ఆలయాలు, కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు నగరం: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హనుమకొండ అర్బన్: చారిత్రక వారసత్వ నగరం ఓరుగల్లు సుస్థిర అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన అయన హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో భేటీ అయ్యారు. అదే విధంగా నగరంలోని వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి, పద్మాక్షి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు.
కాకతీయ ఆలయాల శిల్పకళను పరిశీలించారు. వరంగల్ కోట, వరంగల్ ఎన్‌ఐటీలను సందర్శించి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హనుమకొండ రెడ్‌క్రాస్‌ను సందర్శించి తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా అదనపు బ్లాక్‌ను ప్రారంభించారు. రెడ్‌క్రాస్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వరంగల్ నగరం సుస్థిర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
లక్నవరం సరస్సులో బోటింగ్
మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో బసచేసిన గవర్నర్ బుధవారం ఉదయం సరస్సులో మంత్రి సీతక్క, అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. సరస్సు అంతా కలియదిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment