వారసత్వ వరంగల్
-
జాతీయ ఉత్తమ ‘హెరిటేజ్ సిటీ’గా ఓరుగల్లు
సాక్షి, హన్మకొండ : కాకతీయులు నడయాడిన నేలకు ఉత్తమ వారసత్వ నగరంగా జాతీయ అవార్డు దక్కింది. 2014–15 సంవత్సరా నికి సంబంధించి వరంగల్ నగరాన్ని ఉత్తమ వారసత్వ నగరంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వరంగల్‌కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ 2012 ఏడాదికి ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది.
వారసత్వానికి పట్టం ..
కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా రెండువందల ఏళ్లు పరిపాలించారు. ఆనాటి పాలనకు గుర్తుగా వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్, కీర్తితోరణాలు, మెట్ల బావి ఇలాంటి ఆనవాళ్లు నేటికీ మిగిలి ఉన్నాయి. ఈ చారిత్రక వారసత్వ సంపదను చూసేందుకు పర్యాటకులు వరంగల్‌కు వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరం, జిల్లాగా వరంగల్‌కు గుర్తింపు ఉంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ను ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపిక చేసింది.
అభివృద్ధి పథంలో..
నాటి కాకతీయుల రాజధానినే నేడు ఖిలావరంగల్‌గా పేర్కొంటున్నారు. 12వ శతాబ్ధంలో వలయాకారంలో మట్టికోట, రాతికోటలను నిర్మించారు. వీటి మధ్యలో కాకతీయ సామ్రాజ్య చిహ్నంగా నిలిచిన కీర్తితోరణాలు, కుష్‌మహల్ ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ ఖిలావరంగల్‌లో రూ.5 కోట్ల వ్యయంతో సౌండ్, లైట్‌షోను ఏర్పాటు చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ హృదయ్ పథకం కింద రూ.15.73 కోట్ల నిధులు కేటాయించింది. వీటితో రాతి కోట చుట్టూ ఉన్న అగడ్తాను పునరుద్ధరించి బోటింగ్‌కు అనువుగా మారుస్తారు. కోటకు వచ్చే పర్యాటకుల కోసం గుర్రపు బగ్గీలను ఏర్పాటు చేయడం వంటి పలు పనులు చేపట్టనున్నారు. వరంగల్ నగరంలో ఉన్న మరో అద్భుత కట్టడం హన్మకొండలో ఉన్న వేయి స్తంభాల దేవాలయం. శివుడు, విష్ణు, సూర్యుడు కొలువై ఉన్న త్రికూటాలయం ఇది. ఈ ఆలయాన్ని సైతం 12వ శతాబ్ధంలోనే కాకతీయలు నిర్మించారు. ఈ ఆలయానికి కేంద్రం హృదయ్ పథకం కింద కోటి రూపాయలు వ్యయంతో లైటింగ్, పార్కు, ఈ టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించింది.
హృదయ్‌తో..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హృదయ్, స్మార్ట్‌సిటీ పథకాలతో వరంగల్ నగరంలో చారిత్రక ప్రాంతాల వద్ద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భద్రకాళీ మంచినీటి చెరువు తీర ప్రాంతం మొత్తాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందు కోసం హృదయ్ పథకం కింద రూ.15 కోట్లతో పనులు చేపట్టారు. ఫోర్ షోర్‌బండ్, ఎగ్జిబిషన్ ప్లాజా, వాకింగ్ ట్రాక్ తదితర సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి. నాటి నవాబుల పాలన దానికి అనుగుణంగా ఇక్కడ వర్థిన నాగరికతకు నిదర్శనంగా కాజీపేట బియమానీ దర్గా నిలుస్తుంది. బియబానీ ఉర్సు ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ హృదయ్ పథకం ద్వారా రూ.2.07 కోట్లతో పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా రూ.2.67 కోట్లతో పద్మాక్షీ ఆలయ గుండాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పద్మాక్షి గుట్టపై నుంచి నగరాన్ని వీక్షించేలా వ్యూ డెక్‌లను నిర్మాణం, సోలార్, విద్యుత్ దీపాలు అమర్చుతారు.
భవిష్యత్తు వరంగల్‌దే..
రాష్ట్రంలోనే తొలి రోప్‌వే వరంగల్ నగరంలో నిర్మితం కానుంది. అదేవిధంగా సస్పెన్షన్ బ్రిడ్జి సైతం అందుబాటులోకి రానుంది. రీజనల్ సైన్స్ సెంటర్–పద్మాక్షి టెంపుల్‌ల మధ్యలో రోప్‌వే నిర్మించేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. పద్మాక్షి టెంపుల్–సిద్ధేశ్వరాలయం, రుద్రాలయం (కాలభైరవ) , ఈ మూడు గుట్టల మధ్య ఉన్న రాళ్లు, బండలతో సహజమైన రాక్‌గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పద్మాక్షిగుండం పక్క స్థలాన్ని ఎగ్జిబిషన్ జరిపేందుకు అనువుగా మారుస్తారు. పద్మాక్షి టెంపుల్ నుంచి సిద్ధేశ్వరాలయం వెళ్లే దారిలో హస్త కళలు ప్రదర్శించేందుకు క్రాఫ్ట్‌బజార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సిద్ధేశ్వరాలయం గుట్టలు– భద్రకాళి చెరువు మత్తడి మధ్యలో వేలాడే వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జి) నిర్మించాలని స్మార్ట్‌సిటీ ప్లాన్‌లో పొందుపరిచారు. అంతేకాకుండా మ్యూజికల్ గార్డెన్‌లో లేజర్‌షోను అందుబాటులోకి తేనున్నారు.