
పురాతత్వశాఖ దక్షిణ విభాగం అసిస్టెంట్ ఎపిగ్రఫిస్ట్ ఏసుబాబుతో కలిసి లింగవరంలో పరిశీలించిన షేక్ రసూల్ అహ్మద్
వెంకటగిరి: భారతదేశంలోనే అరుదైన ఇసుక దిబ్బల్లో బృహత్ శిలాయుగపు నాటి నివాసం, సమాధులు ఉన్న ప్రాంతాన్ని చిల్లకూరు మండలం లింగవరం వద్ద వెంకటగిరికి చెందిన చరిత్ర పరిశోధకుడు షేక్ రసూల్ అహ్మద్ కనుగొన్నారు. భారతీయ పురాతత్వశాఖ దక్షిణ విభాగం అసిస్టెంట్ ఎపిగ్రఫిస్ట్ ఏసుబాబులో కలిసి మళ్లీ సందర్శించి అవశేషాలను పరిశీలించి నిర్ధారించారు. సోమవారం చరిత్రకారుడు షేక్ రసూల్ అహ్మద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బృహత్ శిలాయుగం నాటి అవశేషాలు భారతదేశం అంతటా లభించినప్పటికీ, లింగవరంలో లభించిన అవశేషాలు ఇసుక దిబ్బల్లో మూడు అడుగుల నుంచి 15 అడుగుల లోతుల్లో మూడు స్థలాల్లో లభించడం గమనార్హమని తెలిపారు.
భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఇసుక దిబ్బల్లో లభిస్తున్న అవశేషాలు అన్నీ ప్రీహిస్టారిక్ (ఆదిమ మానవుల) కాలం నాటివిగా గుర్తించారు. అయితే బృహత్ శిలాయుగం నాటి అవశేషాలు లభించడం భారతదేశంలో మొట్టమొదటి స్థావరం లింగవరం అన్నారు. ఈ ప్రాంతంలో లభించిన కుండలు, సమాధులు తమిళనాడు రాష్ట్రంలోని ఆదిచెన్నలూరులో లభించిన కుండ సమాధులను పోలి ఉన్నప్పటికీ కొంతమేర ప్రాతీయ వైవిధ్యం కలిగి ఉన్నాయని రసూల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment