తెలుగు జాతి కీర్తి కి రీటం కొండవీడు కోట | Telugu race to fame ritam kondavidu Castle | Sakshi
Sakshi News home page

తెలుగు జాతి కీర్తి కి రీటం కొండవీడు కోట

Published Thu, Dec 18 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

తెలుగు జాతి కీర్తి కి రీటం  కొండవీడు కోట

తెలుగు జాతి కీర్తి కి రీటం కొండవీడు కోట

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఉంది కొండవీడు కోట. ఈ కోటను చేరుకునేందుకు కొండ కిందనుంచి పై వరకు రెండువైపులా నేలమెట్లు ఉన్నాయి.  కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల పొడవునా ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేతికొట్టు, మసీదు, ఖజానావంటి చారిత్రక సంపద ఉంది. కొండ కింద ఉన్న కత్తుల బావి, వేణుగోపాల స్వామి దేవాలయం, శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపురూప శిల్ప సంపదలున్నాయి.

 కొండవీడులో...

కొండవీడు కోటను సువిశాలమైన ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల వైశాల్యంలో కొండలలో నిర్మించారు. సుమారు 25 కిలోమీటర్ల పొడవునా కోట ప్రాకారం కొండలలో శిఖరాల మీదున్న 23 బురుజులను కలుపుతూ నిర్మించబడింది. కోట ఉన్న కొండల పాదాల చెంత గల గ్రామాలలో అనేక ప్రాచీన కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి.
 
కోటలో చూడదగినవి...
 
రాణిగారి బురుజు, యోగి వేమన మండపం, బుంగబావి, పాముకుదురు బురుజు, గంజికాలువ, ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు, నెమళ్ల బురుజు (బురుజులన్నింటిలో అతి పెద్దది), నరసింహస్వామి దేవాలయం, శివాలయం, కుతుబ్‌సాహీల మసీదు, అశ్వశాలలు, ఆయుధాగారం, నేతికొట్టు, రెడ్డివారి భోజనశాల. కొండవీడుకోట అతి సువిశాలమైన అటవీ భూమిలో ఉన్నది. ఇక్కడి అడవులలో 56 రకాల ఔషధ మొక్కలున్నాయి.
 
కొండవీడు కొండలలో బౌద్ధం...

 
రెడ్డి రాజుల కోటగానే గుర్తింపు ఉన్న ఈ కొండ ప్రాంతంలో దాదాపు 2వేల సంవత్సరాల క్రితమే బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇక్కడి శివాలయం పరిసరాల్లో పురాతత్వనిపుణులు జరిపిన తవ్వకాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. కోటలో అంతర్భాగంగా చెంఘిజ్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న వెన్నముద్ద బాలకృష్ణుని విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు.
 
ప్రస్తుత పరిస్థితి
..
 
నిక్షిప్త నిధుల కోసం అసాంఘిక శక్తులు కొండవీడు కోటలో అనునిత్యం తవ్వకాలు సాగిస్తూ నాటి నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిస్థితి గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట పునర్నిర్మాణానికి పదేళ్ల క్రితం అనుమతి తెలిపినప్పటికీ ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. చారిత్రాభిలాషులుగా కొంతమందిమి కలిసి 2005 నుంచి కొండవీడుకోట అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఘాట్‌రోడ్డు మంజూరు, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం కొండవీడు కోట కచ్చా రోడ్డు నిర్మాణం పూర్తికావస్తోంది. కొండవీడు కోట ఘాట్‌రోడ్డు, మెట్ల మార్గం, కోట పునర్నిర్మాణం, కోటపైన గల మూడు చెరువుల మరమ్మత్తులు, వెన్నముద్ద బాలకృష్ణ స్వర్ణ దేవాలయం నిర్మాణాలు పూర్తయితే కొండవీడు కోట చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఆంధ్ర దేశంలో సుప్రసిద్ధ ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రాంతం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అతిసమీపంలో ఉంది.
 - కల్లి శివారెడ్డి
 
 
 ఇలా చేరుకోవాలి...

 గుంటూరుకు 26 కిలోమీటర్ల దూరంలోని శివార్లలో ఉంది కొండవీడు కోట. గుంటూరులో వసతి, గుంటూరు నుంచి బస్సు సదుపాయాలు. రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి గుంటూరుకు, అక్కడ నుంచి కొండవీడుకు చేరుకోవడం సులువు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement