భారీ ఇటుకలు.. మట్టి పూసలు | Satavahanas before landmarks in Karnamamidi | Sakshi
Sakshi News home page

భారీ ఇటుకలు.. మట్టి పూసలు

Published Sun, Aug 6 2017 2:24 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

భారీ ఇటుకలు.. మట్టి పూసలు

భారీ ఇటుకలు.. మట్టి పూసలు

మంచిర్యాల జిల్లా కర్ణమామిడిలో శాతవాహనులకు ముందునాటి ఆనవాళ్లు
- పురావస్తు తవ్వకాల్లో బయటపడిన భారీ ఇటుకలు
టెర్రకోట మట్టి పూసలు, పాత్రలు, పెంకుల ముక్కలు కూడా..
ఈ ప్రాంతాన్ని మూడు దశాబ్దాల కిందే గుర్తించినా ప్రభుత్వాల నిర్లక్ష్యం
దెబ్బతిన్న పురావస్తు సంపద..
తాజా తవ్వకాల్లో వెలుగు చూస్తున్నది అవశేషాలే!  
 
సాక్షి, హైదరాబాద్, మంచిర్యాల రూరల్‌: పెద్ద పెద్ద ఇటుకలు.. ఒక్కోటి 60 సెంటీమీటర్ల పొడవు.. అంటే ఇప్పుడు మనం వాడే ఇటుకలకు మూడింతలు పెద్దవి.. ఎరుపురంగులో గట్టిగా ఉన్నాయి.. ఇంకేం స్థానికులు దొరికినవి దొరికినట్లుగా తీసుకెళ్లి ఇళ్ల నిర్మాణంలో వాడేసుకున్నారు. మరి ఆ ఇటుకలు ఎప్పటివో తెలుసా..? సుమారు 2,000 ఏళ్ల కిందటి నాటివి. శాతవాహనుల తొలి రాజధానికి చేరువలో ఉన్న ఓ పట్టణానికి సంబంధించిన నిర్మాణాలవి. ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం సాగుభూమిగా మారిపోయింది. ఇక్కడి చారిత్రక సంపద దెబ్బతిన్నది. తీరా ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు ప్రారంభించేసరికి గోడల దిగువభాగాలే మిగిలాయి. శనివారం పురావస్తు శాఖ తవ్వకాల్లో శాతవాహనుల నాటి ఇటు క గోడను, టెర్రకోట మట్టి పూసలు బయటపడ్డాయి.
 
మూడున్నర దశాబ్దాల కిందే గుర్తించినా..
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం కర్ణమామిడి శివారులో గోదావరి నది ఒడ్డున పాటిగడ్డ ప్రాంతం ఉంది. ప్రస్తుతం ఇది ఎల్లంపల్లి రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో అతి పురాతన పట్టణం ఉండేదని దాదాపు మూడున్నర దశాబ్దాల కింద.. అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్‌ కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో గుర్తిం చారు. ఆ ఆనవాళ్లు శాతవాహనుల కంటే ముందునాటివని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రాంతంలో శాతవాహనుల కంటే ముందు రాజ్యం ఉండేదా, లేక శాతవాహనుల రాజధానికి అనుబంధంగా నిర్మి తమైన పట్టణమా అన్న దిశగా పరిశోధన చేశారు. అయితే ఆ తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. మన చరిత్రలో కొత్త అంశం మరుగున పడిపోయింది.
 
బ్యాక్‌వాటర్‌లో మునిగిపోవడంతో..
ఇటీవలే పురావస్తు శాఖ డైరెక్టర్‌ విశాలాక్షి కర్ణమామిడి ప్రత్యేకతపై దృష్టి సారించి.. తవ్వకాల కోసం కేంద్రం నుంచి అనుమతి పొందారు. కానీ ఆ ప్రాంతం ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయి ఉండటంతో తవ్వకాలు సాధ్యం కాలేదు. జూన్‌లో నీటి నిల్వ తగ్గి ఈ ప్రాంతం బయడపడటంతో తవ్వకాలు మొదలుపెట్టినా.. భారీ వర్షాలతో బురదమయం కావటంతో నిలిపివేశారు. కొద్దిరోజులుగా వర్షాలు నిలిచిపోవడంతో తిరిగి మూడు రోజుల కింద తవ్వకాలు చేపట్టారు. పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు నాగరాజు, ఆ శాఖ రిటైర్డ్‌ అధికారి భానుమూర్తిల ఆధ్వర్యంలో శనివారం జరిపిన అన్వేషణలో.. భారీ నిర్మాణానికి చెందిన పురాతన గోడ, పాత్రల అవశేషాలు, టెర్రకోట మట్టి పూసలు బయటపడ్డాయి.

60 సెంటీమీటర్ల పొడవు, 28 సెంటీమీటర్ల వెడల్పు, 8 సెంటీమీటర్ల మందం ఉన్న ఇటుకలతో ఈ గోడను నిర్మించినట్టు గుర్తించారు. ఆ ఇటుకలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. గోడ సమీపంలో ఇంటి పైకప్పు కోసం వాడే పెంకులు, టైల్స్‌ ముక్కలు కూడా దొరికాయి. అయితే ఈ గోడ కేవలం 3 వరుసల ఇటుకలతో 30 సెంటీమీటర్ల ఎత్తుతో మాత్రమే మిగిలింది. ఇవి గోడ దిగువ భాగం ఇటుకలని.. పైన ఉన్న ఇటుకలను రైతులు వ్యవసాయం చేస్తున్న సందర్భంలో పెకలించి తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
 
ఐదెకరాల్లో తవ్వకాలు
ఈ ప్రాంతం దాదాపు 40 ఎకýరాలుండగా.. ప్రస్తుతం ఐదెకరాల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించి, పని ప్రారంభించారు. శనివారం పలు ఆధారాలు వెలుగుచూడటంతో.. ముందుముందు మరిన్ని విశేషాలు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తవ్వకాలు చేపట్టామని.. 15 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 20 రోజులపాటు తవ్వకాలు చేపడతామని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాములు వెల్లడించారు. మళ్లీ వర్షాలు కురిసేలోపు వీలైనంత మేర తవ్వకాలు జరపాలని భావిస్తున్నామని శాఖ అధికారి నాగరాజు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మళ్లీ నిండితే.. వచ్చే ఎండాకాలంలో తవ్వకాలు పూర్తి చేస్తామన్నారు.
 
చాలా వరకు ధ్వంసమయ్యాయి
‘‘1980 ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని నాటి డైరెక్టర్‌ కృష్ణశాస్త్రితో కలసి పరిశీలించినప్పుడు గోడ ఆనవాళ్లు భద్రంగా ఉన్నాయి. అప్పుడే తవ్వకాలు జరిపి ఉంటే అప్పటి నిర్మాణాలు, విశేషాలు వెలుగుచూసి ఉండేవి. ఇప్పుడు గోడలు చాలావరకు ధ్వంసమయ్యాయి. మిగిలిన నిర్మాణ భాగాలను పరిరక్షించేందుకు చర్యలు చేపడతాం..’’
– పురావస్తు శాఖ రిటైర్డ్‌ ఉద్యోగి, తవ్వకాల బృందం సభ్యుడు భానుమూర్తి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement