మది నిండా.. మువ్వన్నెల జెండా!
- గోల్కొండపై జెండా ఎగరేసిన సీఎం
- ఆకట్టుకున్న కళారూప ప్రదర్శనలు
- ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్
రాజన్న ఒగ్గుడోలు.. షేరీ బ్యాండు.. మర్ఫా.. బంజారా నృత్యాలు.. కొమ్ము బూరల సందడి.. పేరిణి శివతాండవం.. ముజ్రా, గుజరాతీ దాండియా.. పంజాబీ భాంగ్రా.. ఒక్కటేమిటీ భిన్న సాంస్కృతిక సౌరభాలు గుభాళిస్తుండగా మంగళవారం హైదరాబాద్ గోల్కొండ కోటలో 71వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కోట గోడలపై సైనికుల దుస్తుల్లో యువకుల కవాతు, అడుగడుగునా అలంకరణలు గోల్కొండకు కొత్త అందాలు తెచ్చిపెట్టాయి.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరుసగా నాలుగో పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహించింది. మంగళవారం ఉదయం పరేడ్ మైదానంలో అమర జవాన్లకు నివాళులర్పిం చిన సీఎం చంద్రశేఖర్‌రావు 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి అపూర్వ రావు ఆధ్వర్యంలో కోట ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అక్కడ్నుంచి కాన్వాయ్‌లో ప్రధాన వేదిక వద్దకు చేరుకున్న సీఎం జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరిం చారు. నార్సింగి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన 300 మంది విద్యార్థినులు త్రివర్ణ దుస్తులు ధరించి చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కవి సుద్దాల అశోక్ తేజ, గాయకుడు జయరాజ్, సాహితీవేత్త భాష్యం విజయ సారథి లను సీఎం సన్మానించారు.
తర్వాత ఉత్తమ పని తీరు కనబరిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర విభాగాల ఉద్యోగులు, హరితహారంలో విశిష్ట కృషి చేసిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులను సన్మానించారు. మంచిపనితీరు కనబరిచిన పోలీసులకు అవార్డులు అందించారు. కొందరు ఉద్యోగులు సన్మాననం తరం సీఎంకు పాదాభివందనం చేశారు. చక్రాల కుర్చీలో వచ్చిన భాష్యం విజయసారథికి సీఎం పాదాభివందనం చేశారు. మరణానంతరం ఇద్దరు పోలీసు అధికారుల భార్యలకు పురస్కారం అందించారు. సిద్ధయ్య అనే ఎస్సై భార్య తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని, ఇతరత్రా రావాల్సిన లబ్ధికి సంబంధించి సీఎంకు విన్నవించగా వెంటనే వాటిని పరిష్కరించాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.
ఒక్కో కళారూపానికి అర నిమిషమే...
తెలంగాణ సంప్రదాయ కళారూపాల ప్రదర్శనకు గోల్కొండ కోట వేదికైంది. కళాకారులను ఉదయమే తీసుకొచ్చి వేడుక జరిగే వేదిక చుట్టూ ఉన్న కోట గోడలపై వరుసగా నిలబెట్టారు. ముఖ్య మంత్రి వచ్చే ముందు వారితో కళారూపాలవారీగా ప్రదర్శనలు ఇప్పిం చాల్సి ఉంది. కానీ సమయాభావం పేరుతో ఒక్కో కళారూపానికి కేవలం అర నిమిషం సమయం మాత్రమే కేటాయించారు. దీంతో వారు ప్రదర్శన మొదలుపెట్టి ఊపందుకునే లోపే బలవంతంగా ఆపేయించాల్సి వచ్చింది. సీఎం వేదిక వద్దకు వచ్చిన వేళ అన్ని కళారూపాలను కలిపి ప్రదర్శించమన్నారు. వెరసి అటు కళాకారులు, ఇటు సందర్శకులు నిరుత్సాహానికి గురి కావాల్సి వచ్చింది.
సాధారణ ప్రజలకు నో ఎంట్రీ
గోల్కొండలో వేడుక ఇరుకు ప్రాంతంలో జరగటంతో ఎక్కువ మంది కూర్చునే అవకాశం లేకుండా పోయింది. దీంతో సాధారణ ప్రజలను పోలీసులు లోనికి అనుమ తించలేదు. తమ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేసి రాకుండా అడ్డు కోవటం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌లున్నప్పటికీ లోపల కూర్చునేందుకు స్థలం లేక వెనుదిరగాల్సి వచ్చింది. ఇక వాహనాలను పార్క్ చేయటం పెద్ద సమస్యగా మారింది. ఓ మైదానంతోపాటు హెచ్‌ఎండీఏ పార్కు స్థలాలను అందుకు కేటాయించినా ఇరుకు రోడ్లలో వాహనాలు ముందుకు కదల్లేక ఇబ్బంది ఎదురైంది. కోట ప్రధాన రహదారిపైనే భారీ సంఖ్యలో కార్లను నిలిపివేయటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇక కోట ప్రధాన రహదారులను సరిగా శుభ్రపరచలేదు. చెత్త, మురికినీళ్లు అలాగే ఉండడంతో ఆ ప్రాంతాలు దుర్గంధంతో నిండిపోయాయి.