డిసెంబర్‌లో 19, 20, 21 తేదీల్లో నిర్వహణ
ఏర్పాట్లపై వచ్చే వారం సమావేశం
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, ఆలయాలు, పట్టణాలు... విధానాలుగా పరిపాలన సాగించిన కాకతీయుల కీర్తిని స్మరించుకునేందుకు కాకతీయ ఉత్సవాలను జాతీయస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాకతీయ ఉత్సవాలు గతేడాది రాష్ట్ర స్థాయిలో జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. వరంగల్ జిల్లాలోని వేయిస్థంభాల గుడి, రామప్ప ఆలయం, ఖిలావరంగల్, గణపురం కోటగుళ్లు వేదికలుగా డిసెంబర్ 19, 20, 21వ తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.
తెలంగాణలోని మిగిలిన తొమ్మిది జిల్లా కేంద్రాల్లో ఒక్కో రోజు ఈ ఉత్సవాలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా న్విరహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో అంతర్జాతీయ స్థాయి కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానంపై వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహిస్తారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రతిష్టాత్మక వేయి స్తంభాలగుడి కల్యాణ మంటపాన్ని ఉత్సవాల సందర్భంగా పునఃప్రారంభోత్సవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు రూ. 80 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.
ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వచ్చే వారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.కాకతీయ పాలకురాలు రుద్రమాదేవి పట్టాభిషిక్తురాలై 800 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి 2014 డిసెంబర్ వరకు నిర్వహించిన కాకతీయ ఉత్సవాలను నిర్వహించింది. ఇవి తూతుమంత్రంగానే జరిగాయి. ఉత్సవాల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు మాత్రమే కాస్త చెప్పుకునే విధంగా నిర్వహించారు.
ఉత్సవాల నిర్వహణపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. సమైక్య రాష్ట్రంలో నిధుల కొరత కారణంగా కాకతీయ ఉత్సవాలు వెలవెలబోయాయని, ప్రత్యేక రాష్ట్రంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అప్పట్లో కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు కచ్చితంగా ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో 2014 డిసెంబర్‌లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
జాతీయస్థాయిలో కాకతీయ ఉత్సవాలు
Published Sat, Nov 15 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement