గుట్ట..గుడిగా మారింది! | Wondering the Sarvathobhadra Temple | Sakshi
Sakshi News home page

గుట్ట..గుడిగా మారింది!

Published Sat, Nov 18 2017 2:01 AM | Last Updated on Sat, Nov 18 2017 2:01 AM

Wondering the Sarvathobhadra Temple - Sakshi

పురావస్తు శాఖ రిటైర్డ్‌ అధికారి రంగాచార్యులుతో కలసి నయన్‌పాక సర్వతోభద్ర ఆలయాన్ని పరిశీలిస్తున్న అమెరికన్‌ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ బి వ్యాగనర్‌

సాక్షి, హైదరాబాద్‌: గుట్ట మీద గుడి కట్టడం సాధారణమే.. కానీ గుట్టనే గుడిగా మలచడం విచిత్రం. అందులోనూ గుట్టలో భాగమైన రాతినే చెక్కి దేవతా విగ్రహాలను తీర్చిదిద్దడం.. దాని నుంచి వెలువడిన రాళ్లనే పేర్చి గుడిని నిర్మించడం మాత్రం అబ్బురమే. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయన్‌పాక గ్రామశివారులోని గుట్ట మీద ఉన్న సర్వతోభద్ర ఆలయం ప్రత్యేకత ఇది. దేశంలోనే ప్రత్యేక తరహాలో రూపుదిద్దుకున్న ఈ మందిరం కొత్తగా కనుగొన్నదేమీ కాదు. వందల ఏళ్లుగా స్థానికులకు సుపరిచితమే అయిన ఈ ఆలయం నిర్మాణంలోని ప్రత్యేకత తాజాగా నిపుణుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. 

సంప్రదాయ పద్ధతికి భిన్నంగా.. 
సాధారణంగా ఆలయాల నిర్మాణంలో.. గర్భాలయాన్ని, దానికి ఆనుకుని మంటపాన్ని నిర్మిస్తారు. తర్వాత చుట్టూ గోడతో ఆలయ ఆవరణను ఏర్పాటు చేస్తారు. ఎక్కడో రూపొందించిన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారు. కానీ నయన్‌పాక సర్వతోభద్ర ఆలయం ఇందుకు విభిన్నంగా ఉంటుంది. గుట్టపై మధ్యభాగంలో ఆలయం ఉంటుంది. ఇది కేవలం గర్భాలయం మాత్రమే. దానికే నాలుగువైపులా ఐదున్నర అడుగుల ఎత్తులో ద్వారాలు ఉంటాయి. లోపల మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో విగ్రహం ఉంటుంది. ఇది ఒక విగ్రహం కాదు.. ఒకే రాతిపై నాలుగు వైపులా దేవతా విగ్రహాలను చెక్కారు. ఒక్కో ద్వారం నుంచి ఒక్కోవైపున్న దేవతా విగ్రహాలు కనిపిస్తుంటాయి. తూర్పు ద్వారం నుంచి ఉగ్ర నరసింహస్వామి, దక్షిణ ద్వారం నుంచి కాళీయమర్థనం భంగిమలో వేణుగోపాలస్వామి, పశ్చిమం వైపు బలరాముడు, ఉత్తర దిశలో సీతారామలక్ష్మణుల రూపాలు దర్శనమిస్తాయి. ఇలా ఉండడం వల్లే దీనిని సర్వతోభద్ర నమూనా ఆలయంగా పిలుచుకుంటారు.

అమెరికా ప్రొఫెసర్‌ పరిశీలనతో.. 
సర్వతోభద్ర ఆలయంలోని విగ్రహాలను ఇప్పటివరకు మామూలుగా ప్రతిష్టించినవిగానే భావించారు. కానీ కొద్దిరోజుల క్రితం వరంగల్‌ పర్యటనకు వచ్చిన అమెరికన్‌ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ బి వ్యాగనర్, పురావస్తు శాఖ రిటైర్డ్‌ అధికారి రంగాచార్యులుతో కలసి ఈ ఆలయాన్ని పరిశీలించి.. దాని ప్రత్యేకతలను గుర్తించారు. ఆ విగ్రహం ఎక్కడి నుంచో తెచ్చి ప్రతిష్టించినది కాదని... ఆలయం నిలిచి ఉన్న గుట్ట భాగాన్నే విగ్రహంగా మలిచారని తేల్చారు. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారన్న విషయంలో స్పష్టత లేదు. ఇది వైష్ణవ సంప్రదాయ సర్వతోభద్ర ఆలయం కావటంతో కాకతీయుల కాలం తర్వాత నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడి కోనేరు మట్టితో పూడుకుపోయి ఉంది. దానిని తవ్వి పరిశీలిస్తే ఆధారాలు దొరకవచ్చని అంటున్నారు. 

ఏమిటీ ప్రత్యేకత..? 
గుట్టపై మధ్యలో ఎత్తుగా ఉన్న భాగాన్ని ఎంపిక చేసి దాదాపు నాలుగున్నర అడుగుల ఎత్తుతో నాలుగు వైపులా నాలుగు విగ్రహాలుగా చెక్కారు. అంటే ఆ విగ్రహాల భాగం నేరుగా గుట్టరాయే. ఇక విగ్రహం చుట్టూ ఉన్న రాతిని సమంగా చెక్కి బల్లపరుపుగా మార్చారు. ఇలా చెక్కగా వచ్చిన రాళ్లతోనే ఆ విగ్రహం చుట్టూ.. దాదాపు 20 అడుగుల ఎత్తుతో గర్భాలయాన్ని నిర్మించారు. తర్వాత దానిపై మరో 30 అడుగుల ఎత్తుతో ఇటుకలతో గోపురం నిర్మించారు. ఆలయం ఉండేది అంతే.. మండపం అంటూ ఏమీ లేదు. ముందువైపు మాత్రం విశాలమైన కోనేరును నిర్మించారు. ఇలా గుట్టరాతిలోనే విగ్రహం చెక్కి ఉన్న దేవాలయం ఇప్పటివరకు రికార్డు కాలేదని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక విగ్రహంపై భాగంలో స్తూపాకారంలో మరో రాతి భాగాన్ని విడిగా ఏర్పాటు చేశారు. గతంలో దొంగలు గుప్తనిధుల తవ్వకాలంటూ ఆ భాగాన్ని పక్కకు పడేశారు. భూపాలపల్లి ప్రాంతంలోని జెన్‌కో కేంద్రం సిబ్బంది భారీ క్రేన్‌ తెచ్చి దాన్ని మళ్లీ విగ్రహం పైభాగంలో అమర్చారు. 

ఇదో గొప్ప నిర్మాణం 
నేను భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో మందిరాలపై పరిశోధన చేశా. ఈ తరహా సర్వతోభద్ర దేవాలయాన్ని ఎక్కడా చూడలేదు. ఇంజనీరింగ్‌ నైపుణ్యం పరంగా ఇదో గొప్ప కట్టడం. దీన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది..     
    – అమెరికన్‌ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ బీ వ్యాగనర్‌  

పురావస్తు శాఖ ఆసక్తి 
ఈ ఆలయాన్ని 1992లో నాటి పురావస్తు సహాయ సంచాలకుడు ఎన్‌.రామకృష్ణరావు తొలిసారి వెలుగులోకి తెచ్చారు. అప్పటివరకు ఇది స్థానికులకే పరిచయం. తర్వాత శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రంగాచార్యులు ఆధ్వర్యంలో ఇంటాక్‌ సంస్థ దీన్ని సర్వే చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కానీ ఇప్పటివరకు పురావస్తుశాఖ దీన్ని రక్షిత కట్టడంగా గుర్తించలేదు. దీంతో క్రమంగా ఆలయం ధ్వంసమవుతోంది. చెట్లు పెరిగి గోపురం దెబ్బతింటోంది. అయితే తాజాగా అమెరికన్‌ ప్రొఫెసర్‌ ఈ ఆలయ ప్రత్యేకతను గుర్తించిన నేపథ్యంలో... దీనిపై కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఆసక్తి ప్రదర్శిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement