Shivaraj kumar
-
Geetha Shivarajkumar: ‘గీత’ దాటినా... గీత మారేనా!
గీతా శివరాజ్‌కుమార్. కన్నడ ప్రజలకు చిరపరిచితమైన పేరు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కోడలు. ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ భార్య. అంతేనా...? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు! రాజకీయ కుటుంబంలో పుట్టి కన్నడ సినీ పరిశ్రమకు దిగ్గజాల వంటి తారలను అందించిన ఇంటికి కోడలిగా వెళ్లారు. అయినా పుట్టింటి వారసత్వం ఆమెను చివరికి రాజకీయాల వైపు నడిపించింది. 2014లోనే రాజకీయ అరంగేట్రం చేసిన గీత ఇప్పుడు శివమొగ్గ లోక్‌సభ స్థానంలో బీజేపీ దిగ్గజం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రతో పోటీ పడుతున్నారు...నిషేధాన్ని ఉల్లంఘించి.. గీతకు 1986లో శివరాజ్‌కుమార్‌తో పెళ్లయ్యింది. తర్వాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారు. తల్లి మరణానంతరం ఆమె నిర్వహించిన మైసూరులోని ‘శక్తిధామ్’ స్వచ్ఛంద సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. చాలాకాలం భర్తకు స్టయిలిస్ట్‌గా కూడా చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి వెళ్లొద్దని రాజ్‌కుమార్ లక్ష్మణరేఖ గీశారు. దాంతో సినిమాల్లో ఎంత పాపులారిటీ సాధించినా ఆయన కొడుకులెవ్వరూ రాజకీయాల వైపే చూడలేదు. కానీ బాల్యం నుంచి ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం చూసిన గీతకు రాజకీయాలంటే మహా ఆసక్తి. ఆమెకు రెండేళ్లప్పుడు తండ్రి బంగారప్ప ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్ఫూర్తితో 2014లో గీత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నిర్ణయాన్ని రాజ్‌కుమార్ భార్య పార్వతమ్మ వ్యతిరేకించారంటారు. తటస్థంగా ఉన్న కుటుంబాన్ని శివ రాజ్‌కుమార్, గీత వారి ఆకాంక్షల కోసం రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఆమె ఆవేదన చెందినట్టు వార్తలొచ్చాయి. అయినా గీత పట్టించుకోలేదు. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో జేడీ(ఎస్) అభ్యరి్థగా యడ్యూరప్పపై పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమితో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. సోదరుడు మధు బంగారప్ప కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు శివమొగ్గ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ రాఘవేంద్రతో తలపడుతున్నారు. ఆయన విజయ పరంపరకు బ్రేకులు వేస్తానని ధీమాగా చెబుతున్నారు!నీటి సమస్య పరిష్కారం తొలి ప్రాధాన్యత.. శివమొగ్గలో నీటి కొరత తీర్చడమే తన మొదటి ప్రాథమ్యమని చెబుతున్నారు గీత. ‘‘నా సోదరుడు, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో అనేక సమస్యలను పరిష్కరిస్తా. కాంగ్రెస్ పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ‘‘గెలవగానే బెంగళూరు వెళ్లిపోతానన్న బీజేపీ ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తా. శివమొగ్గలో నాకు ఇల్లుంది. ఇక్కడ ఉండకుండా ఎక్కడకు పోతాను? బీజేపీ ఇకనైనా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు మాని రైతులు, వెనకబడ్డ తరగతులు, ప్రజల కష్టాలపై మాట్లాడితే బాగుంటుంది. నేనెప్పుడూ నా బాధ్యతల నుంచి వెనక్కు తగ్గలేదు. శక్తిధామ్ సంస్థను చూసుకుంటున్నట్టుగానే శివమొగ్గ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తా. క్షేత్రస్థాయిలో వారికి అందుబాటులో ఉంటా’’ అని చెబుతున్నారు. భర్త శివరాజ్‌కుమార్ ప్రతిష్ట, తండ్రి బంగారప్ప మంచితనం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన శివమొగ్గలో తనను గెలిపిస్తాయని నమ్మకముందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Captain Miller Review: ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ
టైటిల్: కెప్టెన్ మిల్లర్ నటీనటులు: ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత తనీష్ తదితరులు నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్ దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్ సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని ఎడిటర్: నాగూరన్ విడుదల తేది: జనవరి 26, 2024(తెలుగులో) కథేంటంటే.. ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్ అగ్నీశ్వర(ధనుష్) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక అతనికి మిల్లర్ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్(సందీప్ కిషన్) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు. రాజన్న(ఎలగో కుమారవేల్) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్ సైన్యాన్ని కెప్టెన్ మిల్లర్ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్ మోహన్), శివన్న(శివరాజ్‌కుమార్)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్షతో , నిమ్నవర్గాల అణచివేత నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు వచ్చాయి. కెప్టెన్ మిల్లర్ కథ కూడా అలాంటిదే. బ్రిటీష్ కాలంలో కుల వివక్ష ఎలా ఉండేది? తక్కువ కులం వారిని బ్రిటీష్ వారితో పాటు సంస్థాన రాజులు ఎలా చిన్న చూపు చూసేవారు? తమ అవసరాలకు ఎలా వాడుకునేవారు? అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడి జర్నీని ఐదు చాప్టర్లుగా విడగొట్టి చెబుతూ..అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. బీభత్సమైన వయొలెన్స్ కారణంగా కథలోని మెయిన్ పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. హీరో ఎవరి కోసం పోరాడుతున్నాడో, ఎందుకు మారిపోయాడో అనేది క్లారిటీగా చూపించలేకపోయారు. సన్నివేశాల పరంగా చూస్తే సినిమా బాగుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం గత సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఈ కథలో సినిమాటిక్ లిబర్టీని కూడా ఎక్కువే తీసుకున్నాడు దర్శకుడు. కథ 1930లో సాగినప్పటికీ.. అత్యాధునిక ఆయుధాలు వాడడం, స్టైలిష్ బైక్స్, గాగూల్స్ వాడటం వాస్తవికతతో దూరంగా అనిపిస్తాయి. 'ఘోర హరుడు' కథతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. అతని నేపథ్య సన్నివేశలను చూపించారు. హీరో బ్రిటీష్ సైన్యంలోకి చేరడానికి గల కారణం బలంగా ఉంటుంది. అయితే సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఫస్టాఫ్‌లోనే పరిచయం చేశారు. దీంతో ఆయా పాత్రల తీరు ఎలా ఉండబోతుందనేది ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుంది. అలాగే ఇన్ని పాత్రలను పరిచయం చేయడంతో కథ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ మాత్రం అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో వయోలెన్స్ మరింత ఎక్కువతుంది. బ్రిటీష్ సైన్యంతో పాటు స్థానిక రాజు చేసే కుట్రలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే సైన్యంతో హీరో గ్యాంగ్ చేసే పోరాట ఘట్టాలు మాత్రం అదిరిపోతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని సంభాషణలు కూడా ఆలోచింపచేస్తాయి. ‘మనం వాళ్ల(బీటీష్) దగ్గర బానిసలమే.. వీళ్ల(స్థాయిక రాజు) దగ్గర బానిసలమే.. వీళ్ల కంటే తెల్లోళ్లే నయం. ఇక్కడ ఉంటే మనల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిష్ సైన్యంలో చేరితే బూట్లు ఇస్తారు. ఇక్కడ మనల్ని గుళ్లోకి రానివ్వరు. అక్కడ వాళ్లు పక్కన కూర్చోపెట్టుకుని మంచి భోజనం పెడతారు. దేన్ని స్వాతంత్రం అన్నాలి?’ లాంటి డైలాగ్స్ అప్పట్లో అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో తెలియజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో మొత్తం ధనుష్ వన్‌మ్యాన్ షో. అగ్నిగా, కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ అదరగొట్టేశాడు. అయితే ఇలాంటి పాత్రలు ధనుష్‌కి కొత్తేమి కాదు. గతంలో కూడా ఈ తరహా పాత్రల్లో నటించాడు. ఇక శివన్నగా శివరాజ్‌కుమార్ తన పాత్ర పరిధిమేర అద్భుతంగా నటించాడు. భానుమతిగా ప్రియాంక అరుల్ మోహన్ ఆకట్టుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాత్ర నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోతుంది. నివేదితా సతీష్ డిఫరెంట్ పాత్రలో నటించింది. రాజుగా జయప్రకాశ్, రాజన్నగా ఎలగో కుమారవేల్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. 1930ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్థార్థ్. జీవి ప్రకాశ్ బీజీఎం సినిమా స్థాయిని పెంచింది. యాక్షన్ సీన్స్ అదరిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఘోస్ట్ ట్రైలర్ విడుదల చేసిన రాజమోళి.. విధ్వంసం సృష్టించిన శివన్న
కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. తాజాగా భారత అగ్రదర్శకుడు రాజమౌళి దీనిని విడుదల చేశారు. శివన్న నటించిన ఘోస్ట్ ట్రైలర్ అద్భుతంగా ఉందని ఆయన కితాబు ఇచ్చారు.'బీర్బల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజు తన సందేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. (ఇదీ చదవండి: ఆ కారణంతో నాన్న మద్యానికి బానిసయ్యారు: స్టార్ హీరోయిన్) హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్,మొదటి పోస్టర్‌తోనే శివన్న భారీ అంచనాలు పెంచేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆయన విధ్వంసమే క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని ఘోస్ట్ మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో శివరాజ్‌కుమార్ నటన, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులోని డైలాగ్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. కొన్నీ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా డైరెక్టర్ క్రియేట్ చేశాడు. యుద్దం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం.. ఇలాంటి యుద్దాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే.. అవి చేసే నష్టాలే ఎక్కువ అనే డైలాగ్‌తో పాటు సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండవచ్చు కానీ.. విధ్వంసం సృష్టించే నా లాంటి వాడ్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు అంటూ.. శివరాజ్ కుమార్ చెప్పే డైలాగ్ అందరికీ బాగా రిజిస్టర్ అవుతుంది. -
దుమ్మురేపుతున్న 'ఘోస్ట్' సాంగ్.. ఆ రోజే సినిమా రిలీజ్!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ 'ఘోస్ట్'. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఆన్ యాక్షన్ ఫీస్ట్‌గా తీస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఒరిజినల్ గ్యాంగస్టర్ మ్యూజిక్ వీడియో విడుదల చేశారు. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటని విడుదల చేశారు. శివరాజ్ కుమార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీపై అంచనాలు పెంచుతోంది. అనుపమ్ ఖేర్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అర్జున్ జన్య సంగీతమందించారు. ఇకపోతే ఈ మధ్య 'జైలర్'లో గెస్ట్ అప్పీయరెన్స్‌తో దుమ్ములేపిన శివన్న.. పూర్తిస్థాయిలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటారో చూడాలి. (ఇదీ చదవండి: అనసూయ సోయగాలు.. విష్ణుప్రియ గ్లామర్ షో!) -
నేను రాహుల్ అభిమానిని..కాంగ్రెస్ ర్యాలీలో కన్నడ సూపర్ స్టార్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 రోజులే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శివమొగ్గలో భారీ ర్యాలీ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఆ బహిరంగ సభలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ సందడి చేశారు. తాను రాహుల్ గాంధీకి పెద్ద అభిమానినని, ఆయనతో పాటు ర్యాలీకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. 'నేను ఇక్కడికి రాహుల్ గాంధీ అభిమానిగా వచ్చా. ఆయన ఇటీవలే భారత్ జోడో యాత్రలో దేశమంతా పాదయాత్ర చేశారు. ఆ యాత్ర నుంచి చాలా స్ఫూర్తి పొందా.' అని శివరాజ్ కుమార్ తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేరింతలు, చప్పట్లతో సభను మారుమోగించాయి. Rahul Gandhi and legendary actor Shiva Rajkumar campaigned for Congress in Karnataka. 🔥 pic.twitter.com/JAfvxj7LxO — Shantanu (@shaandelhite) May 2, 2023 కాగా.. శివరాజ్ కుమార్ సతీమణి గీత శివ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్‌కు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చే విషయమే అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ తరఫున కన్నడ సీనియర్ హీరోలు కిచ్చ సుదీప్, దర్శన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం బొమ్మైతో కలిసి వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వీరు కమలం పార్టీలో అధికారికంగా చేరలేదని, వారి వల్ల తమకు ఎలాంటి నష్టం ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం తమదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అద్దం పగిలి.. -
కన్నడంలో విశ్వాసం
తమిళంలో పొంగల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘విశ్వాసం’. అజిత్, నయనతార నటించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా కన్నడంలో రీమేక్ కానుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. తమిళంలో ‘విశ్వాసం’ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థే ఈ రీమేక్‌నూ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘విశ్వాసం’ రీమేక్ సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. విశేషమేంటంటే ‘విశ్వాసం’ సినిమా ‘జగ మల్లా’ టైటిల్‌తో కన్నడంలో అనువాదం అయింది. -
దసరాకు విలన్
రెండున్నరేళ్ల క్రితం ‘ది విలన్’ సినిమా కోసం కొబ్బరికాయ కొట్టారు టీమ్. ఇందులోని యాక్టర్స్ డేట్స్ కుదరకపోవడం, అమీ జాక్సన్ విసా ప్రాబ్లమ్, వర్షం తాకిడికి లొకేషన్లో ఇబ్బంది కలగడం వంటి కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దీంతో రిలీజ్ డేట్ విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌లు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉప శీర్షిక. సీఆర్ మనోహర్ నిర్మించారు. శ్రీకాంత్, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు ప్రేమ్ పేర్కొన్నారు. ‘‘కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయబోతున్నాం. సహకరించిన టీమ్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ప్రేమ్. యాక్టర్ కావాలని కలలు కనే ఓ పల్లెటూరి యువకుడి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని శాండిల్‌వుడ్ టాక్. -
శివణ్ణతో కలిసి నటించేందుకు సిద్ధం
బొమ్మనహళ్లి : శ్యాండల్‌వుడ్ నటుడు, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ పిలిస్తే కన్నడ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలుగు ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున అన్నారు. గురువారం బెంగళూరు నగరంలో జరిగిన ఓ కార్యక్రమాన్ని కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి నాగార్జున ప్రారంభించారు. శివరాజ్‌కుమార్‌తో కలిసి నటిస్తారా అని అభిమానులు పేర్కొనగా నాగార్జున పైవిధంగా స్పందించారు. మంచి కథ దొరికితే తప్పకుండా కన్నడ సినిమాల్లో శివణ్ణతో కలిసి నటించేందుకు అభ్యంతరం లేదన్నారు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ నటించిన సినిమాలను తాను చూశానన్నారు. తాను నటించిన సినిమాలను కూడా డాక్టర్ రాజ్‌కుమార్ చూసి మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. హీరో శివణ్ణ మాట్లాడుతూ మంచి కథ లభిస్తే నాగార్జునతో కలిసి నటించేందుకు సిద్ధమని అన్నారు. అంతేగాకుండా ఆ సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తామన్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో తాను ప్రత్యేక నటుడుగా నటించానని అన్నారు. అయితే ఇప్పటి వరకు పూర్తిగా తెలుగు సినిమాలో నటించలేదన్నారు. -
ఫుల్ ఫోకస్
గతేడాది అజిత్ హీరోగా నటించిన ‘వివేగమ్’ సినిమా ద్వారా విలన్‌గా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఈ ఏడాది కన్నడ చిత్రం ‘రుస్తుం’ సినిమాతో శాండిల్‌వుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారాయన. ఇందులో శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ రవివర్మ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ‘‘రుస్తుం’ సినిమాతో వివేక్ ఒబెరాయ్ శాండిల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని చెప్పడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు రవివర్మ. అలాగే.. మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న ‘లూసీఫర్’ చిత్రంతో వివేక్ ఒబెరాయ్ మాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన ఎప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం తెలుగులో బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇవన్నీ చూస్తుంటే.. వివేక్ సౌత్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ఉంది కదూ. -
రాముడా? రావణుడా?
రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కన్నడలో ‘ది విలన్’ సినిమా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే టైమ్ వచ్చింది. ఆల్రెడీ టాకీపార్ట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీమ్ ప్రజెంట్ సాంగ్స్‌ను షూట్ చేసే పనిలో పడింది. శివరాజ్‌కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్గా హీరో శివరాజ్ కుమార్‌పై ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ సాంగ్‌తో ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ వంతు చిత్రీకరణ పూర్తయ్యింది. ‘‘శివన్న డ్యాన్సింగ్ ఎనర్జీ సూపర్. నగేశ్ మాస్టర్ కంపోజ్ చేశారు’’ అన్నారు దర్శకుడు ప్రేమ్. ఆల్రెడీ హీరోల లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నెల 28న టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
నైన్.. లక్కీ సైన్
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లక్‌ని నమ్ముతారు. అది కూడా అంకెల్లో వచ్చే అదృష్టాన్ని మాత్రమే. ఈ సూపర్ స్టార్ 9 అంకెను లక్కీగా ఫీల్ అవుతారట. ఫస్ట్ సినిమా ‘ఆనంద్‘ జూన్ 19న రిలీజ్ అయింది. 29 ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగింది. అది కూడా మే 19న. ఇలా తనకు కలిసొచ్చిన అన్నింట్లో 9 ఉండే సరికి 9 అంకెను అదృష్టంగా భావించడం మొదలెట్టారట శివరాజ్ కుమార్. ప్రస్తుతం ఆయన ‘కవచ’ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్‌లాల్ చేసిన ‘ఒప్పం’ సినిమాకు రీమేక్. విశేషం ఏంటంటే రీమేక్స్‌లో నటించను అని చెప్పిన ఆయన 15 ఏళ్ల తర్వాత రీమేక్ మూవీ చేయడం విశేషం. -
'కిల్లింగ్ వీరప్పన్' మూవీ రివ్యూ
టైటిల్: కిల్లింగ్ వీరప్పన్ జానర్: క్రైమ్ థ్రిల్లర్ తారాగణం: శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పరూల్ యాదవ్ సంగీతం: రవిశంకర్ దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ నిర్మాత: బివి మంజునాథ్ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రామ్‌గోపాల్ వర్మ ఈసారి తన పూర్తి స్థాయి ఎఫర్ట్‌తో తెరకెక్కించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్. చాలారోజులుగా క్వాలిటీ సినిమాలు చేయట్లేదన్న అపవాదు మూట కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? కన్నడంలో సంచలన విజయం సాధించిన వర్మ తెలుగు నాట సత్తా చాటాడా..? కథ: కిల్లింగ్ వీరప్పన్ పూర్తిగా స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు. అయితే వర్మ మార్క్ సినిమాటిక్ ట్రీట్మెంట్తో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. దశాబ్దాల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు అడవులను ఏలిన వీరప్పన్, ఆ స్థాయికి ఎలా రాగలిగాడు, వీరప్పన్‌ను పట్టుకోవటానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ముఖ్యంగా వీరప్పన్‌ను మట్టుపెట్టిన కుకూన్ ఆపరేషన్ ఎలా సాగిందిన్నదే కిల్లింగ్ వీరప్పన్ అసలు కథ. నటీనటులు: వీరప్పన్‌ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన కుకూన్ ఆపరేషన్ హెడ్‌గా శివరాజ్ కుమార్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఓ క్రిమినల్‌ను పట్టుకోవటానికి క్రిమినల్ మైండ్ ఉన్న పోలీసే కావాలనిపించేలా ఉంది శివరాజ్ కుమార్ నటన. 50 ఏళ్ల వయసులోనూ యాక్షన్స్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్‌ను ఎంపిక చేసుకున్నప్పుడే వర్మ సగం విజయం సాధించాడు. కిల్లర్ లుక్‌లో సందీప్ చాలా బాగా ఒదిగిపోయాడు. థియేటర్ నటుడు కావటంతో క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పలికించగలిగాడు. ఇక వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిగా యాగ్నా శెట్టి, మరో ప్రధాన పాత్రలో పరుల్ యాదవ్‌లు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మనసు పెట్టి సినిమా తీస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుందో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు. కేవలం వీరప్పన్ కోసం సాగిన వేటనే కథాంశంగా తీసుకున్న వర్మ, ఆ పాయింట్‌ను తెరపై ప్రజెంట్ చేయటంలో విజయం సాధించాడు. వర్మ మార్క్ కెమరా వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా వర్మ గత సినిమాలతో పోలిస్తే బడ్జెట్ పరంగా కూడా కిల్లింగ్ వీరప్పన్ గ్రాండ్‌గా కనిపించింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వర్క్ చాలా బాగున్నాయి. సందీప్ భరద్వాజ్‌ను వీరప్పన్‌గా చూపించిన మేకప్ మెన్ పనితనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఏ మాత్రం తేడా లేకుండా అసలు వీరప్పన్‌నే చూస్తున్నంత నాచురల్‌గా మేకప్ కుదిరింది. ప్లస్ పాయింట్స్ : వర్మ డైరెక్షన్ సందీప్ భరద్వాజ్, శివరాజ్ కుమార్ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం ఓవరాల్‌గా కిల్లింగ్ వీరప్పన్, వర్మ ఇప్పటికీ మంచి సినిమా తీయగలడని ప్రూవ్ చేసిన క్రైమ్ థ్రిల్లర్. -
30 సినిమాలకు ఓకె చెప్పాడు..!
సాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరికొత్త రికార్డ్‌కు తెర తీశాడు. సాధారణంగా స్టార్ స్టేటస్ అందుకున్న ఏ హీరో అయిన ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తాడు. శివరాజ్ కుమార్ మాత్రం ఏడాదికి నాలుగైదు సినిమాలతో సందడి చేస్తున్నాడు. అయితే ఈ మధ్యే వేగం తగ్గించాలని భావించిన శివరాజ్ ఏడాదికి మూడు సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు. నెంబర్ తగ్గించుకున్నా ఈ సూపర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందించిన శివరాజ్ కుమార్ ప్రస్తుతం శివలింగ, కిల్లింగ్ వీరప్పన్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరో ఎనిమిది సినిమాలకు డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమాలన్ని పూర్తి కావటానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తుంది. 53 ఏళ్ల వయసులోనూ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తున్న శివరాజ్ కుమార్ చేతిలో ప్రస్తుతం 30 సినిమాలు ఉన్నాయట. రాబోయే పదేళ్లలో ఈ సినిమా 30 సినిమాలను పూర్తి చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు శివరాజ్ కుమార్, కన్నడనాట లెజెండరీ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివరాజ్ కుమార్ ప్రస్తుతం సాండల్‌వుడ్‌లో టాప్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు.