సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జైన మతం ఇక్కడ వర్ధిల్లింది.. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేల ఇది.. జైనులకు ఎంతో ప్రీతిపాత్ర మైన ఆలయం ఇది.. వారికి ప్రధాన స్థిరనివాసంగా ప్రత్యేకతను చాటుకుంది. ఎంతో ప్రత్యేకంగా కేవలం ఇటుకలతో ఎన్నో శతాబ్దాల కిందట నిర్మితమై అలరారింది. తనకంటూ చరిత్రలో ఓ పేజీని లిఖించుకుంది. అదే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లిలో ఉన్న గొల్లత్త గుడి.
ఎన్నో ప్రత్యేకతలు..
దాదాపు 65 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. 8వ శతాబ్దంలో రాష్ట్ర కూటులు ఈ గుడిని నిర్మిం చినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు చెబుతు న్నారు. చాలా అరుదుగా ఇటుకలతో 7వ లేదా 8వ శతాబ్దంలో జరిగినట్లు భావిస్తున్నారు. గార అలంకరణలకు సంబంధించిన ఇటుకల నిర్మాణం. 40 అడుగుల నిలువెత్తు గోపురం గొల్లత్త గుడికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇటుకలతో నిర్మితమైన అత్యంత పురాతన ఆలయాలు దేశంలో రెండే రెండు ఉన్నాయని, వాటిలో ఈ గొల్లత్త గుడి ఒకటని పేర్కొంటున్నారు. మరొకటి ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులోని భీతర్‌గావ్ శివారులో ఉంది. ఈ గుడిని 1600 ఏళ్ల కింద 58 అడుగుల ఎత్తులో కుమారగుప్తుడి కాలంలో నిర్మిత మైంది. ఆలయ నిర్మాణం 8 ఎకరాల్లో ఉండగా, పాదాల గుట్ట సుమారు రెండు ఎకరాల్లో ఉంది. జైనుల ధాన్య భాండాగారంగా పేరు గాంచిన గొల్లత్తగుడి ఆలయంలో ఒకప్పుడు బంగారు కుండలు ఉండేవని స్థానికులు చెబుతారు. గుడి వెనుక భాగంలో అప్పటి నగిషీల జాడలు ఇంకా స్పష్టంగా ఉండటం విశేషం.
జైనుల స్థిర నివాసం..
జైనీయుల స్థిర నివాస కేంద్రంగా ఈ గుడికి గుర్తింపు ఉన్నది. అంతేకాకుండా జైనీయులకు ధాన్యాగారంగా వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా జైనులకు రెండు ప్రధాన పట్టణాలు ఉండగా.. అందులో గొల్లత్తగుడి ఒక్కటి. వందల ఏళ్ల కింద ఇది జైన మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చర్రితకారులు చెబుతున్నారు. ఇక్కడ గతంలో అనేక పురావస్తు అన్వేషణలు, తవ్వకాలు జరిగాయి. పురాతన కాలం నాటి మట్టిపెంకులు, ఇటుకలతో పాటు నల్ల రంగులో ఉన్న బూడిద తవ్వకాల్లో వెలుగు చూశాయి. వాటిని పరిరక్షించేందుకు పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. ఇక్కడ లభించిన 5 అడుగుల ఎత్తున్న జైన తీర్థంకరుల విగ్రహాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో, మరొక దాన్ని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. ఇదే ప్రాంతంలో హిందూ దేవాలయం అవశేషాలు, మధ్యయుగ కాలం నాటి మహావీర, పార్శ్వనాథ శిల్పాలు బయటపడ్డాయి.
పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు
తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు ఆలయ పూర్వవైభవానికి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇటుకల గోపురం చెక్కుచెదరకుండానే పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. శాస్త్రీయమైన పద్ధతులతో పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను క్షేత్రస్థాయిలో సేకరించారు. ఆలయ రక్షణకు సుమారు రూ.36 లక్షలతో ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిచేశారు.
ఎలా చేరుకోవాలి?
జడ్చర్ల నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్‌నగర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గొల్లత్త గుడి ఉంది. రైలు, రోడ్డుమార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ వైపు నుంచి రావాలనుకునే వారు జడ్చర్ల వెళ్లి అక్కడినుంచి అల్వాన్‌పల్లి చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే జడ్చర్ల స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి ఆటోలలో ఆలయానికి వెళ్లొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment