హన్మకొండ: విశిష్టమైన కాకతీయ కట్టడాలకు, అద్భుత శిలా సంపదకు నెలవైన రామప్ప ఆలయాన్ని నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. చాపకింద నీరులా చీమలు ఈ ఆలయానికి చేటు చేస్తున్నాయి. వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయులు పాలించారు. వీరి కాలంలో గొలుసుకట్టు చెరువులతో పాటు వేయిస్తంభాలగుడి, రామప్ప ఆలయం , కీర్తితోరణాలు వంటి అనేక రాతి కట్టడాలను అద్భుతంగా నిర్మించారు. స్థానికంగా ఉండే భౌగోళిక పరిస్థితులో ఎక్కువ కాలం కట్టడాలు నిలిచి ఉండేలా నాటి నిర్మాతలు జాగ్రత్తలు పాటించారు.
ఎనిమిది వందల ఏళ్ల క్రితమే శాండ్‌బాక్స్ పద్ధతి ద్వారా నిర్మాణాలు చేపట్టారు. నల్లరేగడి నేలలో భారీ రాతికట్టడాలు కుంగి పోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని అవలంబించారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా పునాదుల నుంచి బలమైన శిలలను కాకుండా ఇసుకతో నింపారు. ఈ ఇసుక పునాదిపై రాళ్లను పేర్చుకుంటూ పోయి వేయిస్తంభాలగుడి, రామప్ప ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలు నిలిచి ఉండటానికి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రధాన కారణం. చీమల కారణంగా ఈ కట్టడాలకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది.
ప్రమాదం ఎలా?
ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి కారణంగా శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం నిర్మించిన ఆలయ పునాదుల్లో ఉపయోగించిన ఇసుక బయటకు వస్తోంది. ఆలయంలో పలుచోట్ల చీమల కారణంగా ఇసుకు బయటకు వచ్చి పేరుకుపోతోంది. ఇలా పేరుకుపోయిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. చీమల కారణంగా పునాదుల్లో ఇసుక బయటకు రావడం వల్ల ఆలయ పటిష్టతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
నిర్లక్ష్యం చేస్తే..
రామప్ప ప్రధాన ఆలయానికి ఇరువైపులా కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం ఉన్నాయి. చీమల కారణంగా కామేశ్వరాలయం పునాదులు కుంగిపోవడంతో ఆలయం ఒకే వైపుకు ఒరిగిపోయింది. ప్రమాదభరితంగా మారడంతో ఈ ఆలయాన్ని తొలగించారు. ప్రస్తుతం రామప్ప ప్రధాన ఆలయంలో చీమలు సంచారం ఎక్కువైంది. ఇదే తీరుగా నిర్లక్ష్యం వహిస్తే పునాదుల్లో ఉన్న ఇసుక నిల్వలు తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని కారణంగా ఆలయ పటిష్టత ప్రమాదంలో పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రామప్ప ఆలయానికి చీమలతో ముప్పు!
Published Thu, Sep 22 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement
Advertisement