
సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అనే భావనను కరోనా మాయం చేస్తోంది. ఈ మాయాదారి వైరస్ విజృంభిస్తుండడంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. నిత్యం బస్సుల్లో ప్రయాణికులు తమతమ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ బస్సులో కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ఆర్టీసీ తూ తూ మాత్రాంగా చర్యలు చేపట్టడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.
బిక్కు బిక్కుమంటూ బస్సుల్లో ప్రయాణం
నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. వీటీ పరిధిలో నిజామాబాద్‌లో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డిపో–1, డిపో–2, కామారెడ్డిలో బాన్సువాడ, కామారెడ్డి మొత్తం ఆరు డిపోలు ఉన్నాయి. మొత్తం 640 బస్సుల్లో అద్దె బస్సులు 181 ఉన్నాయి. ప్రతి రోజు బస్సులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు సైతం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. నిత్యం లక్షకుపైగా ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో బస్టాండ్‌లలో, బస్సుల్లో కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కేవలం నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలల్లో బస్టాండ్‌లలో శానిటైజేషన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోని, భౌతిక దూరం పాటించాలని మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మండల కేంద్రల్లో, గ్రామాల్లో ఉన్న బస్టాండ్‌లలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
కరోనా నిబంధనలు అమలు కావడం లేదు
కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు తమతమ పనుల నిమిత్తం పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నారు. పలు బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మేర ప్రయాణికులు కూర్చుంటున్నారు. కొన్నింటిలో నిల్చుని మరి ప్రయాణం చేస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. సీటుకు ఒకరు కూర్చున్న బస్సుల్లో ఒకరికి పాజిటివ్ ఉంటే మిగతా వారికే వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ బస్సుల్లో భౌతిక దూరం అమలు కావడం లేదు. అధికారులు కూడా నామమాత్రపు చర్యలతో సరి పెడుతున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం
ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు ఒక్కసారీ ముందస్తుగా శానిటైజేషన్ చేస్తున్నాం. అలాగే ప్రధాన బస్టాండ్‌లో మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణికులు మాస్కులు పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– సుధాపరిమళ, ఆర్టీసీ రీజీనల్ మేనేజర్
( చదవండి: కోవిడ్ ఎఫెక్ట్.. ఇక అంబులెన్స్ సేవలు ఫ్రీ.. )
Comments
Please login to add a commentAdd a comment