
12 నుంచి బడ్జెట్ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదించే అవకాశం
27 వరకు సమావేశాలు కొనసాగే సూచనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి 12న ఉదయం 11 గంటలకు సమావేశం అవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 12న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, బీఏసీలో చర్చ అనంతరం సభా నిర్వహణ తేదీలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించనున్నారు.
రెండు కీలక బిల్లులు ఈసారే..: బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు 12వ తేదీన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఆ తర్వాత హోలీ, ఆదివారం సెలవులు ఉండటంతో సోమవారం మళ్లీ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అదే రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం ఆమోదించి, బీసీల రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ముందుకు తేనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఈ నెల 18 లేదా 19 తేదీల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్, శాఖలవారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఉగాది, రంజాన్ పర్వదినాల నేపథ్యంలో 27వ తేదీతో సమావేశాలు ముగిస్తారని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment