వృత్తిపరమైన సంతృప్తికి.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్
సుందర నగరం విశాఖతోపాటు ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం మాటలకందనిది. ఈ విపత్తుతో నగరం అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రూ.వేల కోట్ల నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తూ.. సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలకు అండగా నిలుస్తూ నగరాన్ని ఒక దారికి తీసుకొస్తున్న నిపుణులు కనిపిస్తున్నారు. పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్న ఈ సిబ్బందే.. విపత్తుల నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్‌మెంట్) నిపుణులు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ప్రకృతి బీభత్సాలతోపాటు ప్రేరేపిత విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు శిక్షణ పొందిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది సేవలు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి. అందుకే ఈ రంగాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభ్యమవుతున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు
తుఫాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విలయాలతోపాటు ఉగ్రవాద, తీవ్రవాదుల దాడుల్లో అపారమైన నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు విపత్తుల నిర్వహణ సిబ్బంది కృషి చేస్తుంటారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణ బాధ్యతలను చేపడతారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర(ఎన్‌జీవో) సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న భారీ పరిశ్రమలు, భవనాల్లో వీరి సేవలు అవసరం. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రిసార్ట్‌ల్లో వీరిని నియమించుకుంటున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోనూ అవకాశాలున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ), ఐక్యరాజ్యసమితి(యూఎన్‌ఓ), రెడ్ క్రాస్, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బందికి కొలువులను కల్పిస్తున్నాయి. ఈ రంగంలో నిపుణుల కొరత వేధిస్తోంది. భారత్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో రీసెర్చ్ స్కాలర్స్ సంఖ్య స్వల్పంగానే ఉంది. మరోవైపు విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా అవకాశాలున్నాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు కేంద్ర హోంశాఖతోపాటు రాష్ర్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో చేరితే నిర్వాసితులకు సేవలు అందించామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది.
కావాల్సిన నైపుణ్యాలు: అన్ని రకాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. సకాలంలో వేగంగా స్పందించే గుణం అవసరం. అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలగాలి. కొత్త బాధ్యతలను చేపట్టి, పూర్తిచేసే సామర్థ్యం ఉండాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం.
అర్హతలు: డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై మన దేశంలో డిప్లొమా, సర్టిఫికెట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్, అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరొచ్చు. ఏవైనా సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంది.
వేతనాలు: డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. వృత్తిలో నాలుగైదేళ్ల అనుభవం ఉంటే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సొంతం చేసుకోవచ్చు. అంతర్జాతీయ ఎన్‌జీవోల్లో చేరితే నెలకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వేతనం పొందొచ్చు. ప్రభుత్వ సంస్థల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌కు నెలకు రూ.35 వేల వేతనం ఉంటుంది. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా చేరితే హోదాను బట్టి జీతభత్యాలుంటాయి. కన్సల్టెన్సీల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: http://nidm.net/
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.ignou.ac.in
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్
వెబ్‌సైట్: www.nbu.ac.in
ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.unom.ac.in
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
వెబ్‌సైట్: www.dmibhopal.nic.in
నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ
వెబ్‌సైట్: http://ncdcnagpur.nic.in/