inter state
-
నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్డౌన్ సడలింపు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల తర్వాత ఏపీ సరిహద్దు దాటి, సాయంత్రం 6 లోపు తిరిగి తెలంగాణ సరిహద్దులోకి బస్సులు రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు. ఇక కర్ణాటకకూ సోమవారం నుంచే బస్సులు ప్రారంభం అవుతున్నా.. పరిమితంగానే తిరగనున్నాయి. ఎన్ఈకేఆర్టీసీ (కర్ణాటకలోని ఈశాన్య ఆర్టీసీ) మాత్రమే పచ్చజెండా ఊపింది. దాని పరిధిలోని యాద్గిర్, రాయచూర్, బీదర్, గుల్బర్గాలకు సోమవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు ఆ ప్రాంతంలో లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో ఆ సమయాల్లో బస్సులు వెళ్లి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక కర్ణాటక ఆర్టీసీ పరిధిలోని బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు ఇంకా అనుమతి రాలేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రాపూర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు మంగళవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ముంబై, పుణే లాంటి దూరప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు తిప్పే అవకాశం లేదు. -
ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. లాక్డౌన్ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలివస్తున్నారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా వాహనాలను నిలిపివేస్తున్నాki. ఈ-పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరిన అని పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయడంతోరా.9 నుంచి ఉ. 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 తర్వాత గూడ్స్ వాహనాలకు అనుమతి నిరారించింది. అయితే జొమాటో, స్విగ్గిలాంటి ఆన్లైన్ డెలివరీకి అనుమతి ఉంది. చదవండి: లాక్డౌన్.. లాఠీలకు పని చెబుతున్న పోలీసులు -
సరిహద్దులు దాటి రయ్.. రయ్
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల తర్వాత తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆ వెంటనే ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటి ముందుకు వెళ్లటం విశేషం. కొత్త ఒప్పందం ప్రకారం.. తెలంగాణకు వచ్చే ఏపీ బస్సుల కంటే, ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సులే ఎక్కువ. సరిహద్దు నుంచి పరిశీలిస్తే తెలంగాణ భూభాగమే ఎక్కువగా ఉన్నందున టీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎక్కువగా నిర్ధారించారు. 826 టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీలో 1,61,258 కి.మీ.లు.. 638 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర తిరగనున్నాయి. తెలంగాణ ప్రతిపాదన ప్రకారమే.. రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రాంత భూ భాగంలో వెసులుబాటు ఆధారంగా సింహ భాగం ఆ ప్రాంత డిపో బస్సులే తిరిగేలా షెడ్యూల్స్ రూపొందించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒప్పందం జరగకపోవడంతో అవి అలాగే కొనసాగాయి. ఫలితంగా ఏపీ పరిధిలో టీఎస్ఆర్టీసీ బస్సులు తక్కువగా, తెలంగాణ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎక్కువగా తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు దాన్ని మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచించారు. ఆ మేరకే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దా ని ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.03 లక్షల కి.మీ. మేర తెలంగాణలో తక్కువగా తిరగాల్సి వస్తోంది. దీనికి బదులు టీఎస్ ఆర్టీ సీ కూడా అంతమేర ఎక్కువగా బస్సులు తిప్పుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది. కానీ అది నష్టమే తెస్తుందని గట్టిగా పేర్కొన్న తెలంగాణ, ఏపీ కూడా అంతమేర తగ్గించడమే రెండు ఆర్టీసీలకు మంచిదని వాదించింది. ఇప్పుడు ఆ మేరకే రెండు ఆర్టీసీలు ఒప్పం దం చేసుకున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ ఈడీలు వినోద్‌కుమార్, వెంకటేశ్వర్లు, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఏపీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే బస్సులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒప్పందంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో బస్టాండ్లకు పెద్దగా ప్రయాణికులు రాలేదు. దీంతో పరిమిత సంఖ్యలో సర్వీసులు నడిపారు. రాత్రి సర్వీసులకు కొంత రద్దీ పెరిగింది. మంగళవారం నుంచి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా సర్వీసుల సంఖ్య పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా.. మంచి ఒప్పందం కోవిడ్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందంలో కొంత జాప్యంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగలేదు. కాస్త ఆలస్యమైనా ఇప్పుడు మంచి ఒప్పందం కుదిరింది. ఇది రెండు ఆర్టీసీలకు మేలు చేస్తుంది. ఈ ఒప్పందం సామరస్యపూర్వకంగా కుదరడంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఏపీ రవాణా మంత్రి పేర్నినాని, ఏపీ–తెలంగాణ ఎండీలు కృష్ణబాబు, సునీల్‌శర్మ, ఈడీలు ఎంతో కృషి చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. – మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ -
మూడున్నర దశాబ్దాలైనా.. పూర్తికాని ‘లెండి ప్రాజెక్టు’
సాక్షి, కామారెడ్డి : అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ‘లెండి’కి ని ధుల గ్రహణం వీడడం లేదు. మూడున్నర దశాబ్దాలు గడచినా పనులు పూర్తికావడంలేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడున్నర దశాబ్దాల క్రితం పునాదిరాయి పడింది. ఈ ప్రాజెక్టు కింద ఇరు రాష్ట్రాల్లో కలిపి 60వేల పైచిలుకు ఎకరాల భూములకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ నిర్మాణ పనులకు, భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు కొనసాగడం లేదు. ప్రాజెక్టు పనులు పూర్తయితే వెనుకబడిన ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో దాదాపు 22వేల ఎకరాల మెట్ట భూములు సాగులోకి వస్తాయి. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు లెండి ప్రాజెక్టు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ముంపు రైతులకు పునరావాసం కింద అందించాల్సిన డబ్బులు అప్పట్లో పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పెండింగులో పడిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి కాకున్నా కెనాల్ పనులు చేపట్టిన దృశ్యం లెండి సామర్థ్యం 6.36 టీఎంసీలు.. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా గోజేగావ్ గ్రామం వద్ద లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6.36 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో మహారాష్ట్రకు 3.93 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 2.43 టీఎంసీల నీటిని వాడుకునేలా నిర్ణయించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54.55కోట్లు.. ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన 1984 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54.55 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో నిధుల సమస్య, భూసేకరణ వంటి సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పనులు ఆగిపోవడంతో ఇప్పుడు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటింది. అప్పట్లో ముంపు గ్రామాల రైతులకు పరిహారం విషయంలో అసంపూర్తి చెల్లింపులు జరగడంతో నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని దెగ్లూర్, ముఖేడ్ తాలూకాల పరిధిలోని గ్రామాల్లో 39,275 ఎకరాల ఆయకట్టుకు, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదించారు. 75శాతం పనులు పూర్తి.... గోజేగావ్ వద్ద చేపట్టిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా, 10 గేట్ల నిర్మాణం అప్పుడే పూర్తయ్యింది. మరో నాలుగు గేట్ల నిర్మాణాలు పూర్తి కావలసి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత లెండి ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు కోసం రూ . 43.14 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సంబంధించి కెనాల్స్ పనులు జరిగాయి. కాని ప్రాజెక్టు పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.554.54 కోట్లని తేల్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 42 శాతం కింద రూ.236.10 కోట్లు, మిగతా మొత్తం రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.189.73 కోట్లు విడుదల చేసింది. అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. పరిహారమే అసలు సమస్య... మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం విషయంలో అక్కడి ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం వల్లే సమస్య పరిష్కారం కావడంలేదని అంటున్నారు. ఏటేటా అంచనా వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.వెయ్యి కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లే లెండి పనులు పూర్తి కాలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్తో ప్రాజెక్టులపై జరిగిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ లెండి ప్రాజెక్టు సమస్యపై కూడా చర్చించారు. అయినప్పటికీ సమస్య కొలిక్కిరావడం లేదు. రైతుల ఆశలు నెరవేరడం లేదు. జల వనరుల శాఖతోనైనా న్యాయం జరిగేనా.... రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖలోని ఆయా విభాగాలన్నింటినీ కలిపి జలవనరుల శాఖను ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఎత్తిపోతల పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 22వ ప్యాకేజీతో సహా అన్నింటినీ కామారెడ్డిలో ఏర్పాటు చేయబోయే చీఫ్ ఇంజనీర్ పరిధిలోకి తీసుకువచ్చారు. పరిపాలనా సౌలభ్యం కలుగనున్నందున లెండి ప్రాజెక్టు సమస్యపై పర్యవేక్షణ, పరిశీలనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లెండి ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మద్నూర్, బిచ్కుంద ప్రాంత రైతాంగం వేడుకుంటోంది. ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం... మాకు ఎలాంటి నీటి సౌకర్యం లేదు. లెండి ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తయని ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. అప్పట్లో కాలువలు తవ్వి, లైనింగ్ జేసిండ్రు. నీళ్లు వచ్చినట్టేనని సంబరపడ్డం. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. నీళ్ల సౌకర్యం లేక వానల మీద ఆధారపడి ఆరుతడి పంటలు వేస్తున్నం. కాలువలు వస్తే మా కష్టాలు తీరుతయి. –రాములు, రైతు, మద్నూర్ లెండి నీళ్లు వస్తయని చెపుతూనే ఉన్నరు... లెండి నీళ్లు వస్తయని, నీళ్లొస్తే మా భూములకు నీటి కష్టం తీరుతదని ఎదురు చూస్తున్నం. మస్తు సంవత్సరాల నుంచి లెండి ముచ్చట చెప్పుతనే ఉన్నరు. ఎప్పుడు కట్టుడు అయిపోతుందో, నీళ్లు ఎప్పుడు వస్తయో తెలుస్తలేదు. వానలు పడితేనే మాకు పంటలు, లేకుంటే ఇబ్బందులు తప్పడం లేదు. సర్కారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆదుకోవాలె. –నాగనాథ్, రైతు, మద్నూర్ -
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
– రూ.4.35 లక్షలు విలువ చేసే సొమ్ములు రికవరీ కర్నూలు: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరా పర్యవేక్షణలో పలువురు సీఐలు, ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి చోరీ కేసులలో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చెన్నమ్మ సర్కిల్లోని హైవే బ్రిడ్జి కింద అనుమానాస్పదస్థితిలో తిరుగుతుండగా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన తెలుగు నాగిరెడ్డి, కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ సద్దాం హుసేన్, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన కుతాటి హరికుమార్‌ను పోలీసులుఅదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరచరిత్ర బయటపడింది. వారి వద్ద నుంచి సుమారు రూ.4.35 లక్షలు విలువ చేసే 14.50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని శనివారం అదనపు ఎస్పీ షేక్షావలి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దొంగల వివరాలను వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్: నాగిరెడ్డి, సద్దాం హుసేన్ జల్సాలకు అలవాటు పడి నేరాల బాట పట్టారు. తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుని ముందుగా రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడేవారు. వీరిపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో పలు పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయి. కుతాటి హరికుమార్ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడ నాగిరెడ్డి, సద్దాం హుసేన్తో పరిచయం ఏర్పడింది. చిన్నప్పటి నుంచే చోరీలకు పాల్పడుతూ జైలుకు వెళ్లి తిరిగి బెయిల్‌పై రావడం, మళ్లీ చోరీలకు పాల్పడటం వీరికి అలవాటుగా మారింది. ఏడాది క్రితం ముగ్గురు నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, బళ్లారి ప్రాంతాల్లో ఇటీవల ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పలుమార్లు వీరు జైలు జీవితం గడిపినప్పటికీ మార్పు రాలేదు. కర్నూలులోని నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు ఇళ్లలో, ఒకటి, రెండు పోలీస్స్టేషన్ల పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు అదనపు ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో కృషి చేసిన సీఐలు లక్ష్మయ్య, నాగరాజరావు, ఎస్ఐలు నారాయణ, శ్రీనివాసులు, రమేష్ బాబు, లక్ష్మయ్య, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్, కానిస్టేబుళ్లు సుదర్శన్, నాగరాజు, రవికిషోర్, సమీర్ తదితరులను అదనపు ఎస్పీ అభినందించారు. -
వీడు మామూలోడు కాదు!
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్ –నిందితునిపై ఏపీ, తెలంగాణలో 17 కేసులు - హత్య కేసులో జైలుకు.. మరో హత్య కేసులో విచారణ - సెల్‌ఫోన్ చోరీ కేసులో వెలుగు చూసిన నేరాలు –రూ.12 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ద్విచక్రవాహనం స్వాధీనం –అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి వెల్లడి తిరుపతి క్రైం: అంతర్రాష్ట్ర గజ దొంగను గురువారం సాయంత్రం రేణిగుంట, చంద్రగిరి హైవేరోడ్డులోని రామానుజపల్లె క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతనిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయని, హత్య కేసులో జైలుకూ వెళ్లాడని, మరో హత్య కేసు నడుస్తోందని చెప్పారు. ఓ సెల్‌ఫోన్ చోరీ కేసుకు సంబంధించి చేసిన విచారణలో అతని దారుణ కృత్యాలు, చోరీలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. శుక్రవారం అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పెద్దపూజార్లు గ్రామానికి చెందిన నారా బసవరాజు అలియాస్ రాజు, అలియాస్ మహేష్(38) ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని బుధగేరిలో నివాసం ఉంటున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయగా, 19 ఏళ్లుగా అతను ఎన్నో నేరాలకు పాల్పడినట్లు తేలింది. గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడ తనతో పాటు నేరస్తుడైన ఇబ్రహీం అనే వ్యక్తిని 2003లో గొడవ పడి చంపేశాడు. ఆ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అయితే ఆ కేసు కొన్ని రోజుల తరువాత కొట్టేశారు. అలాగే, తనతోపాటు చోరీలకు పాల్పడే స్వగ్రామానికి చెందిన సలీంను కూడా పాతకక్షలతో 2011లో చంపేశాడు. ఆ కేసులో కోర్టులో శిక్ష పడగా దానిపై ఇతను అప్పీలుకెళ్లాడు. 2010లో బళ్లారి నుంచి ఇన్నోవా కారును బాడుగకు మాట్లాడుకుని ఇద్దరు స్నేహితులతో కలసి విజయవాడకు వెళ్లే దారిలో అద్దంకి సర్కిల్ పరిధిలో డ్రైవర్‌ను హతమార్చి, కారును తీసుకెళ్లాడు. ఇంకా ఆ కేసు పెండింగ్‌లో ఉంది. నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనంలో ఎన్బీడబ్ల్యూ కేసు పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఉంటూ వనస్థలిపురం, ఎల్బి.నగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. 2015 నవంబర్ 5న నంద్యాల జైలు నుంచి బయటకు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్ జిల్లా మాధవవరం, బెంగళూరులో బుధగేరిలో కాపురం ఉంటూ రాజంపేట, బద్వేల్, మార్గాపురం, ఆదోని, ఆత్మకూర్, గుంతకల్, అనంతపురం, మదనపల్లె, ఒంగోలు, గూడూరు, నెల్లూరు తిరుపతిలో చోరీలకు పాల్పడ్డాడు. అలా ఇళ్లలో చోరీ వస్తువులను ఆదోనిలో బంగారు వ్యాపారస్తులకు అమ్మేశాడు. అలాగే హోస్పేట్లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో, మరో ఫైనాన్స్ కంపెనీలో కుదువపెట్టి బంగారు ఆభరణాలు విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, నందలూరు, ఒంగోలు ప్రాంతాల్లో చోరీ కేసులకు సంబంధించి వస్తువులను మాధవరంలో నిందితుడు నివాసం ఉన్న ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 250 గ్రాముల బంగారు, 9 కేజీల వెండి, టీవీ, సెల్‌ఫోన్, ట్యాబ్‌లు, మోటార్ సైకిళతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తి, దొంగతనాలకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఇతనిపై 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ఛేదించడంలో క్రైం ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ కొండారెడ్డి, సీఐలు సత్యనారాయణ, శరత్చంద్ర, పద్మలత, ఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌పిళ్లై, మోహన్‌గౌడ్, రామ్మూర్తి, సుదర్శన్‌రావు తదితరులు ఎంతగానో కృషి చేశారని, వీరందరికీ రివార్డులు వచ్చేలా చూస్తామని జయలక్ష్మి చెప్పారు. -
అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ అరెస్ట్
- సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు – ముఠాలోని మిగతా సభ్యుల కోసం గాలింపు - డీఎస్పీ వేణుగోపాల్ వెల్లడి ధర్మవరం రూరల్ : కర్ణాటక- ఆంధ్రప్రదేశ్‌లలో హైవేపై ఆగి ఉన్న లారీడ్రైవర్లను బెదిరించి వారి నుంచి నగదు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ అశోక్ అలియాస్ బాషాను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ వేణుగోపాల్ విలేకరులకు వెల్లడించారు. నెల రోజుల క్రితం ధర్మవరం మండలం సీతారాంపల్లి వద్ద హైవేపై ఐచర్‌ను ఆపి మూత్రం విసర్జన చేస్తున్న డ్రైవర్ మహేందర్‌పై దాడి చేసి, కత్తి చూపి అతని వద్ద నుంచి రూ.11వేల నగదు, వాచ్, సెల్‌ఫోన్‌ను దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసును రూరల్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ హారున్‌బాషా, ఏఎస్ఐ నాగప్ప, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పీసీలు శివ, నరేష్, వేణు, నల్లప్ప, సాయి, చక్రీ, లాలూ, సురేష్‌లు బృందంగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత లారీడ్రైవర్ సెల్‌ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోపిడీ దొంగ ఏ ప్రదేశంలో ఉన్నాడో కనుగొన్నారు. దాని ఆధారంగా గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే జంక్షన్ వద్ద అశోక్ అలియాస్బాషాను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 11 సెల్ఫోన్లు, ఒక టీవీఎస్ స్కూటర్, కత్తితో పాటు చోరీలకు ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీతారాంపల్లి వద్ద జరిగిన దోపిడీతో పాటు కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ల్ పరిధిలో జరిగిన పలు దోపిడీ ఘటనల్లో ఇతడు పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఇతను కర్ణాటకలోని బళ్లారికి చెందిన ముఠాలోని సభ్యుడిగా గుర్తించారు. ఈ ముఠాలో ఇతడితోపాటు పంజు, తమ్ముళ్ల రాజు, వెంకటేష్, ఎరికల చిన్న గంగ, అలియాస్ సింహాద్రి సభ్యులుగా ఉన్నారు. ఈ ముఠా సభ్యులు బళ్లారి గాంధీనగర్, చిప్పగిరి పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన పలు దోపిడీ కేసుల్లో పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు. మిగతా సభ్యుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
– రూ.1.80 లక్షలు నగదు స్వాధీనం – వైఎస్ జగన్ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో చేతివాటం – శ్రీశైలం నుంచి బండిఆత్మకూరు వరకు రోడ్‌షోను అనుసరించిన ‘ముఠా’ - ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో వీరిపై కేసులు కర్నూలు: రోడ్‌షోలు, బహిరంగ సభలు లక్ష్యంగా చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ‘ముఠా’ ఆటకట్టించారు పోలీసులు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 17 మంది దొంగలను ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీ సుప్రజతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 17 మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా అనేక నేరాలకు పాల్పడ్డారు. రైతు భరోసా యాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ముఠాసభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ నేతృత్వంలో ఆత్మకూరు సీఐలు కృష్ణయ్య, శ్రీశైలం వన్‌టౌన్ ఎస్ఐ వరప్రసాద్, టూటౌన్ ఎస్ఐ ఓబులేసు, ఆత్మకూరు ఎస్ఐ లోకేష్‌కుమార్, కర్నూలు సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ మస్తాన్ తదితరులు దొంగలపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. ఆత్మకూరు, శ్రీశైలం పోలీసు స్టేషన్ల పరిధిలో వీరు పలు నేరాలకు పాల్పడ్డారు. శ్రీశైలం నుంచి బండి ఆత్మకూరు వరకు రైతు భరోసా యాత్రను అనుసరించి బహిరంగ సభ, రోడ్‌షోల్లో చేతివాటం ప్రదర్శించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో కూడా ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడిందన్నారు. భవిష్యత్తులో వీరిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీశైలంలోని శిఖరేశ్వరం వద్ద కొందరిని, ఆత్మకూరులోని చక్రం హోటల్ వద్ద మరికొందరిపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. మొత్తం 12 కేసుల్లో వీరు దొంగలించిన సొత్తుకు సంబంధించి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన మూడు బైకులు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరందరిపై సస్పెక్ట్ సీట్లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వారి వేలి ముద్రలను సేకరించి పోలీసు శాఖ ఆన్లైన్లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ప్రిన్స్అనే కొత్త యంత్రాన్ని త్వరలో అమలులోకి తెస్తున్నామని, ఇకపై దొంగలు, రౌడీషీట్ల ఆటలు చెల్లవని ఎస్పీ వెల్లడించారు. పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.నిందితులను ఆత్మకూరు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరిచారు. ముఠాలోని నిందితుల వివరాలు - షేక్ అహ్మద్ బాషా- అనంతపురం - బలిజ ఈశ్వరయ్య - గోసానిపల్లె, డోన్ - వడ్డె శివ - డోన్ - పూలకొమ్మ కేశవరావు - మార్కాపురం, ప్రకాశం దొండపాటు శ్రీనివాసుల- మార్కాపురం, ప్రకాశం గన్నవరపు శ్రీను - ఎర్రగుండపాలెం, ప్రకాశం పీట్ల ఉప్పతోళ్ల ఇస్రాయిల్ - కృష్ణాపురం, కర్నూలు కుంచాల కోటేశ్వరరావు - వినుకొండ, గుంటూరు మన్నెపల్లె శేషయ్య - పొద్దుటూరు, కడప ఇలగనూరు నాగరాజు - కోటంవేడు, నెల్లూరు సముద్రాల యాకోబ్ - నెల్లూరు కాలటి ప్రతాప్ - ఈవూరుపాలెం, ప్రకాశం చల్లా శ్యాములు - సాకచెర్ల, నెల్లూరు సాతుపాటి సాయి - వైకుంఠాపురం - ప్రకాశం తమ్మిశెట్టి చంద్రశేఖర్ - సిద్ధాపురం, కర్నూలు వేముల రాంబాబు - సిద్ధాపురం, కర్నూలు ఆకు విజయ్ - పెడవళ్లి, అనంతపురం -
అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా అరెస్ట్
పెనుగొండ : పెనుగొండ సర్కిల్ పరిధిలోని రాపాక బ్రిడ్జి వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 కేసులతో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కారు, బంగారు ఆభరణాలు, రెండు మోటారుసైకిళ్లు, నాలుగు ఎల్సీడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం రాపాక వద్ద ఇరగవరం ఎస్సై జీజే ప్రసాద్‌తో కలిసి సీఐ సీహెచ్ రామారావు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఏపీ 37 బీఎల్ 7799 కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని పాత నేరస్తులు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రకు చెందిన జక్కంశెట్టి నాగరాజు (27), కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన గుత్తికొండ పవ¯ŒSకుమార్ (30), హైదరాబాదు ఎల్బీ నగర్‌కు చెందిన ఆవుల కిరణ్‌కుమార్ (27)గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 400 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు టీవీలు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించడంతో నేరాలు బయటపడ్డాయి. జిల్లాలోని ఇరగవరంలో మూడు, పెనుమంట్రలో మూడు చోరీలు, తణుకులో ఓ చోరీ, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అర్బ¯ŒS పరిధిలో 10 చోరీలు, ఇతర పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు, విశాఖ జిల్లాలో 7 చోరీలు, కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఓ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు చోరీ చేసిన బంగారు ఆభరణాలు అమ్మి రేనాల్ట్ కారును కొని మండపేట కేంద్రంగా ఇతర జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా 1,160 గ్రాముల బంగారు ఆభరణాలు వీరు చోరీ చేసినట్టు గుర్తించారు. వీటిలో పెనుగొండ సర్కిల్ పరిధిలో 400 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. జైలులో ముఠాగా మారి.. ఎవరికి వారు దొంగతనాలు చేసుకొని జీవించే వీరికి జైలు జీవితం నలుగురిని కలిపి ముఠాగా చేసింది. గుత్తికొండ పవ¯Œకుమార్, జక్కంశెట్టి నాగరాజు జైలు నుంచి బయటకు వచ్చి పసుపులేటి కిరణ్‌కుమార్‌ను బెయిల్‌పై బయటకు తీసుకువచ్చారు. అదేవిధంగా ఏలూరులో జైలులో ఉన్న ఆవుల కిరణ్‌కుమార్‌ను బెయిల్‌పై తీసుకువచ్చి తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభించారు. నలుగురు కలవడంతో చోరీలు యథేచ్ఛగా సాగాయి. అయితే, వాటల వద్ద విభేదాలు రావడంతో పసుపులేటి కిరణ్‌కుమార్ విడిపోయి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు పసుపులేటి కిరణ్‌కుమార్ కోసం వేట ప్రారంభించారు. కిరణ్‌కుమార్ చిక్కితే మరింత బంగారం బయట పడవచ్చని అంచనా వేస్తున్నారు. పలు పోలీస్‌స్టేçÙన్లలో వీరిపై నా¯ŒSబెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెనుగొండ సర్కిల్ పరిధిలోని పెనుమంట్ర, ఇరగవరం కేసులకు సంబంధించి అరెస్ట్ చేసి ముగ్గురు నేరస్తులు జక్కంశెట్టి నాగరాజు, గుత్తికొండ పవ¯ŒSకుమార్, ఆవుల కిరణ్‌కుమార్‌ను కోర్టుకు హజరు పరుస్తున్నట్టు డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. చోరీ కేసుల ఛేదించడంలో ఎస్సై జీజే ప్రసాద్, కానిస్టేబుల్ వెంకట్రావును అభినందిస్తూ రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రాంగోపాల్‌పేట్: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ కల్పిస్తామని మభ్యపెట్టి దృష్టి మరల్చి బ్యాగులతో ఉడాయించే ఓ అంతర్రాష్ట్ర ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఐదుగురు నిందితులను జైలుకు తరలించగా మరో ముగ్గురు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్(25) రామ్‌బాలక్ కుమార్(19), సరోజ్ కుమార్ (19) వికాస్ కుమార్ (19), రవిశంకర్ కుమార్(24)లతో పాటు ముగ్గురు మైనర్లతో అదే రాష్ట్రం సీతమర్తి జిల్లాకు చెందిన రోషన్ ముఠాను ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం నగరానికి వచ్చిన ఈ ముఠా ఉప్పల్ చిలకానగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ప్రతి రోజు సికింద్రాబాద్బాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసి రైల్వే టికెట్ బెర్తు దొరకని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను గమనిస్తూ ఉంటారు. వారి వద్దకు వెళ్లి తెలిసిన టీటీల ద్వార టికెట్ కన్ఫాం చేయిస్తామని మభ్యపెట్టి వారి వద్ద ఉండే విలువైన బ్యాగులను తస్కరించి అక్కడి నుంచి జారుకుంటారు. నేరాలు చేసేదిలా.. ముఠాలోని 9 మంది కలిసి మూడు బృంధాలుగా ఏర్పడతారు. ఒక బృందం టికెట్ కన్ఫాం కాని వారిని గుర్తించి వారి వద్దకు వెళ్లి మాటలు కలుపుతారు. ప్రయాణికుడి లగేజీని ముఠాలోని సభ్యుల వద్ద ఉంచి దూరంగా ఉన్న బృందంలోని మరో వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్లి టీటీగా చూపిస్తారు. మీరు ఇక్కడే ఉంటే టీటీ పనిచేయడని వారిని అక్కడే ఉంచి టీటీగా చూపించిన వ్యక్తిని మరింత దూరంగా తీసుకుని వెళ్లి అక్కడి నుంచి అటే మాయమైపోతారు. ఇక్కడ లగేజితో ఉన్న మరో ముఠా బ్యాగులతో ఉడాయిస్తుంది. అటు తర్వాత ప్రయాణికులు మోసపోయామని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.25వేల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రోషన్ పరారీలో ఉన్నాడు. -
అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
అనంతపురం సెంట్రల్ : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడే ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను అనంతపురం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షలు విలువ చేసే 23 తులాల బంగారు, 8 తులాల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సీసీఎస్ డీఎస్పీ నాగసుబ్బన్న, వన్‌టౌన్ సీఐ రాఘవన్ దొంగల వివరాలను విలేకరులకు తెలిపారు. ధర్మవరం మండలం ఎర్రగుంట్లకు చెందిన మదన రామాంజనేయులు, సాతుపాటి శంకర్, అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీకి చెందిన దూదేకుల బాబాఫకృద్దీన్ హమాలీలు. తాగుడు, జూదం తదితర వ్యసనాలకు అలవాటు పడిన వీరు తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారు. జిల్లాలోనే కాకుండా కర్ణాటకలోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవల అనంతపురం శారదానగర్, హౌసింగ్ బోర్డు కాలనీలోlదొంగతనాల పాల్పడ్డారు. సీఐ రాఘవన్‌కు అందిన సమాచారంతో రూరల్ మండలం సోములదొడ్డి వద్ద ఉన్న వీరిని అరెస్ట్ చేశారు. -
అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
వేములవాడ (కరీంనగర్): కరీంనగర్ జిల్లా వేములవాడలో అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారినుంచి 32 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతోపాటు ద్విచక్రవాహనం, ఐదువేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూర్ మం.పాతదాంరాజ్ పల్లికి చెందిన పల్లెపు రాజేష్ (25), నిజామాబాద్ జిల్లా పెర్కిట్ కు చెందిన పల్లెపు రాజు (25), సారంగాపూర్ మం.గణేష్ పల్లికి చెందిన సూర సాయిలు కలిసి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 19 దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ జోయెల్ డేవిస్ తెలిపారు. వీరితో పాటూ.. ఒంటరిగా వెళ్ళే మహిళలపై అఘాహిత్యాలకు పాల్పడి బంగారం దోచుకెళ్ళే జూలపల్లి మండల కేంద్రానికి చెందిన గనవేని మహేష్ (23) ను అరెస్ట్ చేసి 1.72 గ్రా.ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
గో..గో.. తూ.గో.
- ముంపు గ్రామాల విలీనంతో భారీగా విస్తరించనున్న జిల్లా - ఏజెన్సీ వైపు మరో 80 కి.మీ. ముందుకు జరగనున్న సరిహద్దు - అటు ‘పశ్చిమ గోదావరి’తోనూ మారనున్న పొలిమేరలు సాక్షి, రాజమండ్రి : ‘ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగమొకటేనన్నా..’ తెలంగాణకు చెందిన సి.నారాయణరెడ్డి (సినారే) కలం నుంచి జాలువారిన తేనెమూటల్లాంటి సినిమా పాటల్లో ఒకానొక గీతంలోని పంక్తి ఇది. ‘తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది’ అన్న ఆ పాటలో ఆయన ఆకాంక్షించింది తెలుగువారు ఎన్నటికీ ఒకటిగానే ఉండాలని. కారణాలు ఏవైనా..మూడుసీమల ముప్పేట వంటి రాష్ట్రం రెండు ముక్కలవుతోంది. సినారే పాట బాటలోనే.. ‘రాష్ట్రాలు వేరైనా.. మన రాగబంధం ఒకటేనన్నా’ అని రెండు ప్రాంతాల ప్రజలూ అనుకోగలిగినా సాంకేతికంగా విభజనరేఖలు తప్పవు. నిన్నటి వరకు ‘మన గడ్డ’ అన్న భావనతో స్వేచ్ఛగా తిరిగిన చోటే ఆంక్షలను చ వి చూడకతప్పదు. భద్రాద్రిలో కొలువైన కోదండరాముడు.. మనకు రేపు కూడా అంతే దూరంలో ఉంటా డు. అయితే.. ఆ రఘురాముడిని దర్శించుకోవడానికి ‘రాష్ట్ర సరిహద్దు’ను దాటి వెళ్లక తప్పదు. రాష్ట్ర విభజనతో తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల మధ్యను న్న ఏజెన్సీ ప్రాంతం అంతర్ రాష్ట్ర సరిహద్దుగా మారి పోతోంది. ముంపు గ్రామాల విలీనం అనంతరం కొత్త సరిహద్దులను నిర్ధారించాల్సి ఉంది. తెలంగాణ అపాయింటెడ్ డే అయిన జూన్ రెండు సమీపిస్తున్నా ఇంకా ఆ కసరత్తు పూర్తికాలేదు. మారేడుమిల్లి నుంచి మరీ ముందుకు.. రాజమండ్రికి 80, కాకినాడకు 113 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లి జిల్లాలో చివరి మం డలం. మారేడుమిల్లి తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోని తులసిపాకలతో ఖమ్మం జిల్లా చింతూరు మం డలం మొదలవుతుంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలోని (తులసిపాకలకు 10 కి.మీ. దూ రం) లక్కవరం సెంటర్ వద్ద వై.రామవరం మండ లం డొంకరాయి, మంగంపాడులతో పాటు, విశాఖ జిల్లా సీలేరు ప్రాంతాలకు వెళ్లే క్రాస్ రోడ్డు ఉంటుంది. అసలు గ్రామాలు ఉండని ఈ తావు వరకూ తూర్పుగోదావరి, విశాఖ జిల్లా వాసులే ఎక్కువగా సంచరిస్తుంటారు. ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చింతూరు, కూనవరం, వర రామచంద్రపురంలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు ఆర్డినెన్స్ వచ్చింది. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా భద్రాచలం మండలాన్ని కూడా తూర్పుగోదారిలో కలిపేస్తున్నందున పాత సరిహద్దులు చెరిగిపోనున్నాయి. మన జిల్లా సరిహద్దులు విస్తరించనున్నాయి. ఇకపై భద్రాచలానికి ముందు తగిలే సీతారాంపురం వరకూ తూర్పుగోదావరి జిల్లా పరిధి ఉంటుంది. మారేడుమిల్లి నుంచి భద్రాచలం 117 కిలోమీటర్లు. ప్రస్తుతం మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ముగిసిపోయే మన జిల్లా సరిహద్దు భద్రాచలానికి సుమారు ఏడు కిలోమీటర్ల ముందు వరకూ.. మారేడుమిల్లికి 110 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించనుంది. అంటే ఈవైపు మన జిల్లా అదనంగా మరో 80 కిలోమీటర్ల వరకూ విస్తరించనుందన్న మాట. అలాగే ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో మరికొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం కానున్నందున ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కూడా విస్తరించనుంది. అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టు ఎక్కడో? ముంపు గ్రామాల విలీ నంపై ఆర్డినెన్స్ ఆమోదం పొందక ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సరిహద్దు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు దాటాక వచ్చే తులసిపాకలగా భావించారు. పాలనా సౌలభ్యం, భద్రతల రీత్యా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును మారేడుమిల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఇది మన రాష్ట్రం తరపున తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు కలిపి ఉమ్మడి చెక్‌పోస్టు కాగలదు. కానీ కొత్త సరిహద్దుల ప్రకారం మన రాష్ట్ర చెక్‌పోస్టు చింతూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని చట్టి సెంటర్ వద్ద ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లకు ఉమ్మడిగా ఏర్పాటు చేయాలి. లేదంటే భద్రాచలం సమీపంలోని సీతారాంపురం, గూడాల, కానాపురం గ్రామ శివార్లలో ఏదో ఒక అనువైన ప్రాంతం ఎంచుకుని తనిఖీ కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రకారం విలీన గ్రామాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుది సరిహద్దులు ప్రకటించాల్సి ఉంది. జూన్ రెండున తెలంగాణ అపాయింటెడ్ డే కన్నా ముందే ఈ సరిహద్దులపై ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అందరిలోనూ ఏమవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.