kakatiya kingdom
-
ఆంధ్రాలో కాకతీయుల తమిళ శాసనం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు (తెలంగాణ) కేంద్రంగా పాలించిన రాజు.. ఆంధ్రాలోని ఓ దేవాలయం.. అక్కడ తమిళంలో శాసనం.. కాకతీయ చక్రవర్తుల అద్భుత పాలన తీరుకు మరో సజీవ సాక్ష్యమిది. నాటి చక్రవర్తి ప్రతాపరుద్రుడు కొంతమేర తమిళులున్న ఓ ప్రాంతంలో వారి సౌకర్యం కోసం తమిళ భాషలో శాసనం వేయించడం విశేషం. నష్టపోయిన వారికి బీమా కోసం.. ప్రస్తుతం ఏపీలోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లిలో క్రీస్తు శకం 1244వ సంవత్సరంలో కాకతీయ గణపతి దేవచక్రవర్తి ఓ శాసనం వేయించారు. ఆనాటి సముద్ర వాణిజ్యంలో భాగంగా ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే ఆదుకునేందుకు బీమా పథకాన్ని ప్రారంభిస్తూ.. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో శాసనం రాయించారు. మళ్లీ 64 ఏళ్ల తర్వాత 1308 ఆగస్టు 1న అదే మోటుపల్లిలో ప్రతాపరుద్రుడు తమిళంలో వేయించిన మరో శాసనం తాజాగా వెలుగు చూసింది. మోటుపల్లి కోదండ రామాలయ రాజగోపురం గోడ రాళ్లలో తమిళంలో రాసి ఉన్న శాసనాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం గుర్తించారు. ఆలయ పునరుద్ధరణ పనుల కోసం మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ అధ్యక్షుడు బొండా దశరామిరెడ్డి ఆహ్వానంపై వెళ్లిన ఆయన.. ఆలయాన్ని పరిశీలించే క్రమంలో ఈ శాసనం వెలుగుచూసిందని తెలిపారు. గోడ నిర్మాణంలో అడ్డంగా పెట్టిన ఆ ఓ రాయిపై ఉన్న అక్షరాలను అచ్చు తీసి చదవగా.. ప్రతాపరుద్రుడు వేయించిన దాన శాసనంగా తేలిందని వివరించారు. దీనిపై కేంద్ర పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డిని సంప్రదించామన్నారు. గతంలో ఆ శాసనం నకలును తీశామని.. మోటుపల్లిని దేశి ఉయ్యకొండపట్నమని, ఒక తమిళ ఉత్సవానికి కొంత భూమిని దానం చేసినట్టు అందులో ఉందని మునిరత్నంరెడ్డి వివరించారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ శాసనం వివరాలను అధికారికంగా రికార్డు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మోటుపల్లి పోర్టు పూర్వకాలంలో వాణిజ్య కేంద్రంగా ఉండేదని, వ్యాపార రీత్యా తమిళులు పెద్దసంఖ్యలో వచ్చి స్థిరపడ్డటంతో ప్రతాపరుద్రుడు తమిళంలో శాసనం వేయించి ఉంటారని శివనాగిరెడ్డి తెలిపారు. గణపతిదేవుడు నిర్మించిన ఈ ఆలయం మొదట్లో ఇది చెన్నకేశవ దేవర పేరుతో ఉందని, ఈ మేరకు ఓ శాసనం ఉందని చెప్పారు. సుమారు 50 ఏళ్ల కింద ఆలయంలోని విగ్రహం భిన్నంగా ఉందంటూ తొలగించి.. కోదండ రామాలయంగా మార్చారని వెల్లడించారు. తాజా శాసనంలో ఈ ఆలయాన్ని రాజనారాయణ పెరుమాళ్‌గా ప్రస్తావించారని తెలిపారు. అరుదైన ఈ శాసనాన్ని వెలికి తీసి ప్రత్యేకంగా ప్రతిష్టించాల్సి ఉందన్నారు. -
కాపురం గుట్టల్లో కాకతీయ స్థావరం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కోటకు ఆవల కాకతీయుల సైనిక రహస్య స్థావరం ఉండేదా? గోదావరి తీరాన చిట్టడివిలో రెండవ ప్రతాపరుద్రుడు శత్రువు గుర్తించని వనదుర్గం కట్టాడా? కాకతీయుల సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఈ సైన్యంతోనే అల్లావుద్దీన్ ఖిల్జి సేనాని మాలిక్ కాఫర్‌పై దాడి చేశాడా?.. యువ చారిత్రక పరిశోధకుడు అరవింద్ ఆర్య పరిశోధనలు అవుననే సమాధానమిస్తున్నాయి. శత్రువుల రాకను ముందే పసిగట్టడానికి కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ పటిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కోసం నలువైపులా నిర్మించిన బురుజుల ఆధారాలు లభ్యమయ్యాయి. ముందే పసిగట్టేందుకు.. కాకతీయ సామ్రాజ్యంపై శత్రు రాజుల కన్నెప్పుడూ ఉండేది. ఢిల్లీ సుల్తాన్లు 5 సార్లు కాకతీయ సామ్రాజ్య ఆక్రమణకు దండెత్తారు. ఈ 5 మార్లు సుల్తాన్ల సైన్యం గోదావరి మీదుగానే ప్రయాణం చేసి ఓరుగల్లు రాజ్య ప్రవేశం చేసింది. దీంతో పరాయి సైన్యం రాకను ముందే పసిగట్టి నిలువరించేందుకు రెండవ ప్రతాప రుద్రుడు ఓరుగల్లు కోటకు ఉత్తర దిక్కున 140 కి.మీ దూరంలో కాపురం, వల్లూరు, ప్రతాపగిరి, నందిగామ గొంతెమ్మ గుట్టల మీద రహస్య స్థావరాలు ఏర్పాటు చేసిన చారిత్రక ఆనవాళ్లు వెలుగుచూశాయి. 200 మందికి పైగా సైనికులకు ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచేర్లకు 3 కిలోమీటర్ల దూరంలో కాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరికి కాస్త దూరంలో దట్టమైన అడవిలో మూడు కొండలు కనబడుతుంటాయి. శిల్పి పనిగట్టుకొని ఉలితో చెక్కిన తరహాలో ఈ గుట్టలున్నాయి. ఆ కొండల పైభాగంలో ఆలయం, సహజంగా ఏర్పడ్డ రాతి గోడ, ఆ పక్కనే మానవ నిర్మిత కోట గోడలు, బురుజులు, పెద్ద రాతి స్తంభాలు, కుండ పెంకులు లభ్యమయ్యాయి. వాన నీటి నిల్వ కోసం కొండ పైభాగంలో నాడు నిర్మించుకున్న బావుల లాంటి నిర్మాణాలు నేటి చెక్ డ్యాంలను తలపిస్తాయి. గుట్టల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాలు, సైనికుల నివాసానికి కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపున గుహలున్నాయి. రెండు కొండలను కలుపుతూ సుమారు 500 మీటర్ల మేర సహజ సిద్ధంగా ఏర్పాటైన రాతి గోడ ఉంది. ఈ రెండు గుహలలో 200 మందికి పైగా సైనికులు నివాసం ఉండేందుకు సరిపడేంత స్థలం గుర్తించారు. గరుడ విగ్రహం, సైనిక గుహ ముఖ భాగం మూడంచెల భద్రత రక్షణ కోసం కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెల్లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతి గోడలు, సైనికుల పహారా కోసం నలువైపులా బురుజులు ఉన్నాయి. సైనికుల అవసరాల కోసం కొండ పైభాగంలో 1వ, 2వ కోటగోడల మధ్య రెండు చెక్ డ్యాంలను పోలి ఉన్న బావులు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడ నిర్మించుకున్నారు. సుల్తానులను నిలువరించడానికే కొండ మీద దొరికిన చారిత్రక ఆనవాళ్లు, అక్కడి చుట్టు పక్కల గ్రామాల్లోని జన బాహుళ్యం నుంచి సేకరించిన సాంస్కృతిక ఆనవాళ్ల ఆధారంగా ఇక్క డ కాకతీయుల రహస్య సైనిక స్థావరం ఉందనే అంచనాకు వచ్చాం. గోదావరి నది మీదుగా ఢిల్లీ సుల్తానులు పదే పదే దండెత్తుతుండటంతో కాకతీయులు దీనిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. – అరవింద్ ఆర్య పరికి, చరిత్ర యువ పరిశోధకుడు సైనిక స్థావరాలు ఉండొచ్చు కొండ మీద దొరికన ఆనవాళ్ల ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఉండొ చ్చని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి సరైన చారిత్రక అవగాహన లేదు. చారిత్రక, సాంస్కృతిక, అజ్ఞాత చరిత్ర ఇక్కడ దాగి ఉంది. పురావస్తు శాఖ అధికారులు పూర్తిగా పరిశోధన చేసి ఈ ప్రాంత చరిత్ర, కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలి. – ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు -
వారసత్వ వరంగల్
జాతీయ ఉత్తమ ‘హెరిటేజ్ సిటీ’గా ఓరుగల్లు సాక్షి, హన్మకొండ : కాకతీయులు నడయాడిన నేలకు ఉత్తమ వారసత్వ నగరంగా జాతీయ అవార్డు దక్కింది. 2014–15 సంవత్సరా నికి సంబంధించి వరంగల్ నగరాన్ని ఉత్తమ వారసత్వ నగరంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వరంగల్‌కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ 2012 ఏడాదికి ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది. వారసత్వానికి పట్టం .. కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా రెండువందల ఏళ్లు పరిపాలించారు. ఆనాటి పాలనకు గుర్తుగా వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్, కీర్తితోరణాలు, మెట్ల బావి ఇలాంటి ఆనవాళ్లు నేటికీ మిగిలి ఉన్నాయి. ఈ చారిత్రక వారసత్వ సంపదను చూసేందుకు పర్యాటకులు వరంగల్‌కు వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరం, జిల్లాగా వరంగల్‌కు గుర్తింపు ఉంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ను ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపిక చేసింది. అభివృద్ధి పథంలో.. నాటి కాకతీయుల రాజధానినే నేడు ఖిలావరంగల్గా పేర్కొంటున్నారు. 12వ శతాబ్ధంలో వలయాకారంలో మట్టికోట, రాతికోటలను నిర్మించారు. వీటి మధ్యలో కాకతీయ సామ్రాజ్య చిహ్నంగా నిలిచిన కీర్తితోరణాలు, కుష్మహల్ ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ ఖిలావరంగల్‌లో రూ.5 కోట్ల వ్యయంతో సౌండ్, లైట్‌షోను ఏర్పాటు చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ హృదయ్ పథకం కింద రూ.15.73 కోట్ల నిధులు కేటాయించింది. వీటితో రాతి కోట చుట్టూ ఉన్న అగడ్తాను పునరుద్ధరించి బోటింగ్‌కు అనువుగా మారుస్తారు. కోటకు వచ్చే పర్యాటకుల కోసం గుర్రపు బగ్గీలను ఏర్పాటు చేయడం వంటి పలు పనులు చేపట్టనున్నారు. వరంగల్ నగరంలో ఉన్న మరో అద్భుత కట్టడం హన్మకొండలో ఉన్న వేయి స్తంభాల దేవాలయం. శివుడు, విష్ణు, సూర్యుడు కొలువై ఉన్న త్రికూటాలయం ఇది. ఈ ఆలయాన్ని సైతం 12వ శతాబ్ధంలోనే కాకతీయలు నిర్మించారు. ఈ ఆలయానికి కేంద్రం హృదయ్ పథకం కింద కోటి రూపాయలు వ్యయంతో లైటింగ్, పార్కు, ఈ టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించింది. హృదయ్‌తో.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హృదయ్, స్మార్ట్‌సిటీ పథకాలతో వరంగల్ నగరంలో చారిత్రక ప్రాంతాల వద్ద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భద్రకాళీ మంచినీటి చెరువు తీర ప్రాంతం మొత్తాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందు కోసం హృదయ్ పథకం కింద రూ.15 కోట్లతో పనులు చేపట్టారు. ఫోర్ షోర్‌బండ్, ఎగ్జిబిషన్ ప్లాజా, వాకింగ్ ట్రాక్ తదితర సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి. నాటి నవాబుల పాలన దానికి అనుగుణంగా ఇక్కడ వర్థిన నాగరికతకు నిదర్శనంగా కాజీపేట బియమానీ దర్గా నిలుస్తుంది. బియబానీ ఉర్సు ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ హృదయ్ పథకం ద్వారా రూ.2.07 కోట్లతో పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా రూ.2.67 కోట్లతో పద్మాక్షీ ఆలయ గుండాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పద్మాక్షి గుట్టపై నుంచి నగరాన్ని వీక్షించేలా వ్యూ డెక్‌లను నిర్మాణం, సోలార్, విద్యుత్ దీపాలు అమర్చుతారు. భవిష్యత్తు వరంగల్దే.. రాష్ట్రంలోనే తొలి రోప్‌వే వరంగల్ నగరంలో నిర్మితం కానుంది. అదేవిధంగా సస్పెన్షన్ బ్రిడ్జి సైతం అందుబాటులోకి రానుంది. రీజనల్ సైన్స్ సెంటర్–పద్మాక్షి టెంపుల్‌ల మధ్యలో రోప్‌వే నిర్మించేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. పద్మాక్షి టెంపుల్–సిద్ధేశ్వరాలయం, రుద్రాలయం (కాలభైరవ) , ఈ మూడు గుట్టల మధ్య ఉన్న రాళ్లు, బండలతో సహజమైన రాక్‌గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పద్మాక్షిగుండం పక్క స్థలాన్ని ఎగ్జిబిషన్ జరిపేందుకు అనువుగా మారుస్తారు. పద్మాక్షి టెంపుల్ నుంచి సిద్ధేశ్వరాలయం వెళ్లే దారిలో హస్త కళలు ప్రదర్శించేందుకు క్రాఫ్ట్‌బజార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సిద్ధేశ్వరాలయం గుట్టలు– భద్రకాళి చెరువు మత్తడి మధ్యలో వేలాడే వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జి) నిర్మించాలని స్మార్ట్‌సిటీ ప్లాన్‌లో పొందుపరిచారు. అంతేకాకుండా మ్యూజికల్ గార్డెన్లో లేజర్‌షోను అందుబాటులోకి తేనున్నారు.