- రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగోసారి స్వాతంత్య్ర వేడుకలు
- జాతీయ జెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్
- ఘనంగా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
- వర్ష సూచనతో ప్రత్యేకంగా షెడ్ల ఏర్పాటు
స్వాతంత్య్ర దినోత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలోనే అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోటపై జెండా ఎగరేయనున్నారు. ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కోటలోని రాణీమహల్ లాన్స్‌ను పూలతో అందంగా, ఆకర్షణీయంగా అలంకరించడమే కాకుండా భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చేసింది. – సాక్షి, హైదరాబాద్
ఇదీ సీఎం షెడ్యూల్..
మంగళవారం ఉదయం అమర వీరుల స్మారక స్థూపం వద్ద సీఎం నివాళులు అర్పించి గోల్కొండ కోటకు చేరుకుంటారు. 9.50 గంటలకు పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులకు ఎంపికైన అధికారులు, ప్రజాప్రతినిధులు, అవార్డు గ్రహీతలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేస్తారు. పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. వేడుకల నిర్వహణకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయటంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
వర్ష సూచనతో అప్రమత్తం..
వరుసగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షం కురిసినా స్వాతంత్య్ర దినోత్సవాలకు అంతరాయం కలగకుండా గోల్కొండ కోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రమే కోటలో సీఎం ప్రసంగించే వేదికకు ఇరువైపులా వీఐపీ గ్యాలరీల్లో వర్షం కురవకుండా రేకుల షెడ్లను అమర్చారు.
గవర్నర్ శుభాకాంక్షలు
తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న ఎందరో నిస్వార్థ దేశభక్తుల త్యాగ నిరతికి ఈ వేడు కలు జ్ఞాపకార్థంగా నిలుస్తాయని తన సందేశంలో పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛా ఫలాలను అందించిన దేశభక్తులను స్మరించుకుంటూ ప్రజలం దరూ స్వాతంత్య్ర దినోత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.