ఓరుగల్లు వెలగాలి | Warangal to be next development destination | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు వెలగాలి

Published Tue, Dec 30 2014 4:23 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

ఓరుగల్లు వెలగాలి - Sakshi

ఓరుగల్లు వెలగాలి

జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష
73 కిలోమీటర్ల రింగురోడ్డు
అనుబంధంగా రేడియల్ రోడ్లు
నగరంలో మూడు చోట్ల ఫ్లై ఓవర్లు
వడ్డేపల్లిపై ‘మిషన్ కాకతీయ’ పైలాన్
జాతీయ స్థాయిలో కాకతీయ ఉత్సవాలు
ఆల్ ఇన్ వన్‌గా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం
పేదలకు ఇళ్ల పట్టాలపై సానుకూల నిర్ణయం


‘‘దేశంలోని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌లో నెలకొల్పుతాం. కాకతీయుల కళోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. పార్లమెంట్‌లో రాణి రుద్రమదేవి ఫొటో ఉండాలని అసెం బ్లీలో తీర్మానం చేసి పంపుతాం.’’
 - సీఎం కేసీఆర్
సాక్షి, హన్మకొండ : రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు దిశానిర్దేశం చేసేందుకు కేసీఆర్ సోమవారం జిల్లాకు వచ్చారు.

జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల నుంచి సీఎం పలు కీలక అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగరం ఇప్పటికే కిక్కిరిసి పోయింది. కొత్తగా వచ్చే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలను వరంగల్ నగరానికి తరలిస్తాం. దీనివల్ల వరంగల్ నగర జనాభా కొన్నేళ్లలోనే రెట్టింపు అవుతుంది.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 20 లక్షల జనాభా నివసించేందుకు అనువుగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి’ అని చెప్పారు. నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కీలక అంశాలపై సమావేశంలోనే నిర్ణయాలు ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ సమీక్ష సమావేశం అనంత రం డిప్యూటీ సీఎం రాజయ్య సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
 
ప్రధాన రహదారి విస్తరణ
వరంగల్ నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న రాంపూర్ నుంచి ధర్మారం వరకు 30 కిలోమీటర్ల ప్రధాన రహదారిని 150 అడుగులకు విస్తరించాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా రహదారి విస్తరణ వల్ల స్థానికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున 100 అడుగులకు పరిమితం చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సీఎంను కోరారు.
 
ఔటర్ రింగురోడ్లు
వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కించేందుకు వరంగల్ నగరం చుట్టూ 73 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో 29 కిలోమీటర్ల రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉండగా 44 కిలోమీటర్ల నిడివి కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి నిధుల సమీకరణ ఏ విధంగా చేపట్టాలనే అంశంపై అధికారులతో సీఎం చర్చించారు.

నగరంలో పెరిగే ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రోడ్లను రేడియల్ రోడ్లుగా విస్తరించాలని సూచించారు. అందులో భాగంగా కాకతీయ యూనివర్సిటీ-పెద్దమ్మగడ్డ, అమరవీరుల స్థూపం-నాయుడు పెట్రో లు పంప్, కడిపికొండ-ఉర్సురంగంపేట, పో చమ్మమైదాన్-సీకెఎం కాలేజీ- ఆరేపల్లి, నర్సంపేట రో డ్డు-ఏనుమాముల మార్కెట్-ములుగురోడ్డు, నిట్-కేయూసీ క్రాస్ వరకు ఉన్న సింగిల్, డబుల్ రోడ్ల ను 150 అడుగులకు విస్తరించాలని సూచించారు.  
 
మూడు చోట్ల ఫ్లై ఓవర్లు
హైదరాబాద్‌కు ధీటుగా నగరాన్ని అభివృద్ధి పథం లో నడిపించడంలో భాగంగా నగరంలో మూడు చో ట్ల మల్టీ లెవెల్ సెపరేటర్స్ (ఫ్లై ఓవర్లు)లు నిర్మించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే పోలీస్ హెడ్‌క్వార్టర్, ములుగురోడ్డు, పోచమ్మమైదా న్ జంక్షన్ల వద్ద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు.

ఇందుకు సంబంధించిన పనులు యు ద్ధప్రతిపాదికన మొదలుపెట్టాలన్నారు. మల్టీ లెవల్ సెపరేటర్స్‌తోపాటు రింగురోడ్డు నిర్మాణంలో ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. హైదరాబాద్, కరీంనగర్, నర్సంపేట, ఖమ్మం, ములుగు ప్రధాన రహదారులు, రింగురోడ్డు కలిసే చోట ఈ వంతెనలు నిర్మించనున్నారు.
 
కాకతీయ ఉత్సవాలు
కాకతీయ ఉత్సవాల ద్వారా ఓరుగల్లుకు గతంలో ఉన్న కీర్తిని తిరిగి ఇనుమడింప చేయాలి. ఈ ఉత్సవాలను వరంగల్‌కే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు కాకతీయ చరిత్రలో ప్రాముఖ్యత ఉన్న తేదీని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. దీని వల్ల ప్రతీ ఏటా ఆ తేదీల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చన్నారు.

ఉత్సవాలను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహిస్తామని, వీటికి సంబంధించి కచ్చితమైన తేదీలను రెండు మూడురోజుల్లో సీఎం ప్రకటించనున్నారు. ఈ ఏడు జరగబోయే ఉత్సవాల్లో భాగంగా లేజర్ షో ఏర్పాటు, ప్రత్యేక ప్రచురణలు, డాక్యుమెంటరీలు తీసుకురావాలన్నారు. ఈ కాకతీయ ఉత్సవాల్లో భాగంగా లక్నవరం, ఘనపురం, పాకాల చెరువుల వద్ద పడవ పందాలు, కుస్తీ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.

దీనితోపాటు కాకతీయ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయాలని సూచించారు. విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య అంశాల్లో పోటీలు, కళాకారులు, క్రీడాకారులు, వైద్యులు, చరిత్ర కారులు వివిధ వర్గాలవారు ఇందులో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభ సూచికగా వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం చేపడతామన్నారు.
 
దేశంలోనే అత్యుత్తమ టెక్స్‌టైల్స్ పార్కు
దేశంలోనే అత్యంత నాణ్యత ప్రమాణాలతో టెక్స్‌టైల్స్ పార్కు వరంగల్‌లో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ మరోసారి తెలిపారు. సూరత్‌లో దొరికే చీరలు, సల్వార్ మెటీరియల్, తిర్పూర్ రెడీమేడ్ వస్తువులు, షోలాపూర్ చద్దర్లు ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే అన్ని వస్తువులు ఒకే చోట లభ్యమయ్యేలా వరంగల్ టెక్స్‌పార్కు నిర్మాణం జరుగుతుందన్నారు. టెక్స్‌టైల్ పార్కుకు అనుబంధంగా టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామన్నారు.
 
ఈ సందర్భంగా వరంగల్ నగర శివారు ప్రాంతాల్లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నగరం చుట్టు పక్కల ఏడు ప్రాంతాల్లో 2,391.44 ఎకరాలు ఉన్నట్లుగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మడిపల్లి-అనంతసాగర్-జయగిరిల గ్రామాల సమీపంలో 500.3 ఎకరాలు, చింతగట్టు-భీమారం గ్రామల సమీపంలో 364.13 ఎకరాలు, వంగపహడ్ పరిధిలో 274.08 ఎకరాలు, ఆరేపల్లి-సిద్ధాపూర్‌ల సమీపంలో 410.25 ఎకరాలు, శాయంపేట్ 123.34 ఎకరాలు, చిన్నపెండ్యాల 145.22 ఎకరాలు, పంథిని- చెన్నారం 364.02 ఎకరాలు, కక్కిరాలపల్లి 210.10 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వీటిని సమగ్రంగా పరిశీలించి అనువైన ప్రాంతంలో టెక్స్‌టైల్స్ పార్కు నెలకొల్పుతామన్నారు. సాధ్యాసాధ్యాలను బట్టి టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటుకు నగరశివారు ప్రాంతాలతోపాటు ధర్మసాగర్ మండలం దేవనూరు, ములుగు మండలం జాకారంలో ఉన్న రిజర్వ్ ఫారెస్టు భూములను పరిగణలోకి తీసుకోవాలన్నారు. టెక్స్‌టైల్ పార్కు నగరానికి సమీపంలోనే ఉండాలని స్పష్టంగా ఆదేశించారు.
 
పేదలపై వరాల జల్లు
నగరంలో ఇప్పటికే నివాసం ఉంటున్న పేదలకు 120 గజాల వంతున స్థలాలు ఇచ్చే విషయంపై కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనితోపాటు నగరంలో ఉన్న పేదలను గుర్తించి వీరందరికీ నగరంలో ఓ చోట సామూహికంగా ఒకే చోట ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) పరిధిలోని గ్రామాలను అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
 
ఈ సమావేశంలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మంత్రులు ఆజ్మీర చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లికృష్ణారావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, గుండు సుధారాణి, కడియం శ్రీహరి, ఆజ్మీర సీతారాంనాయక్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్.రెడ్యానాయక్, కొండా సురేఖ, ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బి.శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపూరి రాజలింగం, ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రనాయక్, కలెక్టర్ జి.కిషన్ తదితరులు పాల్గొన్నారు.
 
రివ్యూ రెండుసార్లు
హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం ఉదయం, సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగిన సీఎం అక్కడి నుంచి వాహన శ్రేణిలో కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో 12.20 నుంచి 1.45 గంటల వరకు సమీక్ష నిర్వహించారు.

అనంతరం హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో భోజనం చేసిన అనంతరం మళ్లీ 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుబేదారి ప్రాం తంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ లోకి ఉద్యోగులను గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే అనుమతించారు. సోమవారం ప్రజావాణి కూడా రద్దు చేసిన అధికారులు.. సామాన్య ప్రజలను కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు.

కలెక్టరేట్‌లో తొలిసారి మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వెళ్లిన తరువాత ఉప ముఖ్యంత్రి తాటికొండ రాజయ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ కిషన్ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షలోని ముఖ్యాంశాలను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement