ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పలువురు ఎమ్మెల్యేలతో ఆదివారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి అధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మేయర్లు బొంతు రామ్మోహన్, నన్నపునేని నరేందర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులపై ఎమ్యెల్యేలతో చర్చించారు. నీటి పారుదల కాల్వల నిర్మాణం, మరమ్మతులు, మిషన్ భగీరథ పనులను ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ పనుల్లో ఎక్కడైన జాప్యం జరిగినా, ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పనులు వేగవంతం జరిగేలా చూడాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజి, పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తయ్యే లోపు నీటి పారుదల కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకం లేక పూడుకుపోయిన ఫీడర్ ఛానళ్లు, పంట కాల్వలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరకల్లా రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.