రిహార్సల్స్ లో.. మేముసైతం | tollywood stars programs to help visakhapatnam | Sakshi
Sakshi News home page

రిహార్సల్స్ లో.. మేముసైతం

Published Thu, Nov 27 2014 10:54 PM | Last Updated on Tue, Aug 28 2018 5:06 PM

రిహార్సల్స్  లో.. మేముసైతం - Sakshi

రిహార్సల్స్ లో.. మేముసైతం

హుద్‌హుద్ తుఫాన్ అందాల విశాఖను కకావికలం చేసింది. పగబట్టిన సుడిగాలి స్టీల్ సిటీ గుండె నిబ్బరాన్ని కొన్ని గంటలు పరీక్షించింది. తుపాను ధాటికి తల్లడిల్లిన విశాఖకు తనువెల్లా తూట్లు పడ్డాయి. లక్ష కోట్లు నష్టపోయింది. పెను విషాదంలో మునిగిన విశాఖ నగరాన్ని ఊరడించడానికి టాలీవుడ్ నడుం బిగించింది. ఆ తరం నుంచి నేటి తరం వరకూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ‘మేముసైతం’ అంటూ రంగంలోకి దిగారు.

జూనియర్ ఆర్టిస్ట్స్ నుంచి బడా స్టార్స్ వరకూ.. లైట్‌మెన్ నుంచి కెమెరామెన్ వరకూ.. అందరూ తమ కళతో.. తుఫాను సృష్టించిన ‘అల’జడిని జయిస్తామంటున్నారు. జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా.. చేతనైన సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఈ నెల 30న మేముసైతం అంటూ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఆటపాటలు, డ్యాన్స్‌లు, స్కిట్స్‌తో అందరినీ అలరిస్తూనే.. వైజాగ్‌వాసులను ఓదారుస్తామంటున్నారు. ఇండస్ట్రీ తరఫున రూ.35 కోట్లు సాయం చేయాలని సంకల్పించుకున్నారు. ఈవెంట్‌ను సకె ్సస్ చేయడానికి ప్రాక్టీస్‌లో మునిగిపోయిన నటీనటులను ‘సిటీప్లస్’ పలకరించింది.
..:: శిరీష చల్లపల్లి
 
మారథాన్ పెర్ఫార్మెన్స్..
బిజీ షెడ్యూల్‌తో రెస్ట్‌లెస్‌గా ఉంది. అయితే హుద్‌హుద్ ధాటికి విశాఖలో నిలువ నీడ లేకుండా ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారికి చేయూతనివ్వడానికి నేనుసైతం మేముసైతంతో పాలుపంచుకుంటున్నాను. 12 నిమిషాల నిడివున్న సాంగ్‌పై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాను.
- శ్రేయ
 
అందుకే అందరం..
విపత్కర పరిస్థితుల్లో ముందుగా స్పందించేది సినిమా ఇండస్ట్రీయే. మా తరఫున భారీగా నిధులు సేకరించాలని భావిస్తున్నాం. ఒకే వేదికపై ఇందరిని చూడటం జరగని పని. కానీ, ప్రకృతి వైపరీత్యానికి సర్వం కోల్పోయిన వారి కోసం అందరం చేతులు కలిపి.. బాధితులకు భరోసానిస్తున్నాం.           
-అలీ
 
కమల్ వస్తున్నారు..
ఈ బిగ్ ఈవెంట్‌లో ఇండస్ట్రీ మొత్తం పాల్గొంటుంది. భారీనిధుల సేకరణే లక్ష్యంగా ఇంత పెద్ద ఈవెంట్‌ను డిజైన్ చేశాం. టాలీవుడ్ స్టార్స్ అందరితో పాటు కమల్‌హాసన్ కూడా వస్తున్నారు. స్టార్స్ ఆటపాటలతోపాటు ర్యాంప్‌వాక్ కూడా నిర్వహిస్తున్నాం. విశాఖ విలయం తర్వాత సిటీలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన వ్యక్తుల గురించి అందరికీ తెలియజేస్తాం.
- తమ్మారెడ్డి భరద్వాజ
 
మీకోసం మేము..
విశాఖ బాధితుల కోసం నేను, డెరైక్టర్ మారుతి, నటి మధు, నటుడు సాయి కలసి స్పెషల్ షూట్ చేస్తున్నాం. ఇది హుద్‌హుద్ బాధితులకు మనోధైర్యాన్నిచ్చేలా ఉంటుంది. మనమంతా ఒక్కటై ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొందాం. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. కానీ, మీకు మేమున్నాం మనోధైర్యాన్ని కోల్పోకండి.
- హీరో నందు
 
గుడ్ కాజ్..
నేను అక్ష, సంజన కలసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం. ఎనిమిదిన్నర నిమిషాల పాటు సాగే మాస్ సాంగ్ కోసం నాలుగు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక గుడ్ కాజ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది.
- మానస్ (కాయ్ రాజా కాయ్ హీరో)
 
చారిటీ.. యూనిటీ..
విశాఖ వైపరీత్యానికి బాధగా ఉన్నా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ప్రజలకు ఆనందం పంచుతూనే విశాఖవాసులకు చారిటీ చేయడం నాలుగు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నా. స్టీల్ సిటీగా పేరొందిన వైజాగ్ అంతే నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నాను.
- అక్ష (కందిరీగ ఫేమ్)
 
ఆనాటి నుంచే..
మమ్మల్ని బాగా ఉంచుతున్న ప్రేక్షకులు బాగుండాలని ఇండస్ట్రీ ఎప్పుడూ కోరుకుంటుంది. మేముసైతం ఈవెంట్‌లో టాలీవుడ్ టాప్ హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ అందరూ పాల్గొంటున్నారు. మా పెద్దమ్మాయి చేతన తొందర్లోనే వెండితెరకు పరిచయం కాబోతుంది. తను కూడా ఇందులో పాల్గొంటోంది.
- ఉత్తేజ్
 
ఓపెన్ హార్టెడ్‌గా..
మూడు రోజులుగా రిహార్సల్స్ సాగుతున్నాయి. అందరూ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తమన్నా, ఇషాచావ్లా, కావ్యలకు మెడ్లీ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాను. ఒక కాజ్ గురించి ఇండస్ట్రీ అంతా కలసి వర్క్ చేయడం గొప్ప ఫీలింగ్. అందరూ ఓపెన్ హార్టెడ్‌గా పని చేస్తున్నారు.
- రఘు మాస్టర్ (కొరియోగ్రాఫర్)
 
నాలుగు రోజులుగా..
నాలుగు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాం. ఓ కన్నడ సినిమా షూటింగ్ ఉంది. దాన్ని స్కిప్ చేసి మరీ ఇందులో పాల్గొంటున్నా. మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం దీన్ని ఓ బాధ్యతగా స్వీకరించాం.
- సంజన
 
మా తరఫున ఎందరో..
విశాఖ బాధితులకు మేం సాయం చేయడమే కాదు.. మా తరఫున ఎందరినో కదిలించి ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి మా నట కుటుంబం అంతా సీరియస్‌గా రిహార్సల్స్‌లో మునిగిపోయింది.
- కామ్నా జెఠ్మలానీ
 
సాయంకాలం
విశాఖ విలయంలో పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ మా ఈవెంట్ ద్వారా విశాఖవాసులకు  కొంత సాంత్వన కలుగుతుందని ఆశిస్తున్నాం. మేముసైతం 12 గంటలపాటు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో క్రికెట్, అంత్యాక్షరి, ఖోఖో, కబడ్డీ, తంబోలా, సాంగ్, డ్యాన్స్, మ్యూజిక్, స్కిట్స్ ఇలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. 29 నైట్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో స్టార్ డిన్నర్ నిర్వహిస్తున్నాం. స్టార్స్‌తో భోజనం చేసేందుకు జంటకు రూ.లక్ష టికెట్ ధరగా నిర్ణయించాం. టికెట్ తీసుకున్నవారు స్టార్స్‌తో భోజనం చేయొచ్చు.  30న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది.

దీని టికెట్ ధర రూ.3 వేలు. ఈ టికెట్లు బిగ్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ రోజు సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయి. స్టార్ ఈవెంట్స్ చూడాలనుకునే వారు ముందుగా రూ.500 టికెట్స్ కొనాలి. వీటిని కొన్నవారిలో లక్కీ డ్రా ద్వారా 104 మందిని ఎంపిక చేస్తాం. వీరికి మాత్రమే స్టార్ సెలబ్రేషన్స్‌ను దగ్గరుండి చూసే చాన్స్ లభిస్తుంది. స్టేడియంలో తంబోలా గేమ్ టికెట్ ధర రూ.15 వేలు. ఇందులో గెలిచిన వారికి భారీ బహుమతి కూడా ఉంటుంది.
- దగ్గుబాటి సురేష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement