వాటిముందు మనుషులు బలాదూరే
అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు
మనుషులను తలదన్నే సమిష్టి నిర్ణయ శక్తి చిట్టి చీమల సొంతమట! ప్రణాళికను వ్యూహాత్మకంగా అమలుచేయడం, చేసిన తప్పును మళ్లీ చేయకుండా జాగ్రత్త పడటం, కొత్త తరహాలో ప్రయత్నించి సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో మనిషితో పోలిస్తే చీమల్లో ఉమ్మడి నిర్ణయ శక్తి చాలా ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. సంబంధిత ప్రయోగ ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఎలా కనిపెట్టారు?
ఇజ్రాయెల్‌లోని విజ్‌మ్యాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థలోని పరిశోధకులు ఈ ప్రయోగం చేశారు. పైనుంచి పియానోలాగా కనిపించే ఆంగ్ల పెద్ద అక్షరం ‘టీ’ ఆకారంలో ఒక సూక్ష్మ స్థాయి వస్తువును చీమల ముందుంచారు. అది ఆహారమని భ్రమించేలా చేశారు. దంతో చీమలు గుంపులుగా దాన్ని మోసుకెళ్లాయి. మార్గమధ్యంలో అడ్డుగా నిలిపిన రెండు గడపలు, గోడలను గుండా తరలించాల్సిన పరిస్థితి కల్పించారు. ముందు నుంచి, వెనుక నుంచి మార్చి మార్చి ప్రయత్నించాయి. కుదరకపోవడంతో అక్షరాన్ని వంపుగా పక్కకు జరిపి ప్రయత్నించాయి. అయినా కొన అడ్డు తగులుతుండటంతో మరో వైపు నుంచి ప్రయత్నించాయి. చివరికి ఏ కొన నుంచైతే దాన్ని గడప దాటించొచ్చో కనిపెట్టి ఆ వైపుగా ముందుకు జరుపుకుంటూ ఎట్టకేలకు అడ్డంకిని దాటేశాయి. ఈ క్రమంలో కలసికట్టుగా ప్రయత్నించాయి. అంతేగాక చేసిన తప్పును మళ్లీ చేయకుండా ప్రయత్నించడం విశేషం.
మనుషుల కంటే మెరుగ్గా
తర్వాత ఇదే పనిని అచ్చం ఇలాగే కొందరు మనుషులకు అప్పజెప్పారు. త్వరగా ముగించాలన్న తొందరలో వాళ్లు హడావిడిగా ప్రయత్నించారు. ఉమ్మడిగా పని చేస్తున్నా ఒకే నిర్ణయాన్ని కలసికట్టుగా అమలు చేయలేకపోయారు. అదే విడిగా ఒక్కో మనిషే ఆ పనిని చిటికెలో చేయడం విశేషం. అదే ఒక్క చీమ మాత్రం ఈ పని చేయలేకపోయింది. తర్వాత ఏడు చీమలకు ఒక గుంపుగా, 80 చీమలు ఒక గుంపుగా, ఇలా రకరకాలుగా ‘టీ’ అక్షరాన్ని తరలించే పని ఇచ్చి సమీక్షించారు. మనుషులకు కూడా విడిగా ఒక్కరికి, 6 నుంచి 9 మంది గుంపుకు, 26 మందితో కూడిన గుంపుకు పని అప్పగించారు.
మాసు్కలు, నల్ల కళ్లద్దాలు...
చీమలు కలిసి పనిచేసేటప్పుడు మాట్లాడుకుంటాయో లేదో తెలీదు. కనుక మనుషులకు అవాంఛిత మొగ్గు ఉండకుండా వారి మధ్య కూడా సమాచార మారి్పడిని నిషేధించారు. మాస్కులు, సైగలు చేసుకోకుండా నల్ల కళ్లద్దాలిచ్చారు. ఎక్కువ చీమలున్న గుంపు అద్భుత పనితీరు ప్రదర్శించింది. చిక్కు ప్రశ్న లాంటి గడుల పజిల్‌ను చీమలు విడివిడిగా అర్థం చేసుకోవడంలో విఫలమైనా ఉమ్మడిగా మాత్రం వేగంగా పరిష్కారం కనుగొన్నాయని విజ్‌మ్యాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ముఖ్య పరిశోధకుడు ఓఫెర్ ఫినెర్‌మ్యాన్ వెల్లడించారు. ‘‘మనుషులతో పోలిస్తే చీమల్లో ఇది ఆహారానికి సంబంధించిన కీలకమైన పని. అందుకే అవి మనసు పెట్టి పని చేశాయి. స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని అద్భుతంగా వాడుకున్నాయి. మనుషుల్లో మాత్రం సైగల్లేకుండా ప్రయత్నించినప్పుడు ఉమ్మడిగా కూడా ప్రదర్శన పేలవంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
చీమల కాలనీ...ఒకటే జీవసమూహం
‘‘లక్షల చీమలు నేలలో ఒకే కాలనీగా బతుకుతాయి. ఆ రకంగా అవి అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల వంటివి. ఆహారం వేట, తరలింపు, నిల్వే వాటి ప్రధాన లక్ష్యాలు. అందుకు ఉమ్మడిగా పని చేస్తాయి. ఎప్పుడూ కలిసే ఉంటాయి. పోటీతత్వం కంటే సహకార భావన ఎక్కువ. అందుకే చీమలు చూడ్డానికి విడిగా ఉన్నా అవన్నీ ఒకే జీవసమూహం. ఒక శరీరంలోని అవయవాలు వేర్వేరు పనులు చేసినట్లు ఒక కాలనీలోని చీమలు వేర్వేరు పనులు చేస్తాయంతే’’ అని ఓఫెర్ చెప్పారు. హడావిడి, పని ముగించాలన్న తొందర లేకుండా మనసు పెట్టి పని చేస్తే ఉమ్మడి నిర్ణయం విజయవంతమవుతుందని పరిశోధనలో తేలిందని ముక్తాయించారు. పొడవాటి కొమ్ములతో క్రేజీ చీమలుగా పేరొందిన పారాట్రెచీనా లాంగీకారీ్నస్ రకాన్ని ఈ పరిశోధనకు వినియోగించారు.
-న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment