కాకతీయ వేడుకలకు వీడని గ్రహణం
ఏడాది కాలంగా వాయిదా అమలు కాని సీఎం హామీ
{పత్యేక రాష్ట్రంలోనూ భంగపాటేనా..
కాకతీయ ఉత్సవాలు నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నాయి.
వీటి నిర్వహణకు ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవాలే తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏడాది కాలంగా కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. - సాక్షి, హన్మకొండ
కాకతీయ ఉత్సవాల నిర్వహణపై గత పాలకులు మొదటి నుంచీ తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. మొదట 2012 నవ ంబర్‌లో ఉత్సవాలు ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. దీంతో 2012 డిసెంబర్‌కు వాయిదా వేశారు. ప్రారంభోత్సవాలకు కోటి రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. కొసరి..కొసరి అరకొర నిధులే విడుదల చేయగా, వాటితోనే ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యూక కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో 2015 ఫిబ్రవరిలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు అప్పటి కలెక్టర్ జి.కిషన్ జనవరిలో షెడ్యూల్ ప్రకటించారు.
కేసీఆర్ అసంతృప్తి..
2015 జనవరిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరంగల్‌లో మూడు రోజుల పాటు బస చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. కాకతీయ ఉత్సవాల నిర్వహణపై జిల్లా యంత్రాంగం ప్రకటించిన షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్లాక ఉన్నతాధికారులతో చర్చించి వివరాలు వెల్లడిస్తామని, కాకతీయ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఏడాది గడిచినా ఉలుకూ పలుకూ లేదు.
కాకతీయ వైభవాన్ని చాటే అవకాశం..
2012 డిసెంబర్ నుంచి ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా కాకతీయుల కళా వైభవాన్ని నలుదిశలా చాటే అవకాశం కలిగింది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయపసేనాని రచించిన నృత్యరత్నావళి సంస్కృత గ్రంధాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. కాకతీయుల చరిత్ర, కట్టడాలకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించేందుకు కాకతీయ డైనాస్టీ పేరుతో ముద్రించిన కాఫీ టేబుల్ బుక్ అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభపై న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించారు. కాకతీయుల చరిత్ర, కట్టడాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలు కొత్తగా వెలువడ్డాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పలు పనులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే హన్మకొండలో హారిత కాకతీయ పేరుతో త్రీస్టార్ హోటల్ ప్రారంభమైంది. రూ.5 కోట్లతో ఖిలావరంగల్‌లో సౌండ్ అండ్ లైట్‌షో, గణపురం కోటగుళ్లలో రూ. 65 లక్షల వ్యయంతో పర్యాటకులకు వసతి సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. లక్నవరంలో లేక్ కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ ఫెస్టివల్‌కు గుర్తుగా కాజీపేట వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం, కాకతీయుల విశిష్టతను తెలిపే సావనీర్ వంటివి ఆవిష్కృతమయ్యాయి.