Kakatiya celebrations
-
ఉత్సవాల ఊసేది
కాకతీయ వేడుకలకు వీడని గ్రహణం ఏడాది కాలంగా వాయిదా అమలు కాని సీఎం హామీ {పత్యేక రాష్ట్రంలోనూ భంగపాటేనా.. కాకతీయ ఉత్సవాలు నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నాయి. వీటి నిర్వహణకు ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవాలే తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏడాది కాలంగా కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. - సాక్షి, హన్మకొండ కాకతీయ ఉత్సవాల నిర్వహణపై గత పాలకులు మొదటి నుంచీ తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. మొదట 2012 నవ ంబర్‌లో ఉత్సవాలు ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. దీంతో 2012 డిసెంబర్‌కు వాయిదా వేశారు. ప్రారంభోత్సవాలకు కోటి రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. కొసరి..కొసరి అరకొర నిధులే విడుదల చేయగా, వాటితోనే ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యూక కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో 2015 ఫిబ్రవరిలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు అప్పటి కలెక్టర్ జి.కిషన్ జనవరిలో షెడ్యూల్ ప్రకటించారు. కేసీఆర్ అసంతృప్తి.. 2015 జనవరిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరంగల్‌లో మూడు రోజుల పాటు బస చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. కాకతీయ ఉత్సవాల నిర్వహణపై జిల్లా యంత్రాంగం ప్రకటించిన షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్లాక ఉన్నతాధికారులతో చర్చించి వివరాలు వెల్లడిస్తామని, కాకతీయ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఏడాది గడిచినా ఉలుకూ పలుకూ లేదు. కాకతీయ వైభవాన్ని చాటే అవకాశం.. 2012 డిసెంబర్ నుంచి ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా కాకతీయుల కళా వైభవాన్ని నలుదిశలా చాటే అవకాశం కలిగింది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయపసేనాని రచించిన నృత్యరత్నావళి సంస్కృత గ్రంధాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. కాకతీయుల చరిత్ర, కట్టడాలకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించేందుకు కాకతీయ డైనాస్టీ పేరుతో ముద్రించిన కాఫీ టేబుల్ బుక్ అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభపై న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించారు. కాకతీయుల చరిత్ర, కట్టడాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలు కొత్తగా వెలువడ్డాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పలు పనులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే హన్మకొండలో హారిత కాకతీయ పేరుతో త్రీస్టార్ హోటల్ ప్రారంభమైంది. రూ.5 కోట్లతో ఖిలావరంగల్‌లో సౌండ్ అండ్ లైట్షో, గణపురం కోటగుళ్లలో రూ. 65 లక్షల వ్యయంతో పర్యాటకులకు వసతి సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. లక్నవరంలో లేక్ కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ ఫెస్టివల్‌కు గుర్తుగా కాజీపేట వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం, కాకతీయుల విశిష్టతను తెలిపే సావనీర్ వంటివి ఆవిష్కృతమయ్యాయి. -
ఓరుగల్లు వెలగాలి
⇒జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష ⇒73 కిలోమీటర్ల రింగురోడ్డు ⇒అనుబంధంగా రేడియల్ రోడ్లు ⇒నగరంలో మూడు చోట్ల ఫ్లై ఓవర్లు ⇒వడ్డేపల్లిపై ‘మిషన్ కాకతీయ’ పైలాన్ ⇒జాతీయ స్థాయిలో కాకతీయ ఉత్సవాలు ⇒ఆల్ ఇన్ వన్‌గా టెక్స్టైల్ పార్కు నిర్మాణం ⇒పేదలకు ఇళ్ల పట్టాలపై సానుకూల నిర్ణయం ‘‘దేశంలోని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన టెక్స్టైల్ పార్కును వరంగల్‌లో నెలకొల్పుతాం. కాకతీయుల కళోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. పార్లమెంట్లో రాణి రుద్రమదేవి ఫొటో ఉండాలని అసెం బ్లీలో తీర్మానం చేసి పంపుతాం.’’ - సీఎం కేసీఆర్ సాక్షి, హన్మకొండ : రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు దిశానిర్దేశం చేసేందుకు కేసీఆర్ సోమవారం జిల్లాకు వచ్చారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల నుంచి సీఎం పలు కీలక అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగరం ఇప్పటికే కిక్కిరిసి పోయింది. కొత్తగా వచ్చే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలను వరంగల్ నగరానికి తరలిస్తాం. దీనివల్ల వరంగల్ నగర జనాభా కొన్నేళ్లలోనే రెట్టింపు అవుతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 20 లక్షల జనాభా నివసించేందుకు అనువుగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి’ అని చెప్పారు. నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కీలక అంశాలపై సమావేశంలోనే నిర్ణయాలు ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ సమీక్ష సమావేశం అనంత రం డిప్యూటీ సీఎం రాజయ్య సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రధాన రహదారి విస్తరణ వరంగల్ నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న రాంపూర్ నుంచి ధర్మారం వరకు 30 కిలోమీటర్ల ప్రధాన రహదారిని 150 అడుగులకు విస్తరించాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా రహదారి విస్తరణ వల్ల స్థానికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున 100 అడుగులకు పరిమితం చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సీఎంను కోరారు. ఔటర్ రింగురోడ్లు వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కించేందుకు వరంగల్ నగరం చుట్టూ 73 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో 29 కిలోమీటర్ల రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉండగా 44 కిలోమీటర్ల నిడివి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి నిధుల సమీకరణ ఏ విధంగా చేపట్టాలనే అంశంపై అధికారులతో సీఎం చర్చించారు. నగరంలో పెరిగే ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రోడ్లను రేడియల్ రోడ్లుగా విస్తరించాలని సూచించారు. అందులో భాగంగా కాకతీయ యూనివర్సిటీ-పెద్దమ్మగడ్డ, అమరవీరుల స్థూపం-నాయుడు పెట్రో లు పంప్, కడిపికొండ-ఉర్సురంగంపేట, పో చమ్మమైదాన్-సీకెఎం కాలేజీ- ఆరేపల్లి, నర్సంపేట రో డ్డు-ఏనుమాముల మార్కెట్-ములుగురోడ్డు, నిట్-కేయూసీ క్రాస్ వరకు ఉన్న సింగిల్, డబుల్ రోడ్ల ను 150 అడుగులకు విస్తరించాలని సూచించారు. మూడు చోట్ల ఫ్లై ఓవర్లు హైదరాబాద్‌కు ధీటుగా నగరాన్ని అభివృద్ధి పథం లో నడిపించడంలో భాగంగా నగరంలో మూడు చో ట్ల మల్టీ లెవెల్ సెపరేటర్స్ (ఫ్లై ఓవర్లు)లు నిర్మించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే పోలీస్ హెడ్‌క్వార్టర్, ములుగురోడ్డు, పోచమ్మమైదా న్ జంక్షన్ల వద్ద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన పనులు యు ద్ధప్రతిపాదికన మొదలుపెట్టాలన్నారు. మల్టీ లెవల్ సెపరేటర్స్తోపాటు రింగురోడ్డు నిర్మాణంలో ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. హైదరాబాద్, కరీంనగర్, నర్సంపేట, ఖమ్మం, ములుగు ప్రధాన రహదారులు, రింగురోడ్డు కలిసే చోట ఈ వంతెనలు నిర్మించనున్నారు. కాకతీయ ఉత్సవాలు కాకతీయ ఉత్సవాల ద్వారా ఓరుగల్లుకు గతంలో ఉన్న కీర్తిని తిరిగి ఇనుమడింప చేయాలి. ఈ ఉత్సవాలను వరంగల్‌కే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు కాకతీయ చరిత్రలో ప్రాముఖ్యత ఉన్న తేదీని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. దీని వల్ల ప్రతీ ఏటా ఆ తేదీల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చన్నారు. ఉత్సవాలను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహిస్తామని, వీటికి సంబంధించి కచ్చితమైన తేదీలను రెండు మూడురోజుల్లో సీఎం ప్రకటించనున్నారు. ఈ ఏడు జరగబోయే ఉత్సవాల్లో భాగంగా లేజర్ షో ఏర్పాటు, ప్రత్యేక ప్రచురణలు, డాక్యుమెంటరీలు తీసుకురావాలన్నారు. ఈ కాకతీయ ఉత్సవాల్లో భాగంగా లక్నవరం, ఘనపురం, పాకాల చెరువుల వద్ద పడవ పందాలు, కుస్తీ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనితోపాటు కాకతీయ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయాలని సూచించారు. విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య అంశాల్లో పోటీలు, కళాకారులు, క్రీడాకారులు, వైద్యులు, చరిత్ర కారులు వివిధ వర్గాలవారు ఇందులో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభ సూచికగా వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం చేపడతామన్నారు. దేశంలోనే అత్యుత్తమ టెక్స్టైల్స్ పార్కు దేశంలోనే అత్యంత నాణ్యత ప్రమాణాలతో టెక్స్టైల్స్ పార్కు వరంగల్‌లో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ మరోసారి తెలిపారు. సూరత్‌లో దొరికే చీరలు, సల్వార్ మెటీరియల్, తిర్పూర్ రెడీమేడ్ వస్తువులు, షోలాపూర్ చద్దర్లు ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే అన్ని వస్తువులు ఒకే చోట లభ్యమయ్యేలా వరంగల్ టెక్స్పార్కు నిర్మాణం జరుగుతుందన్నారు. టెక్స్టైల్ పార్కుకు అనుబంధంగా టౌన్షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ నగర శివారు ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నగరం చుట్టు పక్కల ఏడు ప్రాంతాల్లో 2,391.44 ఎకరాలు ఉన్నట్లుగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మడిపల్లి-అనంతసాగర్-జయగిరిల గ్రామాల సమీపంలో 500.3 ఎకరాలు, చింతగట్టు-భీమారం గ్రామల సమీపంలో 364.13 ఎకరాలు, వంగపహడ్ పరిధిలో 274.08 ఎకరాలు, ఆరేపల్లి-సిద్ధాపూర్ల సమీపంలో 410.25 ఎకరాలు, శాయంపేట్ 123.34 ఎకరాలు, చిన్నపెండ్యాల 145.22 ఎకరాలు, పంథిని- చెన్నారం 364.02 ఎకరాలు, కక్కిరాలపల్లి 210.10 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని సమగ్రంగా పరిశీలించి అనువైన ప్రాంతంలో టెక్స్టైల్స్ పార్కు నెలకొల్పుతామన్నారు. సాధ్యాసాధ్యాలను బట్టి టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుకు నగరశివారు ప్రాంతాలతోపాటు ధర్మసాగర్ మండలం దేవనూరు, ములుగు మండలం జాకారంలో ఉన్న రిజర్వ్ ఫారెస్టు భూములను పరిగణలోకి తీసుకోవాలన్నారు. టెక్స్టైల్ పార్కు నగరానికి సమీపంలోనే ఉండాలని స్పష్టంగా ఆదేశించారు. పేదలపై వరాల జల్లు నగరంలో ఇప్పటికే నివాసం ఉంటున్న పేదలకు 120 గజాల వంతున స్థలాలు ఇచ్చే విషయంపై కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనితోపాటు నగరంలో ఉన్న పేదలను గుర్తించి వీరందరికీ నగరంలో ఓ చోట సామూహికంగా ఒకే చోట ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) పరిధిలోని గ్రామాలను అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మంత్రులు ఆజ్మీర చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లికృష్ణారావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, గుండు సుధారాణి, కడియం శ్రీహరి, ఆజ్మీర సీతారాంనాయక్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్.రెడ్యానాయక్, కొండా సురేఖ, ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బి.శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపూరి రాజలింగం, ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రనాయక్, కలెక్టర్ జి.కిషన్ తదితరులు పాల్గొన్నారు. రివ్యూ రెండుసార్లు హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం ఉదయం, సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగిన సీఎం అక్కడి నుంచి వాహన శ్రేణిలో కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్లో 12.20 నుంచి 1.45 గంటల వరకు సమీక్ష నిర్వహించారు. అనంతరం హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో భోజనం చేసిన అనంతరం మళ్లీ 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుబేదారి ప్రాం తంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ లోకి ఉద్యోగులను గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే అనుమతించారు. సోమవారం ప్రజావాణి కూడా రద్దు చేసిన అధికారులు.. సామాన్య ప్రజలను కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. కలెక్టరేట్లో తొలిసారి మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వెళ్లిన తరువాత ఉప ముఖ్యంత్రి తాటికొండ రాజయ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ కిషన్ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షలోని ముఖ్యాంశాలను వివరించారు. -
వినయ్.. సీఎంవో..
⇒ పార్లమెంటరీ కార్యదర్శి పదవి... సీఎం కార్యాలయంలో విధులు ⇒ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి వరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రి హోదాలో వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా పని చేయనున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవి వస్తుందని భావించారు. రాష్ట్ర వ్యాప్త సమీకరణలతో ఇప్పుడు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి వచ్చింది. వినయ్‌భాస్కర్ 2009, 2010, 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో వరంగల్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అంతకుముందు 1999, 2004 ఎన్నికల్లో హన్మకొండ(ప్రస్తుతం వరంగల్ పశ్చిమ) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2005 నుంచి టీఆర్ఎస్లో క్రియాశీలంగా పని చేస్తున్నారు. వరంగల్ నగర అధ్యక్షుడిగా ఇటీవలి సాధారణ ఎన్నికల ముందు వరకు పని చేశారు. వినయ్ డిమాండ్లు తీరాయి.. గత ఏడాది కాకతీయ ఉత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అప్పటి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ‘తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న కాకతీయుల వారసులను ఉత్సవాలకు ఆహ్వానించాలి. రాణిరుద్రమదేవికి సంబంధించి నల్లగొండ జిల్లాల్లో ఉన్న కట్టడాలకు ప్రాధాన్యత పెం చాలి’ అని వినయ్‌భాస్కర్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉత్సవాల వేదికపైకి వెళ్లకుండా నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో కాకతీయ ఉత్సవాలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో చేసిన ప్రతిపాదనలను వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్నిం టిపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ స్థలాల్లో గడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు 120 గజాల చొప్పును క్రమబద్ధీకరించాలని వినయభాస్కర్ విజ్ఞప్తిని కేసీఆర్ ఆమోదం తెలి పారు. ప్రధానంగా దీన్‌దయాల్‌నగర్‌లో నివసిస్తున్న వారి విషయంలో వినయ్‌భాస్కర్ ఈ ప్రతిపాదనను సీఎంకు వివరించారు. తన విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై వినయ్‌భాస్కర్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
జనవరిలో కాకతీయ ఉత్సవాలు
వరంగల్‌లో మూడు రోజులు, ఇతర జిల్లాల్లో రెండు రోజులు నాటి కళావైభవం ఉట్టిపడేలా నిర్వహణ పర్యాటక భవన్లో సన్నాహక సమావేశం సాక్షి, హైదరాబాద్: కాకతీయ ఉత్సవాలను వచ్చే జనవరి రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో జనవరి 10, 11 తేదీల్లో జరపాలని నిర్ణయించగా, వరంగల్ జిల్లాలో మాత్రం ఒకరోజు ముందుగా 9వ తేదీన ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణాచారిలు సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, ఆ శాఖ సంచాలకులు హరికృష్ణ, వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్, సమాచార శాఖ సంచాలకులు సుభాష్‌గౌడ్‌లతో పర్యాటక భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్యంలో అలరారిన కళాసంపదతో పాటు వారసత్వ కళలను, ప్రజాదరణ పొందిన గ్రామీణ కళారూపాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలని వారు ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి ఏర్పాట్లు చేయాలని, ఇందుకు సాంస్కృతిక శాఖ సంచాలకులు, వరంగల్ జిల్లా కలెక్టర్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని, ఉత్సవాలను వీలైనంత ఎక్కువ మంది తిలకించేలా జిల్లా కేంద్రాల్లో వేదికను తీర్చిదిద్దాలని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లతో ఊరారా ప్రచారం చేయాలని, ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వృద్ధ కళాకారులకు ఇటీవల రూ.1,500కు పెంచిన పింఛన్‌ను ఈ సందర్భంగా పంపిణీ చేసేందుకు వీలుగా పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారులే కాకుండా కొత్తగా అర్హులను కూడా గుర్తించాలని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేయాలని, ఉత్సవాల సందర్భంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు, మేధావులు, కళాకారులతో వేదిక వరకు ర్యాలీ నిర్వహించాలని పర్యాటక శాఖ అడిషనల్ చీఫ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్టాక్ కన్వీనర్లు అనూరాధారెడ్డి, పాండురంగారావు, పురావస్తు శాఖ సంచాలకులు మనోహర్, శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 27 నుంచి కాకతీయ ఉత్సవాలు
హన్మకొండ అర్బన్ (వరంగల్): వచ్చే నెల 27, 28, 29వ తేదీల్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చిందని వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కాకతీయ ఉత్సవాలపై హన్మకొండ లోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షిం చేందుకు ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మధ్యాహ్నం 12గంట లకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కేవీ.రమణాచారి, పాపారావు, టూరిజం, కల్చరల్ సెక్రటరీ బీపీ.ఆచార్య, సమా చార శాఖ కమిషనర్ చంద్రవదన్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు ఇతర ఉన్నతాధి కారులు హాజరుకానున్నట్లు వివరించారు. వరంగల్ జిల్లాలోని రామప్ప, గణపురం, ఖిలా వరం గల్, వేయిస్తంభాల ఆలయంతోపాటు నల్లగొండ జిల్లా పొనగల్లు, ఖమ్మం జిల్లా పెర్టు, మెదక్ జిల్లా కోలచలను, హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం, కరీంనగర్‌లోని ఎలగందుల పోర్టు, రంగారెడ్డిలోని అనంతగిరి, ఆదిలాబాద్‌లోని గాంధారికోట, మహబూబ్‌నగర్‌లోని అలం పూర్, నిజామాబాద్‌లోని డిచ్పల్లి ప్రదేశాల్లో నిర్వహించాలని ప్రతిపాదనలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. -
కాకతీయ ఉత్సవాలు డిసెంబర్ 27 నుంచి...
హన్మకొండ అర్బన్ : వచ్చే నెల 27, 28, 29వ తేదీల్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. హన్మకొండలోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం కాకతీయ ఉత్సవాలపై ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించేందుకు ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కేవీ.రమణాచారి, పాపారావు, టూరిజం, కల్చరల్ సెక్రటరీ బీపీ.ఆచార్య, సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు వివరించారు. వరంగల్ జిల్లాలోని రామప్ప, గణపురం, ఖిలా వరంగల్, వేయిస్తంభాల ఆలయంతోపాటు నల్లగొండ జిల్లా పొనగల్లు, ఖమ్మం జిల్లా పెర్టు, మెదక్ జిల్లా కోలచలను, హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం, కరీంనగర్‌లోని ఎలగందుల పోర్టు, రంగారెడ్డిలోని అనంతగిరి, ఆదిలాబాద్‌లోని గాంధారికోట, మహబూబ్‌నగర్‌లోని అలంపూర్, నిజామాబాద్‌లోని డిచ్పల్లి ప్రదేశాల్లో వైభవంగా నిర్వహించాలని ఇదివరకే ప్రతిపాదనలు చేసినట్లు కలెక్టర్ గంగాధర కిషన్ తెలిపారు. -
జాతీయస్థాయిలో కాకతీయ ఉత్సవాలు
డిసెంబర్లో 19, 20, 21 తేదీల్లో నిర్వహణ ఏర్పాట్లపై వచ్చే వారం సమావేశం సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, ఆలయాలు, పట్టణాలు... విధానాలుగా పరిపాలన సాగించిన కాకతీయుల కీర్తిని స్మరించుకునేందుకు కాకతీయ ఉత్సవాలను జాతీయస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాకతీయ ఉత్సవాలు గతేడాది రాష్ట్ర స్థాయిలో జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్లో జాతీయ స్థాయిలో కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. వరంగల్ జిల్లాలోని వేయిస్థంభాల గుడి, రామప్ప ఆలయం, ఖిలావరంగల్, గణపురం కోటగుళ్లు వేదికలుగా డిసెంబర్ 19, 20, 21వ తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణలోని మిగిలిన తొమ్మిది జిల్లా కేంద్రాల్లో ఒక్కో రోజు ఈ ఉత్సవాలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా న్విరహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో అంతర్జాతీయ స్థాయి కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానంపై వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహిస్తారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రతిష్టాత్మక వేయి స్తంభాలగుడి కల్యాణ మంటపాన్ని ఉత్సవాల సందర్భంగా పునఃప్రారంభోత్సవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు రూ. 80 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వచ్చే వారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.కాకతీయ పాలకురాలు రుద్రమాదేవి పట్టాభిషిక్తురాలై 800 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి 2014 డిసెంబర్ వరకు నిర్వహించిన కాకతీయ ఉత్సవాలను నిర్వహించింది. ఇవి తూతుమంత్రంగానే జరిగాయి. ఉత్సవాల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు మాత్రమే కాస్త చెప్పుకునే విధంగా నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. సమైక్య రాష్ట్రంలో నిధుల కొరత కారణంగా కాకతీయ ఉత్సవాలు వెలవెలబోయాయని, ప్రత్యేక రాష్ట్రంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అప్పట్లో కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు కచ్చితంగా ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో 2014 డిసెంబర్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.