Historical landmarks
-
సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో
పారిస్: అమెరికా–ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో కీలక సూచన చేసింది. దేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్ ఇరాన్ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
కొండగుట్టల్లో.. చారిత్రక ఆనవాళ్లు!
సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : శతాబ్దాల నాటి చరిత్రను పుటలుగా దాచుకున్న కొండవీడుకోటలో అప్పుడప్పుడు అలనాటి అవశేషాలు కనిపిస్తూ అందరిని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. చరిత్ర ఖజాన కొండవీడు కొండలపై గురువారం ఓ రాతితొట్టి బయల్పడింది. అసలు యంత్రాలు ఊసేలేని నాటి కాలంలో ఏకరాతిని ఏమాత్రం పగళ్లు రాకుండా తొలచి 4 అడుగుల పొడవు, 1.5 వెడల్పు, అడుగులోతుతో తయారు చేసిన ఈ తొట్టె క్రీ.శ.1400 నుంచి 1500 శతాబ్దాల కాలానికి చెందినదిగా తెలుస్తోంది. ఆనాటి కొండవీడు రాజధానిలోని అశ్వాలకు నీరు తాగించేందుకు దానిని ఉపయోగించి ఉంటారని కొందరు అభిప్రాయ పడుతుండగా.. అంతకు పూర్వం బౌద్ధభిక్షువులు ఈతొట్టిని ఏర్పాటు చేసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. నాడు అరిటాకు ‘రాతి’ విస్తరి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొండవీడు ఉత్సవాల సమయంలో సందర్శకులకు వసతుల ఏర్పాటు చేస్తున్న క్రమంలో అరిటాకును పోలిన రాతి విస్తరి దొరికింది. అరటి ఆకు, దాని ముందు 8 గిన్నెలను రాతిపై అద్భుతంగా ఏకరాతిపై చెక్కి ఉన్న రాతి విస్తరిని రెడ్డిరాజులు తమ పూజా కార్యక్రమంలో వినియోగించి ఉంటారని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. అంతకు కొద్ది రోజుల ముందే రాముడికి పరమభక్తుడైన ఆంజనేయస్వామి భారీ ప్రతిమను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ విగ్రహానికి పైభాగాన శ్రీనివాసుని శంఖు, చక్రాలు కూడా చెక్కి ఉండటం అధికారులనే కాదు పర్యాటకులను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లోనే వీటికి రంగులు వేసి పర్యాటకులకు సందర్శనార్థం ప్రదర్శనుకు ఉంచారు. ఆ తర్వాత మ్యూజియంకు తరలించారు. వెలుగుచూసిందిలా.. కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి కొండవీడు కొండలపై ప్రాంతాలను పరిశీలిస్తుండగా శిథిలమైన ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌కు పశ్చిమాన ఉన్న మార్గం మధ్యలో రాతి తొట్టి కనిపించింది. వెంటనే పురావస్తు, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యంలో పనిచేసే ఉద్యోగులు తమ అశ్వాలకు నీటిని తాగించేందుకు ఈ ప్రాంతంలో తొట్టిని ఏర్పాటు చేసి ఉంటారని, ఈ తొట్టి లభించిన ప్రాంతానికి సమీపంలోనే మత్తడి (నీటివనరు) ఉండటం కూడా వారి వాదనను బలపరుస్తోంది. ఇదే ప్రాంతంలో అలనాటి నివాసాల ఆనవాళ్లు, రోళ్లు పడి ఉన్నాయి. దీనికి అత్యంత సమీపంలోనే కొండరాయి చుట్టూ మర్రిఊడలు అల్లుకున్న సహజ సుందర దృశ్యం పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఉంది. -
లింగవరం ఆనవాళ్లు బృహత్ శిలాయుగానివే
వెంకటగిరి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లింగవరం గ్రామంలో గతంలో లభించిన చారిత్రక ఆనవాళ్లు 4,000 సంవత్సరాలకు పూర్వం బృహత్ శిలాయుగపు కాలానికి చెందినవిగా వెంకటగిరికి చెందిన షేక్ రసూల్ అహ్మద్ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. లింగవరంలో ఇటీవల పురాతన మట్టి పాత్రలు లభించడంతో ఆ గ్రామాన్ని తమ బృందంతో కలసి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామానికి ఉత్తరంగా ఉన్న 50 ఎకరాల ఇసుక దిబ్బల్లో ప్రాచీన మానవుని నివాస, ఖనన స్థలాలను గుర్తించామన్నారు. ఇసుక దిబ్బ కింద పదుల సంఖ్యలో పెద్ద, చిన్న మట్టి కుండలు లభించినట్లు వివరించారు. రెండున్నర అడుగులున్న ఓ మట్టి కుండలో చిన్న టెర్రాకోట మూతలతో మూసి ఉన్న చిన్న మట్టి కుండలు ఎర్రటి, నల్లటి రంగుల్లో ఉన్నాయని తెలిపారు. దిగువ భాగాన మానవ అస్థికలు ఊకరూపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎర్రటి పెద్ద మట్టి కుండ పైభాగంలో జంతువుల బొమ్మలు చిత్రించి ఉన్నాయని, ఇవి ఆనాటి కళాత్మక పని తీరుకు నిదర్శనమన్నారు. మరికొంత దూరంలో పెద్ద రింగ్‌వాల్ మృతుల బావిని సూచిస్తుందన్నారు. శ్మశానానికి దగ్గరలో నివాస స్థలాలు: కండలేరు ఉప్పకాలువకు సమీపంలో ఉన్న ఈ ప్రాచీన శ్మశానానికి దగ్గర్లో నివాస స్థలాలు ఉన్నాయని, ఒకప్పుడు ఈ ప్రాంతం పట్టణ కేంద్రంగా ఉండొచ్చ నని రసూల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఇక్కడి మట్టి, ఇటుకలను గృహ నిర్మాణాల కోసం స్థానికులు ఉపయోగించి ఉండవచ్చన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇసుక ప్రాంతంలో ప్రాచీన మానవుడి జాడలు కనుగొన్నప్పటికీ పురావస్తుశాఖగా ని, ప్రభుత్వంగాని తగు చర్యలు తీసుకోకపోతే గొప్ప చారిత్రక స్థలం ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
పజ్జూరులో తొలి యుగ ఆనవాళ్లు..!
♦ పురాతన ఆవాస ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లా పజ్జూరు గ్రామం ♦ 25 ఎకరాల విస్తీర్ణంలో శోధిస్తే నాటి 2వ శతాబ్ద చరిత్ర వెలుగులోకి.. ♦ తవ్వకాలకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ♦14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశానికి త్వరలోనే పరిష్కారం ♦ నేడు సందర్శించనున్న రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ ♦ స్థానికులు సహకరిస్తే ఆధారాలు లభిస్తాయంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఒకటి, రెండు శతాబ్దాల జీవన శైలిని కళ్లకు కట్టే చారిత్రక ఆధారాలకు నల్లగొండ జిల్లా నెలవు కానుంది. తొలి చారిత్రక యుగంలో మానవులు వాడిన ఆయుధాలు, అలంకరణలు, ఆభరణాలు ఎన్నో లభించిన నీలగిరిలో మళ్లీ అలాంటి ఆధారాలే లభించనున్నాయని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రమైన నల్లగొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తి మండలం పజ్జూరు శివారులోని పాటిమీద ఉన్న 25 ఎకరాల విస్తీర్ణం లో తొలిచారిత్రక యుగం నాటి ఆవాస ప్రాంతం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో లభించిన విగ్రహాలు, ప్రతిమలు, ఆభరణాల ఆధారం గా ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు అనేక సార్లు ఆర్కియాలజికల్ ఇండియా (ఏఎస్ఐ) అనుమతి కోరినా 14 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. అయితే, ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఏఎస్ఐ అనుమతి లభించడంతో త్వరలోనే ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు లభిస్తాయని పురావస్తు శాఖ అధికారులు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి. బ్రహ్మచారి గురువారం పజ్జూరు లో ఉన్న ఈ క్షేత్రాన్ని పరిశీలించనున్నారు. మూడు నెలల క్రితమే.. ఇక్కడి చారిత్రక ఆధారాలపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు శాఖ అధికారులు మూడు నెలల క్రితం ఇక్కడ పరిశోధన చేశారు. పురావస్తు శాఖ జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ పి. నాగరాజు అక్కడకు వెళ్లి పజ్జూరు పాటి మీద ఉన్న ఆ క్షేత్రాన్ని పరిశీలించారు. అప్పుడు ఆ క్షేత్రంలో ప్రాథమిక స్థాయి ఆధారాలు లభించాయి. ఎర్రని, నల్లని కుండ పెంకులు, అప్పటి మహిళలు అలంకరణ కోసం ఉపయోగించే పూసలు, ఇతర ఆభరణాలు దొరికాయి. అప్పట్లో మహిళలు ఎలా ఉండేవారో ప్రతిబింబించే మృణ్మయ (టైట) ప్రతిమ కూడా లభించింది. చెవి రింగులు కూడా దొరికాయి. ఇక్కడ ఓ బౌద్ధ స్థూపం ఉందని, అయితే అది పూర్తిగా ధ్వంసమైయిందని అధికారులు చెబుతున్నారు. పొలాల్లో అప్పుడప్పుడు దొరుకుతున్న చారిత్రక ఆనవాళ్లు ఏంటో అర్థం కాక రైతులు వాటిని పారేసేవారని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. స్థానికులు ఇచిచన ఈ ఆధారాల మేరకు జిల్లా పురావస్తుశాఖ అధికారులు ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కోరారు. 1941లోనే తొలి తవ్వక ఆధారాలు నల్లగొండ జిల్లాలో ఇప్పటికే శాతవాహనులు, ఇక్ష్వాకులు, మహాక్షత్రీయులు, మహా తలవరీ యులు, రోమన్ సామ్రాజ్యాల ఆనవాళ్లు లభిం చాయి. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో ఆయా రాజ్యాల్లో వాడిన నాణేలు, గారప్రతిమలు, బుద్ధుని జీవనశైలిని ఆవిష్కరించే సున్నపురాయి పలకలు లభించాయి. తొలుత 1941-44 మధ్య కాలం లో (స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ సామ్రా జ్య కాలంలోనే) ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా అనుమతి మేరకు 2000 సంవత్సరం నుంచి ఈ తవ్వకాలు దఫదఫాలుగా జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో బంగారు, రాగి, సీసం, వెండి, పుటిన్‌తో తయారు చేసిన నాణేలు లభించాయి. ఆనాటి ఎగేట్, చెట్, లాపిస్లాజిలీ అనే అలంకరణ ఆభరణ సామగ్రి, మట్టిపూసలు కూడా దొరికాయి. ఇక్ష్వాక వంశస్తుడు వీరపురుష దత్తుని రాజ్యం లో చెక్కించిన గౌతమ బుద్ధుడి జీవనగాధలను ప్రతిబింబించే సున్నపు రాయి పలకలు లభిం చాయి. బుద్ధుడి జననం, మహాభినిష్ర్కమ ణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరి నిర్వాణం విశేషాలను ఈ పలకల్లో పొందుపర్చారు. ఆమె నమ్మకం.. వారి పూనకం వాస్తవానికి ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న విషయం నాటకీయ పరిస్థితిలో వెలుగులోకి వచ్చింది. 2001లో పజ్జూరు గ్రామంలో ఓ రైతు పొలంలో దేవతను పోలిన విగ్రహం లభించింది. ఈ విగ్రహం చూసిన వారంతా పూనకం పొందుతుండడంతో ఆమె నమ్మకం.. వారి పూనకం అంటూ గ్రామంలో వదంతులు వచ్చాయి. చివరకు అది 10,11 శతాబ్దాల్లో పూజలందుకున్న భైరవమూర్తి విగ్రహమని తేలింది. దీనిగురించి తెలుసుకున్న అప్పటి ఆర్కియాలజీ డెరైక్టర్ రాంలక్ష్మణ్ ఈ ప్రాంతం వాసే కావడంతో.. ఆయన హైదరాబాద్ నుంచి భానుమూర్తి అనే అధికారిని పరిశోధన కోసం పంపారు. ఆయన ఈ విగ్రహాన్ని పరిశీలించి తొలి చారిత్రక యుగ ఆనవాళ్లను గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ తవ్వకాల కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూనే ఉన్నా.. ఇప్పటికి మోక్షం కలగడం విశేషం. చారిత్రక ఆనవాళ్లు లభించాయి ‘పజ్జూరు పాటి మీద తొలి చారిత్రక యుగ ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతంలో ఒకటి, రెండు శతాబ్దాలకు చెందిన ఆవాస ప్రాంతం ఉందనేది మా అభిప్రాయం. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతి వచ్చింది. స్థానికులు సహకరిస్తే రెండు, మూడు నెలల్లో చారిత్రక ఆధారాలను వెలుగులోకి తెస్తాం.’ - పి. నాగరాజు, అసిస్టెంట్ై డెరెక్టర్, పురావస్తు శాఖ, నల్లగొండ ఆమనగల్లులో 8, 9 శతాబ్దాల విగ్రహాలు వేములపల్లి : నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో గల గుట్టపై ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాలలో 8, 9 శతాబ్దాలకు చెందిన దేవతా విగ్రహాలను గుర్తించినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన గడ్డం రాంస్వరూప్రెడ్డి విజ్ఞప్తి మేరకు బుధవారం పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పి.నాగరాజు ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలలోని శాసనాలు, దేవతా విగ్రహాలను పరిశీలించారు. 1300 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాలలో ఉందన్నారు. ఆలయ నిర్వహణకు ఎవరెవరు ఎంత భూమిని విరాళంగా ఇచ్చారన్న అంశం కూడా వీటిలో ఉందన్నారు. 15 రోజుల్లో పూర్తిస్థాయి పరిశోధన అనంతరం స్పష్టత వస్తుందన్నారు. 8, 9 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్ధిని, నంది, బ్రహ్మ, వల్లీ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను తాము గుర్తించినట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలోరెండు శాసనాలను గుర్తించామని వీటిని రాష్ట్ర కూటులు వేసినట్లుగా తెలుస్తోందన్నారు. భావితరాలకు వీటి గురించి తెలిపేందుకు సిమెంటు దిమ్మెలపై శాసనాలు, విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పురావస్తుశాఖ అధికారి వెంట తెలంగాణ చరిత్ర పరిశోధన బృందం సభ్యుడు హరగోపాల్ తదితరులు ఉన్నారు. -
తెలుగు జాతి కీర్తి కి రీటం కొండవీడు కోట
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఉంది కొండవీడు కోట. ఈ కోటను చేరుకునేందుకు కొండ కిందనుంచి పై వరకు రెండువైపులా నేలమెట్లు ఉన్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల పొడవునా ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేతికొట్టు, మసీదు, ఖజానావంటి చారిత్రక సంపద ఉంది. కొండ కింద ఉన్న కత్తుల బావి, వేణుగోపాల స్వామి దేవాలయం, శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపురూప శిల్ప సంపదలున్నాయి. కొండవీడులో... కొండవీడు కోటను సువిశాలమైన ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల వైశాల్యంలో కొండలలో నిర్మించారు. సుమారు 25 కిలోమీటర్ల పొడవునా కోట ప్రాకారం కొండలలో శిఖరాల మీదున్న 23 బురుజులను కలుపుతూ నిర్మించబడింది. కోట ఉన్న కొండల పాదాల చెంత గల గ్రామాలలో అనేక ప్రాచీన కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. కోటలో చూడదగినవి... రాణిగారి బురుజు, యోగి వేమన మండపం, బుంగబావి, పాముకుదురు బురుజు, గంజికాలువ, ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు, నెమళ్ల బురుజు (బురుజులన్నింటిలో అతి పెద్దది), నరసింహస్వామి దేవాలయం, శివాలయం, కుతుబ్సాహీల మసీదు, అశ్వశాలలు, ఆయుధాగారం, నేతికొట్టు, రెడ్డివారి భోజనశాల. కొండవీడుకోట అతి సువిశాలమైన అటవీ భూమిలో ఉన్నది. ఇక్కడి అడవులలో 56 రకాల ఔషధ మొక్కలున్నాయి. కొండవీడు కొండలలో బౌద్ధం... రెడ్డి రాజుల కోటగానే గుర్తింపు ఉన్న ఈ కొండ ప్రాంతంలో దాదాపు 2వేల సంవత్సరాల క్రితమే బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇక్కడి శివాలయం పరిసరాల్లో పురాతత్వనిపుణులు జరిపిన తవ్వకాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. కోటలో అంతర్భాగంగా చెంఘిజ్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న వెన్నముద్ద బాలకృష్ణుని విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ప్రస్తుత పరిస్థితి.. నిక్షిప్త నిధుల కోసం అసాంఘిక శక్తులు కొండవీడు కోటలో అనునిత్యం తవ్వకాలు సాగిస్తూ నాటి నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిస్థితి గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట పునర్నిర్మాణానికి పదేళ్ల క్రితం అనుమతి తెలిపినప్పటికీ ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. చారిత్రాభిలాషులుగా కొంతమందిమి కలిసి 2005 నుంచి కొండవీడుకోట అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఘాట్‌రోడ్డు మంజూరు, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం కొండవీడు కోట కచ్చా రోడ్డు నిర్మాణం పూర్తికావస్తోంది. కొండవీడు కోట ఘాట్‌రోడ్డు, మెట్ల మార్గం, కోట పునర్నిర్మాణం, కోటపైన గల మూడు చెరువుల మరమ్మత్తులు, వెన్నముద్ద బాలకృష్ణ స్వర్ణ దేవాలయం నిర్మాణాలు పూర్తయితే కొండవీడు కోట చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఆంధ్ర దేశంలో సుప్రసిద్ధ ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రాంతం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అతిసమీపంలో ఉంది. - కల్లి శివారెడ్డి ఇలా చేరుకోవాలి... గుంటూరుకు 26 కిలోమీటర్ల దూరంలోని శివార్లలో ఉంది కొండవీడు కోట. గుంటూరులో వసతి, గుంటూరు నుంచి బస్సు సదుపాయాలు. రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి గుంటూరుకు, అక్కడ నుంచి కొండవీడుకు చేరుకోవడం సులువు.