న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీగా సేవలు అందించే యాత్రా ఆన్‌లైన్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికన్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఈబిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విలీన ఒప్పందం విలువ 337.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,325 కోట్లు)గా ఉండనుంది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి డీల్ పూర్తి కావచ్చని అంచనా. లావాదేవీ పూర్తయ్యాక ఈబిక్స్ గ్రూప్‌లోని ఈబిక్స్‌క్యాష్ వ్యాపార విభాగంలో ఒక భాగంగా యాత్ర ఉంటుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. యాత్ర బ్రాండ్ పేరిటే ఇకపైనా సేవలు కొనసాగుతాయని వివరించాయి. ఒక్కో షేరుకు 4.90 డాలర్ల రేటు చొప్పున యాత్ర సంస్థ విలువను 337.8 మిలియన్ డాలర్లుగా లెక్కించినట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతి పెద్ద, అత్యంత లాభసాటి ట్రావెల్ సేవల కంపెనీగా ఈబిక్స్‌క్యాష్ ఆవిర్భవించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఈబిక్స్ చైర్మన్ రాబిన్ రైనా తెలిపారు. అలాగే ఈబిక్స్‌క్యాష్ ఐపీవోకూ ఊతం లభించగలదని చెప్పారు. బహుళజాతి ఆన్–డిమాండ్ సాఫ్ట్‌వేర్, ఈ–కామర్స్ సంస్థలో భాగం కావడం ద్వారా తమ షేర్‌హోల్డర్ల పెట్టుబడులకు వృద్ధి అవకాశాలు లభించగలవని యాత్రా ఆన్‌లైన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ శృంగి చెప్పారు.
ఈబిక్స్‌కు ఇప్పటికే వయా, మెర్క్యురీ పేరిట రెండు ట్రావెల్ సేవల వ్యాపార విభాగాలు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌లో సెంట్రమ్ గ్రూప్‌నకు చెందిన ఫారెక్స్ కార్డ్ వ్యాపార విభాగం సెంట్రమ్ డైరెక్ట్‌ను రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఎస్సెల్ ఫారెక్స్‌ను 8 మిలియన్ డాలర్లకు, వీజ్‌మాన్ ఫారెక్స్‌లో 49 మిలియన్ డాలర్లకు 75 శాతం వాటాలు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment