పజ్జూరులో తొలి యుగ ఆనవాళ్లు..! | First Period Landmarks in pajjuru | Sakshi
Sakshi News home page

పజ్జూరులో తొలి యుగ ఆనవాళ్లు..!

Published Thu, Jan 21 2016 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

పజ్జూరులో తొలి యుగ ఆనవాళ్లు..!

పజ్జూరులో తొలి యుగ ఆనవాళ్లు..!

♦ పురాతన ఆవాస ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లా పజ్జూరు గ్రామం
♦ 25 ఎకరాల విస్తీర్ణంలో శోధిస్తే నాటి 2వ శతాబ్ద చరిత్ర వెలుగులోకి..
♦ తవ్వకాలకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి
♦14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశానికి త్వరలోనే పరిష్కారం
♦ నేడు సందర్శించనున్న రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్
♦ స్థానికులు సహకరిస్తే ఆధారాలు లభిస్తాయంటున్న అధికారులు
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఒకటి, రెండు శతాబ్దాల జీవన శైలిని కళ్లకు కట్టే చారిత్రక ఆధారాలకు నల్లగొండ జిల్లా నెలవు కానుంది. తొలి చారిత్రక యుగంలో మానవులు వాడిన ఆయుధాలు, అలంకరణలు, ఆభరణాలు ఎన్నో లభించిన నీలగిరిలో మళ్లీ అలాంటి ఆధారాలే లభించనున్నాయని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రమైన నల్లగొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తి మండలం పజ్జూరు శివారులోని పాటిమీద ఉన్న 25 ఎకరాల విస్తీర్ణం లో తొలిచారిత్రక యుగం నాటి ఆవాస ప్రాంతం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

గతంలో లభించిన విగ్రహాలు, ప్రతిమలు, ఆభరణాల ఆధారం గా ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు అనేక సార్లు ఆర్కియాలజికల్ ఇండియా (ఏఎస్‌ఐ) అనుమతి కోరినా 14 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. అయితే, ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఏఎస్‌ఐ అనుమతి లభించడంతో త్వరలోనే ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు లభిస్తాయని పురావస్తు శాఖ అధికారులు విశ్వసిస్తున్నారు.  రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి. బ్రహ్మచారి గురువారం పజ్జూరు  లో ఉన్న ఈ క్షేత్రాన్ని పరిశీలించనున్నారు.

 మూడు నెలల క్రితమే..
 ఇక్కడి చారిత్రక ఆధారాలపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు శాఖ అధికారులు మూడు నెలల క్రితం ఇక్కడ పరిశోధన చేశారు. పురావస్తు శాఖ జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ పి. నాగరాజు అక్కడకు వెళ్లి పజ్జూరు పాటి మీద ఉన్న ఆ క్షేత్రాన్ని పరిశీలించారు. అప్పుడు ఆ క్షేత్రంలో ప్రాథమిక స్థాయి ఆధారాలు లభించాయి. ఎర్రని, నల్లని కుండ పెంకులు, అప్పటి మహిళలు అలంకరణ కోసం ఉపయోగించే పూసలు, ఇతర ఆభరణాలు దొరికాయి. అప్పట్లో మహిళలు ఎలా ఉండేవారో ప్రతిబింబించే మృణ్మయ (టైట) ప్రతిమ కూడా లభించింది. చెవి రింగులు కూడా దొరికాయి. ఇక్కడ ఓ బౌద్ధ స్థూపం ఉందని, అయితే అది పూర్తిగా ధ్వంసమైయిందని  అధికారులు చెబుతున్నారు.  పొలాల్లో అప్పుడప్పుడు దొరుకుతున్న చారిత్రక ఆనవాళ్లు ఏంటో అర్థం కాక రైతులు వాటిని పారేసేవారని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు.  స్థానికులు ఇచిచన ఈ ఆధారాల మేరకు జిల్లా పురావస్తుశాఖ అధికారులు ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కోరారు.

 1941లోనే తొలి తవ్వక ఆధారాలు
 నల్లగొండ జిల్లాలో ఇప్పటికే శాతవాహనులు, ఇక్ష్వాకులు, మహాక్షత్రీయులు, మహా తలవరీ యులు, రోమన్ సామ్రాజ్యాల ఆనవాళ్లు లభిం చాయి. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో ఆయా రాజ్యాల్లో వాడిన నాణేలు, గారప్రతిమలు, బుద్ధుని జీవనశైలిని ఆవిష్కరించే సున్నపురాయి పలకలు లభించాయి. తొలుత 1941-44 మధ్య కాలం లో (స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ సామ్రా జ్య కాలంలోనే) ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా అనుమతి మేరకు 2000 సంవత్సరం నుంచి ఈ తవ్వకాలు దఫదఫాలుగా జరుపుతున్నారు.

ఈ తవ్వకాల్లో బంగారు, రాగి, సీసం, వెండి, పుటిన్‌తో తయారు చేసిన నాణేలు లభించాయి.  ఆనాటి  ఎగేట్, చెట్, లాపిస్లాజిలీ అనే అలంకరణ ఆభరణ  సామగ్రి, మట్టిపూసలు కూడా దొరికాయి.  ఇక్ష్వాక వంశస్తుడు వీరపురుష దత్తుని రాజ్యం లో చెక్కించిన గౌతమ బుద్ధుడి జీవనగాధలను ప్రతిబింబించే సున్నపు రాయి పలకలు లభిం చాయి. బుద్ధుడి జననం, మహాభినిష్ర్కమ ణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరి నిర్వాణం విశేషాలను ఈ పలకల్లో పొందుపర్చారు.
 
 ఆమె నమ్మకం.. వారి పూనకం
 వాస్తవానికి ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న విషయం నాటకీయ పరిస్థితిలో వెలుగులోకి వచ్చింది. 2001లో పజ్జూరు గ్రామంలో ఓ రైతు పొలంలో దేవతను పోలిన విగ్రహం లభించింది. ఈ విగ్రహం చూసిన వారంతా పూనకం పొందుతుండడంతో ఆమె నమ్మకం.. వారి పూనకం అంటూ గ్రామంలో వదంతులు వచ్చాయి. చివరకు అది 10,11 శతాబ్దాల్లో పూజలందుకున్న భైరవమూర్తి విగ్రహమని తేలింది. దీనిగురించి తెలుసుకున్న అప్పటి ఆర్కియాలజీ డెరైక్టర్ రాంలక్ష్మణ్ ఈ ప్రాంతం వాసే కావడంతో.. ఆయన హైదరాబాద్ నుంచి భానుమూర్తి అనే అధికారిని పరిశోధన కోసం పంపారు. ఆయన ఈ విగ్రహాన్ని పరిశీలించి తొలి చారిత్రక యుగ ఆనవాళ్లను గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ తవ్వకాల కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూనే ఉన్నా.. ఇప్పటికి మోక్షం కలగడం విశేషం.
 
 చారిత్రక ఆనవాళ్లు లభించాయి
 ‘పజ్జూరు పాటి మీద తొలి చారిత్రక యుగ ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతంలో ఒకటి, రెండు శతాబ్దాలకు చెందిన ఆవాస ప్రాంతం ఉందనేది మా అభిప్రాయం. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతి వచ్చింది. స్థానికులు సహకరిస్తే రెండు, మూడు నెలల్లో చారిత్రక ఆధారాలను వెలుగులోకి తెస్తాం.’
 - పి. నాగరాజు, అసిస్టెంట్‌ై డెరెక్టర్, పురావస్తు శాఖ, నల్లగొండ
 
 

 ఆమనగల్లులో 8, 9 శతాబ్దాల విగ్రహాలు
 వేములపల్లి : నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో గల గుట్టపై ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాలలో 8, 9 శతాబ్దాలకు చెందిన దేవతా విగ్రహాలను గుర్తించినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన గడ్డం రాంస్వరూప్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు బుధవారం పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పి.నాగరాజు ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలలోని శాసనాలు, దేవతా విగ్రహాలను పరిశీలించారు. 1300 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాలలో ఉందన్నారు.

ఆలయ నిర్వహణకు ఎవరెవరు ఎంత భూమిని విరాళంగా ఇచ్చారన్న అంశం కూడా వీటిలో ఉందన్నారు. 15 రోజుల్లో పూర్తిస్థాయి పరిశోధన అనంతరం స్పష్టత వస్తుందన్నారు. 8, 9 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్ధిని, నంది, బ్రహ్మ, వల్లీ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను తాము గుర్తించినట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలోరెండు శాసనాలను  గుర్తించామని వీటిని రాష్ట్ర కూటులు వేసినట్లుగా తెలుస్తోందన్నారు. భావితరాలకు వీటి గురించి తెలిపేందుకు సిమెంటు దిమ్మెలపై శాసనాలు, విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పురావస్తుశాఖ అధికారి వెంట తెలంగాణ చరిత్ర పరిశోధన బృందం సభ్యుడు హరగోపాల్  తదితరులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement