బస్సు కన్నా నడకే నయం.. ట్రాఫిక్ జామ్ జామ్
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ఎర్రగడ్డ నుంచి కూకట్‌పల్లి వరకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ప్రజలు బస్సుల్లోంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా వెళ్తే అయినా కాస్త ముందున్న బస్సులోకి వెళ్లొచ్చని, దాంతో త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లాల్సిన వారికి ఈ ట్రాఫిక్ జామ్ నరకం చూపిస్తోంది.
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. మూసాపేట వద్ద రోడ్డు చెరువును తలపిస్తుండడంతో వాహనాలు అటూ ఇటూ నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లకడీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గోతుల కారణంగా వాహనచోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.