- సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు
– ముఠాలోని మిగతా సభ్యుల కోసం గాలింపు
- డీఎస్పీ వేణుగోపాల్ వెల్లడి
ధర్మవరం రూరల్ : కర్ణాటక- ఆంధ్రప్రదేశ్‌లలో హైవేపై ఆగి ఉన్న లారీడ్రైవర్లను బెదిరించి వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లే అంతర్‌రాష్ట్ర దోపిడీ దొంగ అశోక్ అలియాస్ బాషాను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం డీఎస్పీ వేణుగోపాల్ విలేకరులకు వెల్లడించారు. నెల రోజుల క్రితం ధర్మవరం మండలం సీతారాంపల్లి వద్ద హైవేపై ఐచర్‌ను ఆపి మూత్రం విసర్జన చేస్తున్న డ్రైవర్ మహేందర్‌పై దాడి చేసి, కత్తి చూపి అతని వద్ద నుంచి రూ.11వేల నగదు, వాచ్, సెల్‌ఫోన్‌ను దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసును రూరల్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ హారున్‌బాషా, ఏఎస్‌ఐ నాగప్ప, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పీసీలు శివ, నరేష్, వేణు, నల్లప్ప, సాయి, చక్రీ, లాలూ, సురేష్‌లు బృందంగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
బాధిత లారీడ్రైవర్ సెల్‌ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోపిడీ దొంగ ఏ ప్రదేశంలో ఉన్నాడో కనుగొన్నారు. దాని ఆధారంగా గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే జంక‌్షన్ వద్ద అశోక్ అలియాస్‌బాషాను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు, ఒక టీవీఎస్ స్కూటర్, కత్తితో పాటు చోరీలకు ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
సీతారాంపల్లి వద్ద జరిగిన దోపిడీతో పాటు కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ల్ పరిధిలో జరిగిన పలు దోపిడీ ఘటనల్లో ఇతడు పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఇతను కర్ణాటకలోని బళ్లారికి చెందిన ముఠాలోని సభ్యుడిగా గుర్తించారు. ఈ ముఠాలో ఇతడితోపాటు పంజు, తమ్ముళ్ల రాజు, వెంకటేష్, ఎరికల చిన్న గంగ, అలియాస్ సింహాద్రి సభ్యులుగా ఉన్నారు. ఈ ముఠా సభ్యులు బళ్లారి గాంధీనగర్, చిప్పగిరి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన పలు దోపిడీ కేసుల్లో పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు. మిగతా సభ్యుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.
అంతర్‌రాష్ట్ర దోపిడీ దొంగ అరెస్ట్
Published Fri, Jan 27 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
Advertisement
Advertisement