హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన!
జంట నగరాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు తాము ప్రజలను అప్రమత్తం చేస్తామని, ప్రజలు కూడా ట్రాఫిక్ విషయంలో తాము అందజేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో భారీ వర్షం మొదలైతే మాత్రం.. ఎప్పటిలా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఆఫీసుల నుంచి బయటకు రావొద్దని ఆయన సూచించారు.
వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉందని, అందువల్ల వర్షం పడితే మాత్రం ఆఫీసులలోనే ఆగాలని తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఫేస్‌బుక్, వాట్సప్, మొబైల్ యాప్, ఎఫ్ఎం రేడియోలు, టీవీ చానళ్ల ద్వారా నగరంలోని ఏయే ప్రాంతాలలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందన్న విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటామని రంగనాథ్ అన్నారు. వాటిని బట్టి ప్రజలు తమ ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.