సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల ఓ మోస్తరు వర్షం కురియగా.. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రిదాకా వర్షం పడుతూనే ఉంది. పలుచోట్ల నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. దాదాపు వంద కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. మూసీలో వరద పోటెత్తడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు.
భారీగా పిడుగుపాటు ఘటనలు
కుమురంభీం జిల్లా కౌటాల మండలం పార్డి గ్రామానికి చెందిన నౌగడే మాయబాయి (41), మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతు సత్తయ్య ఇద్దరూ చేనులో పనిచేస్తూ పిడుగుపాటుకు గురై మరణించారు. ఇక కౌటాల మండలం కనికి గ్రామంలో మందడే నానుబాయి, ఆమె ఇద్దరు కుమారులు పిడుగుపాటుకు గురై గాయపడ్డారు. వీరిలో నానుబాయి పరిస్థితి విషమంగా ఉంది. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో పిడుగుపాటు మేకల కాపరి లక్ష్మణ్ గాయపడ్డాడు.
చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం
మంజీర నది ఆవతలి ఒడ్డున చిక్కుకున్న గొర్రెలకాపరులు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్‌కు చెందిన సయ్యద్ గౌసొద్దీన్ (35) సమీపంలో పిడుగు పడటంతో శబ్ధానికి భయపడి పరుగెత్తి కాల్వలో పడి మృతి చెందాడు. కాగా.. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రానికి చెందిన ఎల్లాపురం ఆశయ్య, పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య మేకలు మేపేందుకు హనుమాన్ బండల్ సమీపంలోని కుర్వగడ్డకు వెళ్లి మంజీరా నది మధ్యలో చిక్కుకున్నారు.
మరో రెండు రోజులు వానలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలొచ్చే అవకాశం ఉందంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment