 25, 26వ తేదీల్లో యునెస్కో బృందం సందర్శించనున్న నేపథ్యంలో సుమారు రూ.8కోట్లతో పురావస్తుశాఖ అధికారులు అభివృద్ది పనులను చేపట్టారు. గత నెలరోజులుగా చేపడుతున్న ఈ పనులు పూర్తికావొచ్చాయి. ప్ర«ధాన ఆలయానికి తూర్పు ప్రాకారగోడ పునరుద్ధరణ, కాటేశ్వరాలయం, నందిమండపం చుట్టూ ఆఫ్రాన్ ప్లా్లట్‌ఫాం ఏర్పాటు, గొల్లాల గుడి వినియోగంలోకి తేవడం, తూర్పుముఖద్వారం వైపు సీసీ రోడ్డు వేసి తూర్పు ముఖద్వారాన్ని వినియోగంలోకి తీసుకువచ్చారు. పడమటి ముఖద్వారాన్ని రెండు మీటర్ల నుండి నాలుగు మీటర్ల రోడ్డుగా విస్తరించి సీసీ వేశారు. అలాగే, రెండు ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి వాహనాలు దిగపడకుండా గ్రావెల్ పోశారు. గార్డెన్‌లో పూలమొక్కలు ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం కెఫటేరియా, క్లాక్ రూం, టాయిలెట్ బ్లాక్, ఆర్‌ఓ డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు కల్పించారు. రామప్ప సరస్సు కట్టపై బోర్డు కనిపించేలా పెయింటింగ్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment