సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లు, పురాతన మూలాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా గ్రామాలకు ఉన్న పేర్లు ఎలా వచ్చాయి.. గతంలో ఎలాంటి చరిత్ర ఉండేదన్న ఆసక్తికరమైన అంశాలపై అధ్యయనం కొనసాగుతోంది. జిల్లాలో ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెబ్బేటి మల్లికార్జున్‌ను నియమించగా.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల నుంచి ఆరుగురు అధ్యాపకులు సభ్యులుగా ఉన్నారు.
వెలుగులోకి కొత్త చరిత్ర..
జిల్లాలో నెల రోజులుగా మన ఊరు– మన చరిత్ర కార్యక్రమ అధ్యయన బృందం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. వాటి చరిత్రను అవలోకనం చేసుకునేందుకు గ్రామాల్లో వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి ఫొటోలతో సహా పుస్తకాల్లో నిక్షిప్తం చేసే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామం చుట్టుపక్కల గొలుసుకట్టు చెరువులతోపాటు కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను గుర్తించారు.
ఆలయాల వద్ద ఆనాటి కాలంలో తవ్విన పురాతన బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడి పురాతన ఆలయంలోని శివలింగం తెలుపు రంగులో ఉండటం విశేషం. అంతకు ముందు ఈ గ్రామం పేరు తుర్కలపల్లిగా ఉండగా ఈ శివలింగం కారణంగానే మహదేవునిపేటగా స్థిరపడినట్టు బృందం సభ్యులు గుర్తించారు. ఈ గ్రామంలో హిందు, ముస్లిం గురువులు వేర్వేరుగా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ అక్కడే సమాధి అయ్యారని తెలుసుకున్నారు. ఈ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని బృందం సభ్యులు అభివర్ణిస్తున్నారు.
● గంగారం సమీపంలోని గుట్టల నుంచి ఎత్తైన రాళ్లను పగులగొట్టి నందివడ్డెమాన్ ఆలయాలను నిర్మించినట్టు తెలుసుకున్నారు. వడ్డెమాన్‌లోని త్రికూట ఆలయాల వద్దనున్న బుద్ధుడి ప్రతిమను బట్టి అక్కడ బౌద్ధమతం సైతం విలసిల్లిందని అధ్యాపకులు భావిస్తున్నారు.
గ్రామాల్లో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమం
‘ఇక్కడ కనిపిస్తున్నది బిజినేపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని అటవీప్రాంతం. చరిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందిన నందివడ్డెమాన్‌లోని ఆలయాలు, పురాతన కోట నిర్మాణం కోసం ఇక్కడి రాళ్లనే వినియోగించారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన రాళ్లను పగులగొట్టిన ఆనవాళ్లు ఇప్పటికీ నాటి చరిత్రకు ఆధారంగా నిలుస్తున్నాయి’.
‘ఈ ఫొటోలో రాజసంగా కనిపిస్తున్న భవనం జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని పురాతన కోట. సుమారు 1625 సంవత్సరం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు ఈ కోట కేంద్రంగా రెడ్లు పాలన సాగించేవారు. వట్టెం కేంద్రంగా కొంతకాలం పాటు రెడ్డి వంశస్తుల పాలన సాగిందని మన ఊరు– మన చరిత్ర పరిశోధన బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. మరింత లోతుగా పరిశోధన చేస్తే చాలా వరకు చరిత్ర బయటపడుతుందని వారు చెబుతున్నారు.’
ఆలయాలపై ప్రధాన దృష్టి..
గ్రామాల చరిత్రతోపాటు ఆయా గ్రామాల్లోని ఆలయాలపై సమగ్రంగా దృష్టిసారించి అధ్యయనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లిలో ఉన్న నారసింహుని ఆలయానికి సంబంధించిన 1171 నాటి శాసనాన్ని గుర్తించారు. 12వ శతాబ్దంలోనే 500 ఎకరాల భూమిని ఆలయానికి దానం ఇచ్చినట్టుగా శాసనంలో పేర్కొని ఉంది.
● ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరెలా వచ్చింది.. గ్రామానికి ఉన్న ప్రధాన చారిత్రక మూలాలేంటి అన్నదానిపై పరిశోధన మొదలవుతుంది. క్రమంగా గ్రామ భౌగోళిక నైసర్గిక స్వరూపం, సమీపంలో ఉన్న వాగులు, సెలయేర్లు, చెరువులు, కొండల వంటి వివరాలను సమగ్రంగా తెలుసుకుని పొందుపరుస్తారు.
● గ్రామంలోని పురాతన ఆలయాలు, వాటి చరిత్ర, మతసామరస్యం వంటి అంశాలను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
ఆసక్తికర విషయాలు..
మన ఊరు– మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గ్రామాల వారీగా చరిత్రను తెలుసుకునేందుకు అధ్యయనాన్ని మొదలుపెట్టాం. క్షేత్రస్థాయి సందర్శనలో పలు గ్రామాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మనకు తెలియని ఎంతో చరిత్ర దాగి ఉంది. వివిధ వర్గాల సహకారంతో విడతల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత తరం వారిలో తమ ఊరి పట్ల మమకారం మరింత పెరుగుతుంది.
– మల్లికార్జున్,ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment