అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రాంగోపాల్‌పేట్: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ కల్పిస్తామని మభ్యపెట్టి దృష్టి మరల్చి బ్యాగులతో ఉడాయించే ఓ అంతర్రాష్ట్ర ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఐదుగురు నిందితులను జైలుకు తరలించగా మరో ముగ్గురు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్(25) రామ్‌బాలక్ కుమార్(19), సరోజ్ కుమార్ (19) వికాస్ కుమార్ (19), రవిశంకర్ కుమార్(24)లతో పాటు ముగ్గురు మైనర్లతో అదే రాష్ట్రం సీతమర్తి జిల్లాకు చెందిన రోషన్ ముఠాను ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం నగరానికి వచ్చిన ఈ ముఠా ఉప్పల్ చిలకానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ప్రతి రోజు సికింద్రాబాద్‌బాద్ రైల్వే స్టేషన్‌లో మాటు వేసి రైల్వే టికెట్ బెర్తు దొరకని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను గమనిస్తూ ఉంటారు. వారి వద్దకు వెళ్లి తెలిసిన టీటీల ద్వార టికెట్ కన్‌ఫాం చేయిస్తామని మభ్యపెట్టి వారి వద్ద ఉండే విలువైన బ్యాగులను తస్కరించి అక్కడి నుంచి జారుకుంటారు.
నేరాలు చేసేదిలా..
ముఠాలోని 9 మంది కలిసి మూడు బృంధాలుగా ఏర్పడతారు. ఒక బృందం టికెట్ కన్‌ఫాం కాని వారిని గుర్తించి వారి వద్దకు వెళ్లి మాటలు కలుపుతారు. ప్రయాణికుడి లగేజీని ముఠాలోని సభ్యుల వద్ద ఉంచి దూరంగా ఉన్న బృందంలోని మరో వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్లి టీటీగా చూపిస్తారు. మీరు ఇక్కడే ఉంటే టీటీ పనిచేయడని వారిని అక్కడే ఉంచి టీటీగా చూపించిన వ్యక్తిని మరింత దూరంగా తీసుకుని వెళ్లి అక్కడి నుంచి అటే మాయమైపోతారు. ఇక్కడ లగేజితో ఉన్న మరో ముఠా బ్యాగులతో ఉడాయిస్తుంది. అటు తర్వాత ప్రయాణికులు మోసపోయామని గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.25వేల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రోషన్ పరారీలో ఉన్నాడు.