బంగారు తెలంగాణకు బలమివ్వండి: సీఎం కేసీఆర్‌ | K Chandrasekhar Rao Speech At Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు బలమివ్వండి: సీఎం కేసీఆర్‌

Published Thu, Aug 16 2018 2:40 AM | Last Updated on Thu, Aug 16 2018 3:55 AM

K Chandrasekhar Rao Speech At Independence Day Celebrations - Sakshi

బుధవారం గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రస్థానం సాగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. బంగారు తెలంగాణకు పునరంకితమవుతున్నామని, ప్రజలు ఎప్పటికప్పుడు తగిన బలాన్ని అందించాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారమిక్కడ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతి అంశాలను వివరిస్తూ ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చరిత్రాత్మకమైన గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్‌ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించింది. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ నేడు పునరుత్తేజం పొందాయి. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్నాయి. అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదం చేస్తోంది.

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ అంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలోనే సంపూర్ణంగా నిమగ్నమైందని ప్రకటించారు. ప్రధాని చెప్పినట్లుగానే మనం చిల్లర మల్లర రాజకీయాలతోనో, వ్యర్థ వివాదాలతోనో పొద్దు పుచ్చలేదు. ఈ నాలుగేళ్ల సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నం. నాలుగేళ్లలో రాష్ట్రం ఏడాదికి సగటున 17.12 శాతం ఆదాయ వృద్ధి రేటును సాధించింది. పురోగామి రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. పెరుగుతున్న సంపదనంతా పేదరిక నిర్మూలనకు ఉపయోగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని పేర్కొన్నారు. నాడు జలదృశ్యంలో ఉద్యమానికి ఉద్యుక్తుడినవుతూ.. పోరాటాన్ని మధ్యలో ఆపితే రాళ్లతో కొట్టండని ప్రతిజ్ఞ చేశానని, అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసేవరకు విశ్రమించలేదని చెప్పారు. నేడు అదే సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకితమవుతున్నట్టు వివరించారు. ‘‘ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండ దండ. వారి దీవెనలే ప్రేరణ. తెలంగాణ విజయయాత్ర ఇలాగే కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరారు. వివిధ రంగాల అభివృద్ధికి, పురోగతికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే..

వ్యవసాయం, రైతులపై..
తెలంగాణలో వ్యవసాయరంగాన్ని పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకుంది. రూ.17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం కలిగించింది. రైతులకు పెట్టుబడి సమస్యను పరిష్కరించాలని ‘రైతుబంధు’ పేరుతో అపూర్వమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8 వేలను ఈ పథకం ద్వారా అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 49.49 లక్షల మంది రైతులకు రూ.5,111 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంత భారీ బడ్జెట్‌ నేరుగా రైతుల చేతికి అందించటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. వచ్చే నవంబర్‌లో రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. రాష్టంలో ఏ కారణంగానైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడవద్దని ప్రభుత్వం యోచించింది. ఏ రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించి, భరోసా కల్పించేందుకు రైతు బీమా పథకాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తెస్తోంది. దేశంలో ఇంత పెద్దఎత్తున రైతులకు బీమా సౌకర్యం కల్పించిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతీ ఏటా ప్రీమియం మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. రైతు మరణించిన పది రోజుల్లోపే వారి కుటుంబానికి బీమా మొత్తం అందేలా ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సీడీపై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీని ప్రారంభించింది. ఒక్కో యూనిట్‌కు రూ.80 వేలు కేటాయించింది.

కోటి ఎకరాలకు నీరిస్తాం
కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో ఏటా రూ.25 వేల కోట్లను కేటాయిస్తున్నాం. బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అదనపు నిధులు సమకూరుస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా పెండింగులో పడేసిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ ఏడాది మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ప్రాజెక్టులు పూర్తి కావడానికి రాత్రింబవళ్లు అంకితభావంతో పనిచేస్తున్న నీటి పారుదల శాఖకు అభినందనలు.

భగీరథపై 11 రాష్ట్రాల ఆసక్తి..
తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన అద్భుతం మిషన్‌ భగీరథ పథకం. శుద్ధి చేసిన నదీ జలాలను ప్రతీ ఇంటికీ, ప్రతీ రోజు అందించడానికి 1.40 లక్షల కిలో మీటర్ల పొడవైన భారీ పైపులైన్‌ నిర్మాణం జరిగింది. ఇప్పటికే 19 వేల పైచిలుకు ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నదీ జలాలు చేరుతున్నాయి. మిగతా గ్రామాల్లో పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం. అనుకున్న సమయం కన్నా ముందే ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడానికి కృషి చేస్తున్న మిషన్‌ భగీరథ యంత్రాంగానికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నా. మిషన్‌ భగీరథ కార్యక్రమం దేశ ప్రధానితోపాటు అందరి  ప్రశంసలు పొందింది. తెలంగాణ చూపిన దారిలో ఈ  పథకం అమలు చేయడానికి దేశంలోని 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా రాష్ట్రాల బృందాలు ఇక్కడికి వచ్చి  అధ్యయనం చేశాయి. తాగునీటి వసతి కల్పనలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం.

విద్యుత్‌ వెలుగులు
విద్యుత్‌ రంగంలో మన రాష్ట్రం అనూహ్య ప్రగతిని సాధించింది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారుతుంది.

బీసీలకు అండగా..
బీసీ కులాల వారు వారికి నచ్చిన పని చేసుకోవడానికి వీలుగా తగిన ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బ్యాంకులతో నిమిత్తం లేకుండా, లబ్ధిదారులు ఒక్క రూపాయి వాటాధనం చెల్లించాల్సిన అవసరం లేకుండా, వందకు వంద శాతం ఉచితంగా బీసీ కులాల వారందరికీ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది.

ప్రగతి భవన్‌లో జెండా వందనం
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మిషన్‌ భగీరథ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ముఖ్య కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పరేడ్‌ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం నివాళులర్పించారు. అనంతరం గోల్కోండ కోట వద్దకు చేరుకున్నారు.

జోనల్‌ ఆమోదం తర్వాత భారీగా నియమాకాలు
తెలంగాణ సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా పొందాలంటే స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలి. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షణ కోసం, ప్రభుత్వం కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్‌ కేడర్‌ ఉద్యోగాల్లో 95 శాతం అవకాశాలు స్థానికులకే లభించేలా చట్టం చేసింది. డిస్ట్రిక్ట్‌ కేడర్‌తోపాటు ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించడానికి సానుకూలత వ్యక్తం చేసింది. కేంద్ర ఆమోదం లభించిన వెంటనే కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల నియామక ప్రక్రియ పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం.

విశ్వనగరానికి ప్రత్యేక ప్రణాళిక
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. హైదరాబాద్‌ వాసులు ఎంతగానో ఎదురుచూసిన మెట్రో రైలు మొదటి దశ ప్రారంభమైంది.  రోజుకు లక్ష మందికిపైగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ఆనందాన్ని కల్గిస్తోంది. ప్రస్తుతం నాగోలు నుంచి మియాపూర్‌ వరకు 30 కి.మీ. మేర మెట్రో రైలు పరుగులు పెడుతోంది. వచ్చే నెల నుంచి అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు, నవంబర్‌లో అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు నడిపించడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

సంక్షేమంలో మనం నంబర్‌ వన్‌
దేశంలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది. రూ.40 వేల కోట్లతో 40కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమంలో దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచింది. ఆసరా పెన్షన్ల రూపంలో 41.78 లక్షల మందికి రూ.5,367 కోట్లను ప్రభుత్వం అందిస్తోంది.

  • రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందించేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ప్రారంభించింది. ఇప్పటివరకు 4 లక్షల మంది లబ్ధి పొందారు.  
  • దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. ఇప్పటి వరకు 12,974 ఎకరాలు కొనుగోలు చేసి, 5,065 మంది దళితులకు పంపిణీ చేశాం. దళితులకు మూడెకరాల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ.
  • మైనారిటీ ఐటీ పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్‌లో త్వరలోనే ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్స్, షీ టీమ్స్, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి, భద్రతకు దోహదపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
  • డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది.

రైతు బీమా షురూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోల్కోండ కోటలో ప్రారంభించారు. రైతుల బీమాకు సంబంధించిన మాస్టర్‌ ఇన్సూరెన్స్‌ బాండ్‌ను ఎల్‌ఐసీ దక్షిణ మధ్య విభాగం జోనల్‌ మేనేజర్‌ సుశీల్‌కుమార్‌ సీఎం సమక్షంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథికి అందించారు.

బీసీల ఉపాధి పథకాలు
బీసీ వృత్తి కులాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసే పత్రాలను సీఎం పంపిణీ చేశారు. ఎస్‌.రాజేశ్వరీ(తిరుమలగిరి), చిప్పోలు నిర్మల(ఆసిఫ్‌నగర్‌), పోలంపల్లి స్వప్న(ముషీరాబాద్‌), బర్రోతు లక్ష్మణ్‌రావు(ముషీరాబాద్‌), ముదగుల శ్రీనివాస్‌(షేక్‌పేట)లకు సీఎం ఈ పత్రాలను అందజేశారు.

అధికారులకు అవార్డులు
ఐదుగురు అఖిలభారత సర్వీసు అధికారులను ప్రభుత్వం ఉత్తమ సేవ పతకాలకు, ప్రశంసా పత్రాలకు ఎంపిక చేసింది. సీఎం కేసీఆర్‌ వీరికి అవార్డులు, పత్రాలను అందజేశా>రు. సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డి, అటవీ శాఖ అడిషనల్‌ పీసీసీఎప్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్, మత్స్యశాఖ కమిషనర్‌ సి.సువర్ణలు ఉత్తమ సేవాపత్రాలు అందుకున్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగం డీఐజీ టి.ప్రభాకర్‌రావు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ డీఐజీ రాజేశ్‌కుమార్‌లు ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు.

ఫొటోలు; గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement