సాక్షి, హైదరాబాద్: అక్కడి శిల్పాలు చరిత్రను కళ్లకు కదలాడేలా చేస్తాయి. నాటి జీవన విధానాన్ని గుర్తుకు తెస్తాయి. శిల్పులు చెక్కిన కళారూపాలు ఔరా! అనిపిస్తాయి. సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఇలా ఎలా చెక్కారబ్బా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఇలాంటి శిల్పాలు చూడాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకకు వెళ్లాల్సిందే. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న జైన దేవాలయానికి కొలనుపాక ప్రసిద్ధి. దక్షిణ భారత్‌లోని ప్రముఖ జైన కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి మ్యూజియంలో అరుదైన 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుడి విగ్రహం ఉంది. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల రెండవ రాజధానిగా కొలనుపాక ఉండేది. ఆ కాలంలో ఈ గ్రామం జైనుల మత కేంద్రంగా వర్ధిల్లింది. ఇక్కడ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
పురాతన సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకోవాలని అనుకునే వారికి అద్భుత మ్యూజియం ఇది. వెయ్యి సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న స్మారక శిలలు లేదా వీరగల్లులుగా పిలిచే విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. హిందూ, జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, ఇతర వస్తువులున్నాయి. 6 నుంచి 16వ శతాబ్దాల కాలం నాటి మహావీర, మత్స్యవల్లభ, చాముండి, నంది లాంటి ముఖ్య శిల్పాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ శిల్పాలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసింది. ఇందులో కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుంచి, సమీప గ్రామాల నుంచి సేకరించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. చాళుక్య, కాకతీయ శైలికి సంబంధించిన 100కుపైగా శిల్పాలు కనిపిస్తాయి.
ముఖ్యమైన విగ్రహాలు...
క్రీ.శ.1076–1127 మధ్య కాలంలో కొలనుపాకని పరిపాలించిన త్రిభువనమల్ల రాజు వేయించిన విజయ స్తంభం. దీనికి నాలుగు వైపులా శాసనం ఉండటం విశేషం. చాళుక్యుల కాలం నాటి వినాయక, నటరాజ విగ్రహాలు, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వీరగల్లు, మహిషాసురమర్ధిని విగ్రహాలు, కాకతీయుల కాలం నాటి చాముండి విగ్రహం, నంది, వజ్రపాణి విగ్రహం, విజయ నగర కాలం నాటి కోదండ రామస్వామి విగ్రహం చూడొచ్చు. చాళుక్యుల కాలం నాటి మహావీరుని విగ్రహం
యోగముద్రలో ఉంటుంది.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి కొలనుపాక 79 కిలో మీటర్లు పర్యాటకులు హైదరాబాద్ నుంచి బస్సు లేదా రైలులో ఆలేరు వరకుచేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. మ్యూజియం ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి శుక్రవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. ప్రవేశం ఉచితం.
Comments
Please login to add a commentAdd a comment