హ్యాట్రిక్ హీరో శివణ్ణతో అక్కినేని నాగార్జున
బొమ్మనహళ్లి : శ్యాండల్‌వుడ్ నటుడు, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ పిలిస్తే కన్నడ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలుగు ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున అన్నారు. గురువారం బెంగళూరు నగరంలో జరిగిన ఓ కార్యక్రమాన్ని కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి నాగార్జున ప్రారంభించారు. శివరాజ్‌కుమార్‌తో కలిసి నటిస్తారా అని అభిమానులు పేర్కొనగా నాగార్జున పైవిధంగా స్పందించారు. మంచి కథ దొరికితే తప్పకుండా కన్నడ సినిమాల్లో శివణ్ణతో కలిసి నటించేందుకు అభ్యంతరం లేదన్నారు.
కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ నటించిన సినిమాలను తాను చూశానన్నారు. తాను నటించిన సినిమాలను కూడా డాక్టర్ రాజ్‌కుమార్ చూసి మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. హీరో శివణ్ణ మాట్లాడుతూ మంచి కథ లభిస్తే నాగార్జునతో కలిసి నటించేందుకు సిద్ధమని అన్నారు. అంతేగాకుండా ఆ సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తామన్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో తాను ప్రత్యేక నటుడుగా నటించానని అన్నారు. అయితే ఇప్పటి వరకు పూర్తిగా తెలుగు సినిమాలో నటించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment