
సాక్షి, తిరుమల: టీటీడీకి భారత పురావస్తు శాఖ శుక్రవారం రాసిన లేఖ కలకలం రేపింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షిత సంపదగా గుర్తించాలని పురావస్తు శాఖ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఆలయ చారిత్రక ప్రాధాన్యతాంశాలను పరిశీలించేలా, దాన్ని రక్షిత సంపదగా గుర్తించేలా తమ శాఖ ప్రతినిధులకు సహకరించాలని పురావస్తు శాఖ నుంచి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు లేఖ అందింది.
అయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం స్పష్టం చేశారు. అనంతరం టీటీడీ ఈవోకు పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు భారత పురావస్తు శాఖ అధికారిణి టి.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం లేఖ విడుదల చేశారు. దీనిపై టీటీడీ ఈవో హర్షం వ్యక్తం చేశారు.