'కిల్లింగ్ వీరప్పన్' మూవీ రివ్యూ
టైటిల్: కిల్లింగ్ వీరప్పన్
జానర్: క్రైమ్ థ్రిల్లర్
తారాగణం: శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పరూల్ యాదవ్
సంగీతం: రవిశంకర్
దర్శకత్వం: రామ్గోపాల్ వర్మ
నిర్మాత: బివి మంజునాథ్
టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రామ్గోపాల్ వర్మ ఈసారి తన పూర్తి స్థాయి ఎఫర్ట్తో తెరకెక్కించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్. చాలారోజులుగా క్వాలిటీ సినిమాలు చేయట్లేదన్న అపవాదు మూట కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? కన్నడంలో సంచలన విజయం సాధించిన వర్మ తెలుగు నాట సత్తా చాటాడా..?
కథ:
కిల్లింగ్ వీరప్పన్ పూర్తిగా స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు. అయితే వర్మ మార్క్ సినిమాటిక్ ట్రీట్‌మెంట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. దశాబ్దాల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు అడవులను ఏలిన వీరప్పన్, ఆ స్థాయికి ఎలా రాగలిగాడు, వీరప్పన్ను పట్టుకోవటానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ముఖ్యంగా వీరప్పన్ను మట్టుపెట్టిన కుకూన్ ఆపరేషన్ ఎలా సాగిందిన్నదే కిల్లింగ్ వీరప్పన్ అసలు కథ.
నటీనటులు:
వీరప్పన్ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన కుకూన్ ఆపరేషన్ హెడ్గా శివరాజ్ కుమార్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఓ క్రిమినల్‌ను పట్టుకోవటానికి క్రిమినల్ మైండ్ ఉన్న పోలీసే కావాలనిపించేలా ఉంది శివరాజ్ కుమార్ నటన. 50 ఏళ్ల వయసులోనూ యాక్షన్స్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరప్పన్గా సందీప్ భరద్వాజ్ను ఎంపిక చేసుకున్నప్పుడే వర్మ సగం విజయం సాధించాడు. కిల్లర్ లుక్లో సందీప్ చాలా బాగా ఒదిగిపోయాడు. థియేటర్ నటుడు కావటంతో క్రైమ్ థ్రిల్లర్కు కావాల్సిన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పలికించగలిగాడు. ఇక వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిగా యాగ్నా శెట్టి, మరో ప్రధాన పాత్రలో పరుల్ యాదవ్లు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మనసు పెట్టి సినిమా తీస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుందో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు. కేవలం వీరప్పన్ కోసం సాగిన వేటనే కథాంశంగా తీసుకున్న వర్మ, ఆ పాయింట్ను తెరపై ప్రజెంట్ చేయటంలో విజయం సాధించాడు. వర్మ మార్క్ కెమరా వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా వర్మ గత సినిమాలతో పోలిస్తే బడ్జెట్ పరంగా కూడా కిల్లింగ్ వీరప్పన్ గ్రాండ్గా కనిపించింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వర్క్ చాలా బాగున్నాయి. సందీప్ భరద్వాజ్‌ను వీరప్పన్‌గా చూపించిన మేకప్ మెన్ పనితనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఏ మాత్రం తేడా లేకుండా అసలు వీరప్పన్‌నే చూస్తున్నంత నాచురల్‌గా మేకప్ కుదిరింది.
ప్లస్ పాయింట్స్ :
వర్మ డైరెక్షన్
సందీప్ భరద్వాజ్, శివరాజ్ కుమార్
సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం
ఓవరాల్గా కిల్లింగ్ వీరప్పన్, వర్మ ఇప్పటికీ మంచి సినిమా తీయగలడని ప్రూవ్ చేసిన క్రైమ్ థ్రిల్లర్.