– రూ.1.80 లక్షలు నగదు స్వాధీనం
– వైఎస్ జగన్ రోడ్‌షోలు,
బహిరంగ సభల్లో చేతివాటం
– శ్రీశైలం నుంచి బండిఆత్మకూరు
వరకు రోడ్‌షోను అనుసరించిన ‘ముఠా’
- ఢిల్లీ, చెన్నై, బెంగళూరు,
హైదరాబాద్ ప్రాంతాల్లో వీరిపై కేసులు
కర్నూలు: రోడ్‌షోలు, బహిరంగ సభలు లక్ష్యంగా చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ‘ముఠా’ ఆటకట్టించారు పోలీసులు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 17 మంది దొంగలను ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీ సుప్రజతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 17 మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా అనేక నేరాలకు పాల్పడ్డారు. రైతు భరోసా యాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ముఠాసభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ నేతృత్వంలో ఆత్మకూరు సీఐలు కృష్ణయ్య, శ్రీశైలం వన్‌టౌన్ ఎస్‌ఐ వరప్రసాద్, టూటౌన్ ఎస్‌ఐ ఓబులేసు, ఆత్మకూరు ఎస్‌ఐ లోకేష్‌కుమార్, కర్నూలు సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ మస్తాన్ తదితరులు దొంగలపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. ఆత్మకూరు, శ్రీశైలం పోలీసు స్టేషన్ల పరిధిలో వీరు పలు నేరాలకు పాల్పడ్డారు. శ్రీశైలం నుంచి బండి ఆత్మకూరు వరకు రైతు భరోసా యాత్రను అనుసరించి బహిరంగ సభ, రోడ్‌షోల్లో చేతివాటం ప్రదర్శించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో కూడా ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడిందన్నారు. భవిష్యత్తులో వీరిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీశైలంలోని శిఖరేశ్వరం వద్ద కొందరిని, ఆత్మకూరులోని చక్రం హోటల్ వద్ద మరికొందరిపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. మొత్తం 12 కేసుల్లో వీరు దొంగలించిన సొత్తుకు సంబంధించి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన మూడు బైకులు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరందరిపై సస్పెక్ట్ సీట్లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వారి వేలి ముద్రలను సేకరించి పోలీసు శాఖ ఆన్‌లైన్‌లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ప్రిన్స్‌అనే కొత్త యంత్రాన్ని త్వరలో అమలులోకి తెస్తున్నామని, ఇకపై దొంగలు, రౌడీషీట్ల ఆటలు చెల్లవని ఎస్పీ వెల్లడించారు. పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.నిందితులను ఆత్మకూరు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరిచారు.
ముఠాలోని నిందితుల వివరాలు
- షేక్ అహ్మద్ బాషా- అనంతపురం
- బలిజ ఈశ్వరయ్య - గోసానిపల్లె, డోన్
- వడ్డె శివ - డోన్
- పూలకొమ్మ కేశవరావు - మార్కాపురం, ప్రకాశం
దొండపాటు శ్రీనివాసుల- మార్కాపురం, ప్రకాశం
గన్నవరపు శ్రీను - ఎర్రగుండపాలెం, ప్రకాశం
పీట్ల ఉప్పతోళ్ల ఇస్రాయిల్ - కృష్ణాపురం, కర్నూలు
కుంచాల కోటేశ్వరరావు - వినుకొండ, గుంటూరు
మన్నెపల్లె శేషయ్య - పొద్దుటూరు, కడప
ఇలగనూరు నాగరాజు - కోటంవేడు, నెల్లూరు
సముద్రాల యాకోబ్ - నెల్లూరు
కాలటి ప్రతాప్ - ఈవూరుపాలెం, ప్రకాశం
చల్లా శ్యాములు - సాకచెర్ల, నెల్లూరు
సాతుపాటి సాయి - వైకుంఠాపురం - ప్రకాశం
తమ్మిశెట్టి చంద్రశేఖర్ - సిద్ధాపురం, కర్నూలు
వేముల రాంబాబు - సిద్ధాపురం, కర్నూలు
ఆకు విజయ్ - పెడవళ్లి, అనంతపురం