శాతవాహనుల కాలం నాటి ఇటుకలు..(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో శాతవాహనుల కాలం నాటి ఇటుకలు మాయమయ్యాయి. సమీప ప్రాంతాల్లోని ప్రజలు తమ సొంత నిర్మాణాల కోసం పాతకాలం నాటి గోడల్ని ధ్వంసం చేసి వాటిని తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పురావస్తు శాఖ.. వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలో తెలియక తలపట్టుకుంటోంది. బయటికి చెబితే తమకే చెడ్డ పేరొస్తుందని దొరికిన ఇటు కల్ని గుట్టుచప్పుడు కాకుండా స్వాధీనం చేసుకుంటూ రికార్డు చేసే పనిలో పడ్డారు అధికారులు.
70 ఎకరాల్లో..
పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో శాతవాహనుల కాలం నాటి నిర్మాణాలున్న ప్రాంతంలో 1955 నుంచి 1981 మధ్య ప్రాంతంలో పురా వస్తు శాఖ ఐదారు దఫాలు తవ్వకాలు జరిపింది. ఆ సమయంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో నిర్మాణాలు వెలుగు చూశాయి. దాదాపు 3 వేలకుపైగా శాతవాహనుల, రోమన్ నాణేలు బయటపడ్డాయి. కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత అక్కడ తవ్వకాలు జరగలేదు. దీంతో అక్కడ 70 ఎకరాల భూములు సేకరించి నిర్మాణాలు పరిరక్షించాలని అప్పటి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలోనే ఇటీవల తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ.. అప్పట్లో తవ్వకాల్లో వెలుగు చూసిన నిర్మాణాలు అదృశ్యమైనట్లు గుర్తించింది.
ఓ ఊళ్లో దేవాలయానికి..
ఇటీవల ఓ ఊళ్లో శాతవాహనుల కాలం నాటి ఇటుకల రాశి కనిపించింది. అక్కడి ఓ దేవాలయాన్ని పునర్ నిర్మించేందుకు కూల్చడంతో ఆ ఇటుకలు బయటపడ్డాయి. అవన్నీ పెద్దబొంకూరు నిర్మాణాల్లోని ఇటుకలుగా అధికారులు గుర్తించారు. గోడలు ధ్వంసం చేసి ఆ ఇటుకలు తీసుకెళ్లి గుడి నిర్మించారని తేల్చారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని వివరాలు రికార్డు చేశారు. అలాగే కొన్ని ఊళ్లలో ఇళ్లు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలకు ఈ ఇటుకలు వాడినట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికీ చెక్కుచెదరకుండా..
శాతవాహన కాలం నాటి ఆ ఇటుకల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. అయినా ఇప్పటికీ అవి దృఢంగా ఉన్నాయి. 58 అంగుళాల పొడవు, 26 అంగుళాల వెడల్పు, 8 అంగుళాల మందంతో మనం వాడే సాధారణ ఇటుకకు మూడు, నాలుగు రెట్లు పెద్దగా ఉంటాయి ఆ ఇటుకలు. అలనాటి నిర్మాణాలు వేల ఏళ్ల పాటు మనగలగడంలో వీటిదే ప్రధాన పాత్ర.
కోటిలింగాల వద్ద కూడా..
శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల వద్ద కూడా తవ్వకాల్లో భారీ నిర్మాణాలు వెలుగు చూశాయి. కానీ ఇటీవల పుష్కరాల సమయంలో పార్కింగ్ కోసం పదెకరాల స్థలంలో భూమిని చదును చేసి రోలర్‌తో తొక్కిం చారు. దీంతో దిగువనున్న నిర్మాణాలు భూగర్భంలోనే ధ్వంసమై ఉంటాయని భావిస్తున్నారు. ధూళికట్టలో అద్భుత బుద్ధ స్థూపం ఉన్న ప్రాంతానికి కిలోమీటరు దూరంలో శాతవాహనుల కాలం నిర్మాణాలు, కోటగోడ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనూ చాలా వరకు నిర్మాణాలు ధ్వంస మయ్యాయి. ఫణిగిరి, గాజులబండ, కర్ణమామిడిల్లోనూ నిర్మాణాలు ధ్వంసమవుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment