
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో కనిపించనున్నారు. బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటించిన తాజా చిత్రం 45. ఈ మూవీలో శివరాజ్‌కుమార్ సైతం నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను శివరాజ్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్ చూస్తే భారీగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నాయి. మార్కండేయ మహర్షి పౌరాణిక కథను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. శివుడు తన భక్తుడైన మార్కండేయుడిని మృత్యు దేవుడైన యముడి నుంచి ఎలా రక్షించాడనే కథగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ.. వాళ్లు బతికి ఉన్నప్పుడే చూపించండి' అనే డైలాగ్ ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తోంది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు.
ఈ సినిమాకు అర్జున్ జన్యా దర్శకత్వం వహిస్తున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ రెడ్డి నిర్మించారు . అంతేకాకుండా దర్శకుడు అర్జున్ జన్య సంగీతమందించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మరోవైపు శివ రాజ్‌కుమార్ ఎ ఫర్ ఆనంద్, రామ్ చరణ్ పెద్దిలో నటిస్తున్నారు. ఆలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీలో ఉపేంద్ర కనిపించనున్నారు.