బోగస్ బుకింగ్‌తో ఎయిర్‌వేస్‌కు టోకరా
► ట్రావెల్ ఏజెన్సీల మాయాజాలం
► కోరుట్లలో సైబర్‌క్రైం పోలీసుల ఆరా
కోరుట్ల : బోగస్ పేర్లతో టిక్కెట్లు కావాలని కోరుతూ విమాన టిక్కెట్లను బ్లాక్ చేసి తాము బుకింగ్ చేసిన టిక్కెట్లను అధిక ధరలకు అమ్ముకుంటున్న ట్రావెల్ ఏజెన్సీల నిర్వాకంపై బుధవారం సైబర్ క్రైం పోలీసులు కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఆరా తీశారు. సాధారణంగా ఆయా ఎయిర్‌వేస్ కంపెనీలకు చెందిన విమానాల టిక్కెట్లకు అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తారు. దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది ట్రావెల్ ఏజెన్సీల వారు బోగస్ టిక్కెట్లు బుకింగ్ చేసి ఎయిర్‌వేస్ టిక్కెట్లు అన్ని బుక్ అయినట్లుగా ఆన్‌లైన్‌లో చూపిస్తారు. టిక్కెట్లు అన్ని అమ్ముడయినట్లుగా ఆన్‌లైన్‌లో కనిపించడంతో ఫ్లయిట్ టిక్కెట్లు అవసరమైన వారు ధర ఎక్కువైనా చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తారు.
ఆ తరువాత ముందుగానే తాము బుకింగ్ చేసిన టిక్కెట్లను అవసరమైన వారికి అధిక ధరలకు అమ్ముకుంటారు. ఈవిధంగా నెలరోజుల క్రితం సుమారు 20 రోజులపాటు ప్లైదుబాయ్ కంపెనీకి చెందిన విమానం టిక్కెట్లను కోరుట్లకు చెందిన ఓ ప్రయివేటు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు డమ్మీ బుకింగ్‌తో బ్లాక్ చేశారు. దీంతో ప్లైదుబాయ్ కంపెనీకి చెందిన విమానం టిక్కెట్లు అన్నీ బుక్ అయినట్లుగా ఆన్‌లైన్‌లో కనబడింది. టిక్కెట్లు అవసరమైన ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ట్రావెల్ ఏజన్సీ నుంచి అధిక ధరలకు టిక్కెట్లు కొన్నారు. ఇలా హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు రూ.16 వేల నుంచి రూ.20వేల వరకు డిమాండ్ ఉన్న టిక్కెట్లను రూ.25వేల వరకు అమ్ముకున్నట్లు సైబర్‌క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు.
ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుల మాయాజాలంతో ఇటు ఎయిర్‌వేస్ కంపెనీకి, అటు ప్రయూణికులకు నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లై దుబాయ్ ఎయిర్‌వేస్ కంపెనీ తమకు వస్తున్న నష్టాల విషయమై హైదరాబాద్‌లోని సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు విచారణ చేసిన సైబర్ క్రైం పోలీసులు కరీంనగర్ జిల్లా కోరుట్ల కేంద్రంగా ఈ డమ్మీ బుకింగ్ చోటు చేసుకున్నట్లు గుర్తించారు. బుధవారం ప్లైదుబాయ్ కంపెనీ ప్రతినిధులతోపాటు సైబర్ క్రైం పోలీసులు పట్టణంలోని అన్ని ట్రావెల్ ఏజన్సీలకు ఆన్‌లైన్ కనెక్టివిటీ అందిస్తున్న జీకే నెట్‌వర్క్ వద్ద వివరాలు సేకరించారు. ఈ నెట్‌వర్క్ సర్వీసెస్ నుంచి లాగిన్ పాస్‌వర్డ్ వివరాలు సేకరించి పట్టణంలోని అన్ని ట్రావెల్ ఏజన్సీల వద్దకు వెళ్లి ఆరా తీశారు.
అనంతరం కోరుట్లలోని ట్రావెల్ ఏజన్సీలకు ప్లై దుబాయ్ కంపెనీకి చెందిన టికెట్ బుకింగ్ వ్యవస్థను లాక్ చేశారు. డమ్మీ బుకింగ్‌కు పాల్పడిన ట్రావెల్ ఏజన్సీల వివరాలు వెల్లడించడానికి ఫ్లైదుబాయ్ ఏయిర్‌వేస్ ప్రతినిధులు నిరాకరించారు. ఈ విషయంలో సైబర్ క్రైం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.