సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్‌డౌన్ సడలింపు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల తర్వాత ఏపీ సరిహద్దు దాటి, సాయంత్రం 6 లోపు తిరిగి తెలంగాణ సరిహద్దులోకి బస్సులు రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు.
ఇక కర్ణాటకకూ సోమవారం నుంచే బస్సులు ప్రారంభం అవుతున్నా.. పరిమితంగానే తిరగనున్నాయి. ఎన్‌ఈకేఆర్టీసీ (కర్ణాటకలోని ఈశాన్య ఆర్టీసీ) మాత్రమే పచ్చజెండా ఊపింది. దాని పరిధిలోని యాద్గిర్, రాయచూర్, బీదర్, గుల్బర్గాలకు సోమవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ మినహాయింపు ఉండటంతో ఆ సమయాల్లో బస్సులు వెళ్లి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక కర్ణాటక ఆర్టీసీ పరిధిలోని బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు ఇంకా అనుమతి రాలేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రాపూర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు మంగళవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ముంబై, పుణే లాంటి దూరప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు తిప్పే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment