అఫ్జల్‌గంజ్: ఆదాయ పన్ను చెల్లించకుండా అక్రమంగా పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న ఓ ట్రావెల్స్ సంస్థపై ఆదాయ పన్ను శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేశారు.
రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 800 గోనె సంచులలోని పొగాకును స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించారు. నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఒకారా ట్రాన్స్‌పోర్ట్స్ నుంచి అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పక్కన గల ఒకారా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి రెండు లారీల్లో (హెచ్‌ఆర్ 55కె7774, ఆర్‌జె 09జిబి0245) సరుకు దిగుమతయింది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ డీ సీపీ సునీతారెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారి దామోధర్ రావుల నేతృత్వంలో సిబ్బంది ఒకారా ట్రావెల్స్‌పై బుధవారం రాత్రి దాడి చేశారు. 800 గోనె సంచుల్లో గల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బిల్లులు లేవని అధికారులు తెలిపారు.
ట్రాన్స్‌పోర్టు మేనేజర్ తిలక్‌రాజ్‌ను విచారించగా సరుకును ఎక్కడికి పంపుతున్నారన్న విషయం తనకు తెలియదని, ఢిల్లీలోని తమ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిందని అధికారులకు తెలిపారు. మేనేజర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్‌లో స్వాధీనం చేసుకున్న పొగాకు నిషేధిత గుట్కాల తయారీకి వినియోగించేదిగా తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.
ట్రావెల్స్ సంస్థపై ముప్పేట దాడి
Published Thu, Sep 18 2014 12:29 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement